నాలుగు పాత్రల్లో నారాయణమూర్తి
విప్లవ చిత్రాలకు కేరాఫ్ చిరునామా ఆర్. నారాయణమూర్తి తన తాజా చిత్రం ‘రాజ్యాధికారం’ కోసం ఒక ప్రయోగం చేశారు. రైతు రామయ్యగా, అతని ముగ్గురు కుమారులుగా 4 పాత్రలు పోషించారు. ‘‘వేషాల పిచ్చితో నేను మద్రాసు వెళ్ళా. ‘ఇద్దరు మిత్రులు’లో అక్కి నేని ద్విపాత్రాభియనం మొదలు, తమిళ ‘నవరాత్రి’లో శివాజీ గణేశన్ 9 పాత్రలు, ‘దానవీర శూర కర్ణ’లో ఎన్టీఆర్ 3 పాత్రలు, కమలహాసన్ ‘దశావతారం’ లో 10 పాత్రలు - ఇలా మహానుభావులెందరో అనన్య సామాన్యంగా బహు పాత్ర పోషణ చేశారు. వాళ్ళ స్ఫూర్తితో ఈ చిత్రంలో కథానుగుణంగా 4 వేషాలు వేస్తున్నా. ఆ మహామహులతో నాకు పోలిక లేదు కానీ, ఏదో పిల్లగాణ్ణి నా ప్రయత్నం చేస్తున్నా’’ అని నారాయణమూర్తి అన్నారు.
ముగ్గురు కొడుకుల పాత్రల్లో ఒకటి ముస్లిము వద్ద పెరిగే అయూబ్ పాత్ర. మరొకటి ఉద్యమకారుడు శంకరన్న అయితే, మూడోది తండ్రి దగ్గర పెరిగిన అమాయకపు అర్జునుడు పాత్ర. ప్రతి పాత్రా భిన్నంగా ఉంటుంది. ‘‘చట్టం ముందు అందరూ సమానులే అన్నది ఆచరణలో సాధ్యం కాకపోతే, ప్రజలకు ప్రజాస్వామ్యంపై నమ్మకం పోతుంది. అలా జరగరాదని చెప్పేదే మా ‘రాజ్యాధికారం’’’ అన్నారు. అన్నట్లు, యెప్పటి లానే తెర వెనుక కూడా కథ, కథనం, మాటలు, ఫొటోగ్రఫీ, సంగీతం, దర్శకత్వం, నిర్మాతగా ఆయన బహుపాత్ర పోషణ చేయడం గమనార్హం.