Four characters
-
మళ్లీ ఊపిరి పోసింది
‘‘ఓటు మనింటి ఆడబిడ్డ లాంటిది. ఆడబిడ్డకు పెళ్లి చేసేటప్పుడు... కుర్రాడి అటు ఏడు తరాలు, ఇటు ఏడు తరాలు చూసినట్టే... ఓటు వేసేటప్పుడు ఆ అభ్యర్థి ఎలాంటోడు? కేరక్టర్ ఎలాంటిది? అనే విషయాలు కూడా గమనించాలి... ఇది దాదాసాహెబ్ అంబేద్కర్ మాట. మా ‘రాజ్యాధికారం’ చిత్రానికి ప్రేరణ ఈ మాటే’’ అన్నారు ఆర్.నారాయణమూర్తి. ఆయన నాలుగు పాత్రలు పోషించి, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రం ఇటీవల విడుదలైంది. ఈ చిత్రం విజయవంతంగా ప్రదర్శితమవుతోందని నారాయణమూర్తి చెబుతూ-‘‘ఆరోవారం కూడా విజయవంతంగా ఎనిమిది సెంటర్లలో ప్రదర్శితమవుతోంది. నేను పోషించిన నాలుగు పాత్రల్లో తండ్రి పాత్రకు, అమాయకుడైన అర్జునుడి పాత్రకు మంచి స్పందన లభిస్తోంది. నటునిగా, దర్శకునిగా, నిర్మాతగా నాకు మళ్లీ ఊపిరి పోసిన సినిమా ఇది’’ అన్నారు. బడుగు, బలహీన వర్గాలపై అణచివేత ఆగకపోతే... తిరుగుబాటు తప్పదని హెచ్చరించిన సినిమా ఇదనీ, ఒక మంచి సందేశాత్మకంగా తీసిన ఈ చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు వందనాలనీ నారాయణమూర్తి అన్నారు. -
నాలుగు పాత్రల్లో నారాయణమూర్తి
విప్లవ చిత్రాలకు కేరాఫ్ చిరునామా ఆర్. నారాయణమూర్తి తన తాజా చిత్రం ‘రాజ్యాధికారం’ కోసం ఒక ప్రయోగం చేశారు. రైతు రామయ్యగా, అతని ముగ్గురు కుమారులుగా 4 పాత్రలు పోషించారు. ‘‘వేషాల పిచ్చితో నేను మద్రాసు వెళ్ళా. ‘ఇద్దరు మిత్రులు’లో అక్కి నేని ద్విపాత్రాభియనం మొదలు, తమిళ ‘నవరాత్రి’లో శివాజీ గణేశన్ 9 పాత్రలు, ‘దానవీర శూర కర్ణ’లో ఎన్టీఆర్ 3 పాత్రలు, కమలహాసన్ ‘దశావతారం’ లో 10 పాత్రలు - ఇలా మహానుభావులెందరో అనన్య సామాన్యంగా బహు పాత్ర పోషణ చేశారు. వాళ్ళ స్ఫూర్తితో ఈ చిత్రంలో కథానుగుణంగా 4 వేషాలు వేస్తున్నా. ఆ మహామహులతో నాకు పోలిక లేదు కానీ, ఏదో పిల్లగాణ్ణి నా ప్రయత్నం చేస్తున్నా’’ అని నారాయణమూర్తి అన్నారు. ముగ్గురు కొడుకుల పాత్రల్లో ఒకటి ముస్లిము వద్ద పెరిగే అయూబ్ పాత్ర. మరొకటి ఉద్యమకారుడు శంకరన్న అయితే, మూడోది తండ్రి దగ్గర పెరిగిన అమాయకపు అర్జునుడు పాత్ర. ప్రతి పాత్రా భిన్నంగా ఉంటుంది. ‘‘చట్టం ముందు అందరూ సమానులే అన్నది ఆచరణలో సాధ్యం కాకపోతే, ప్రజలకు ప్రజాస్వామ్యంపై నమ్మకం పోతుంది. అలా జరగరాదని చెప్పేదే మా ‘రాజ్యాధికారం’’’ అన్నారు. అన్నట్లు, యెప్పటి లానే తెర వెనుక కూడా కథ, కథనం, మాటలు, ఫొటోగ్రఫీ, సంగీతం, దర్శకత్వం, నిర్మాతగా ఆయన బహుపాత్ర పోషణ చేయడం గమనార్హం. -
నాలుగు పాత్రల్లో నారాయణమూర్తి
‘‘ప్రజాసేవకన్నా రాజ్యాధికారమే కొంతమంది రాజకీయ నాయకులకు ఎక్కువైంది. పదవి కోసం ఎన్ని మొసలి కన్నీళ్లయినా కారుస్తారు.. అమాయక ప్రజలకు అరచేతిలో స్వర్గం చూపిస్తారు. స్వార్థపూరిత రాజకీయాలతో నాయకులు దిగజారిపోతున్నారు. ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాన్ని నెరవేర్చని అలాంటి నాయకులపై ప్రజలు ఎలా తిరగబడాలి? అనే కథాంశంతో రూపొందించిన చిత్రం ఇది’’ అని ఆర్. నారాయణమూర్తి చెప్పారు. ఆయన హీరోగా నటించి, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘రాజ్యాధికారం’. ఈ నెల 31న విడుదల కానున్న ఈ సినిమా గురించి ఆర్. నారాయణమూర్తి మాట్లాడుతూ -‘‘దళిత కూలీ అయిన రామయ్య రైతుగా ఎదుగుతుంటే ఓర్వలేక పెద్దలు అతన్ని ఏ విధంగా హింసించారు? న్యాయం కోసం న్యాయస్థానానికి వెళ్లిన రామయ్యకు ఎదురైన అనుభవం అనేది ప్రధాన ఇతివృత్తం. ఈ కథకు రాజకీయ నేపథ్యాన్ని జోడించాం. ఇటీవల జరిగిన ఎన్నికల గురించి కూడా ఇందులో ప్రస్తావించాం. మంచి, చెడుల మధ్య పోరాటమే ఈ చిత్రం. ఇందులో నాలుగు పాత్రలు చేశాను. ఇప్పటికే పాటలు శ్రోతలను ఆకట్టుకున్న నేపథ్యంలో ఈ నెల 27న ప్లాటినమ్ డిస్క్ వేడుక జరపనున్నాం’’ అని చెప్పారు. తనికెళ్ల భరణి, తెలంగాణ శకుంత, అమరేంద్ర, అయూబ్, వీరభద్రం, దయాకర్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.