వైభవంగా నలభై నట వసంతాల వేడుక
‘‘శివాజీ గణేశన్, ఆశాభోంస్లే, రాధిక, బాలమురళీకృష్ణ, జానకి , పి.సుశీల వంటి వారెందర్నో నా ఆధ్వర్యంలో సత్కరించడం ఒక ఎత్తై.. మోహన్‌బాబును సత్కరిస్తుండ డం మరో ఎత్తు. ఆయన గ్రేట్ ఆర్టిస్ట్. నాకు మంచి ఆత్మీయుడు. నటుడిగా, నిర్మాతగా కళారంగానికి సేవ చేస్తున్నాడు. విద్యాసంస్థలు స్థాపించి పేద విద్యార్థులకు చేయూతనిస్తున్నాడు’’ అని కళాబంధు టి.సుబ్బరామిరెడ్డి తెలిపారు.
మోహన్‌బాబు నటుడిగా నలభై ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా శనివారం వైజాగ్‌లో సుబ్బరామిరెడ్డి ఆధ్వర్యంలో ‘నలభై నట వసంతాల వేడుక’ వైభవంగా జరగనుంది. ఈ సందర్భంగా టీయస్సార్ మాట్లాడుతూ- ‘‘ఈ వేడుకకు దక్షిణ, ఉత్తరాది నుంచి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరవుతున్నారు.
దాసరి నారాయణరావు, చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, శ్రీదేవి, జయప్రద, జయసుధ, అనుష్క, కాజల్ తదితరులు పాల్గొంటారు’’ అని చెప్పారు. హీరోలు విష్ణు, మనోజ్ మాట్లాడుతూ- ‘‘సుబ్బరామిరెడ్డి అంకుల్ పుట్టినరోజున నాన్నగారి వేడుక జరుపుకోవడం సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమానికి ఇండస్ట్రీలోని పెద్దలతో పాటు నాన్నగారితో, మాతో పాటు కలిసి నటించిన యాక్టర్స్ హాజరవుతారు’’ అని చెప్పారు.