అనంత శ్రీరామ్, నాజర్, ప్రకాశ్‌రాజ్, విక్రమ్, సుహాసిని, మణిరత్నం, కార్తీ, తనికెళ్ల భరణి, ‘దిల్’ రాజు
‘‘పొన్నియిన్ సెల్వన్’ తీయడం గర్వంగా ఉంది. ఈ చిత్రాన్ని అందరూ ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను’’ అని ప్రముఖ దర్శకుడు మణిరత్నం అన్నారు. విక్రమ్, ‘జయం’ రవి, కార్తీ, ఐశ్వర్యా రాయ్, త్రిష, ఐశ్వర్యా లక్ష్మి, శరత్‌కుమార్, విక్రమ్ ప్రభు, శోభిత ధూళిపాళ, ప్రకాశ్‌రాజ్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘పొన్నియిన్ సెల్వన్’. మణిరత్నం దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ నిర్మించిన ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కానుంది. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళంలో తెరకెక్కిన ఈ సినిమా తొలి భాగాన్ని ‘పీయస్–1’ని సెప్టెంబర్ 30న విడుదల చేస్తున్నారు. అనంత శ్రీరామ్ రాసిన ఈ చిత్రంలోని ‘చోళ చోళ..’ అనే పాటను హైదరాబాద్‌లో విడుదల చేశారు.
ఈ వేడుకలో మణిరత్నం మాట్లాడుతూ– ‘‘చిరంజీవిగారికి థ్యాంక్స్ చెప్పాలి. కానీ, అది ఎందుకనేది చెప్పను. తర్వాత మీకే తెలుస్తుంది. రాజమౌళిగారి వల్లే ఇలాంటి (పొన్నియిన్ సెల్వన్) చిత్రాలు తీయగల మనే ధైర్యం వచ్చింది. రెండు భాగాలుగా ఇలాంటి సినిమాలు తీసి మెప్పించవచ్చని నిరూపించారు. అందుకు ఆయనకు థ్యాంక్స్. నా బిడ్డలాంటి ఈ చిత్రం తెలు గులో ఇక ‘దిల్’ రాజుగారిదే’’ అన్నారు.
‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘మణిరత్నంగారి ‘అమృత’ సినిమా వల్లే నిర్మాతగా మారి, 50 చిత్రాలు నిర్మించాను. ఇప్పుడు ‘పొన్నియిన్ సెల్వన్’ని రిలీజ్ చేసే చాన్స్ ఇచ్చిన మణిరత్నంగారికి థ్యాంక్స్’’ అన్నారు. విక్రమ్ మాట్లాడుతూ– ‘‘మణి సార్‌తో గతంలో ‘రావణ్’ సినిమా చేశాను. ఇప్పుడు ‘పొన్నియిన్ సెల్వన్’. మణిగారితో సినిమా అంటే కల నెరవేరడం వంటిది. మణిగారు, శంకర్‌గారితో సినిమా చేస్తే ఇక రిటైర్ అవ్వొచ్చని అనుకున్నాను.. అంత అద్భుతమైన చిత్రాలు చేస్తారు’’ అన్నారు.
కార్తీ మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రంలో మంచి పాత్ర చేశాను. వెయ్యేళ్ల క్రితం జరిగిన చరిత్రను చూపించేందుకు రాబోతున్నాం’’ అన్నారు. ‘‘ఈ చిత్రంలో దాదాపు 50 పాత్రలుంటాయి.. నేనూ భాగమైనందుకు ఆనందంగా ఉంది’’ అన్నారు తనికెళ్ల భరణి. ‘‘అన్ని భాషల్లో నటించి, పాన్ ఇండియన్ నటుడు అవడం వేరు. కానీ దక్షిణాది నుంచి తన మేకింగ్ ఆఫ్ స్టైల్‌తో పాన్ ఇండియన్ డైరెక్టర్ అయిన ఏకైక వ్యక్తి మణిరత్నంగారు’’ అన్నారు ప్రకాశ్‌రాజ్.
‘‘కల్కి రాసిన ‘పొన్నియిన్ సెల్వన్’ నవలను సినిమాగా తెరకెక్కించాలని ఎంజీఆర్, కమల్ వంటి వారెందరో ప్రయత్నించారు. కానీ మణిరత్నంగారి వల్లే సాధ్యం అయింది’’ అన్నారు నాజర్. సుహాసినీ మణిరత్నం మాట్లాడుతూ– ‘‘ఇది మీ డ్రీమ్ ప్రాజెక్టా? అంటే కాదు ఇష్టమైన చిత్రం అని మావారు (మణిరత్నం) అన్నారు. నేను ఆయన్ను ఇష్టపడ్డాను. ఆయన ఈ చిత్రాన్ని ఇష్టపడ్డారు. అంటే మీరు (ప్రేక్షకులు) కూడా ఈ చిత్రాన్ని ఇష్టపడాలి (నవ్వుతూ)’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment