నాలుగు పాత్రల్లో నారాయణమూర్తి
‘‘ప్రజాసేవకన్నా రాజ్యాధికారమే కొంతమంది రాజకీయ నాయకులకు ఎక్కువైంది. పదవి కోసం ఎన్ని మొసలి కన్నీళ్లయినా కారుస్తారు.. అమాయక ప్రజలకు అరచేతిలో స్వర్గం చూపిస్తారు. స్వార్థపూరిత రాజకీయాలతో నాయకులు దిగజారిపోతున్నారు. ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాన్ని నెరవేర్చని అలాంటి నాయకులపై ప్రజలు ఎలా తిరగబడాలి? అనే కథాంశంతో రూపొందించిన చిత్రం ఇది’’ అని ఆర్. నారాయణమూర్తి చెప్పారు. ఆయన హీరోగా నటించి, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘రాజ్యాధికారం’.
ఈ నెల 31న విడుదల కానున్న ఈ సినిమా గురించి ఆర్. నారాయణమూర్తి మాట్లాడుతూ -‘‘దళిత కూలీ అయిన రామయ్య రైతుగా ఎదుగుతుంటే ఓర్వలేక పెద్దలు అతన్ని ఏ విధంగా హింసించారు? న్యాయం కోసం న్యాయస్థానానికి వెళ్లిన రామయ్యకు ఎదురైన అనుభవం అనేది ప్రధాన ఇతివృత్తం. ఈ కథకు రాజకీయ నేపథ్యాన్ని జోడించాం.
ఇటీవల జరిగిన ఎన్నికల గురించి కూడా ఇందులో ప్రస్తావించాం. మంచి, చెడుల మధ్య పోరాటమే ఈ చిత్రం. ఇందులో నాలుగు పాత్రలు చేశాను. ఇప్పటికే పాటలు శ్రోతలను ఆకట్టుకున్న నేపథ్యంలో ఈ నెల 27న ప్లాటినమ్ డిస్క్ వేడుక జరపనున్నాం’’ అని చెప్పారు. తనికెళ్ల భరణి, తెలంగాణ శకుంత, అమరేంద్ర, అయూబ్, వీరభద్రం, దయాకర్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.