కార్పొరేట్ సేన!
* మన గ్యాస్‌ను గుజరాత్‌కు తరలిస్తుంటే మోడీకి మద్దతు ఇవ్వడమేంటి?
* చేగువేరాను వల్లించే పవన్‌కు రిలయన్స్ దోపిడీ అన్యాయమనిపించలేదా?
* ఉద్యమం జరుగుతున్నప్పుడు విభజనపై ఎందుకు మాట్లాడలేదు?
* పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నల పరంపర
ఇంటర్వ్యూ: ఆర్.నారాయణమూర్తి: బొల్లోజు రవి, ఎలక్షన్ సెల్
ఆర్.నారాయణమూర్తి... విప్లవ సినిమాలకు కేరాఫ్ అడ్రస్. సినిమాలు తీయడంలోనే కాదు ప్రజల పక్షాన క్షేత్రస్థాయికి వెళ్లి పోరాడే వ్యక్తి. కేజీ బేసిన్‌లో రిలయన్స్ దోపిడీకి వ్యతిరేకంగా పోరాడారు. కోస్తాంధ్రలో పుట్టినా, తెలంగాణ ఉద్యమంపై సినిమా తీయడమే కాదు, స్వయంగా అందులో పాల్గొన్నారు. సోంపేట, కాకరాపల్లి ఉద్యమాల్లోనూ పాల్గొన్నారు. అలాంటి నారాయణమూర్తి పవన్‌కల్యాణ్ పార్టీ జనసేన కార్పొరేట్ సేనగా మిగిలిపోతుందని అభిప్రాయపడ్డారు. ఆయనతో సాక్షి ప్రతినిధి ప్రత్యేక ఇంటర్వ్యూ ఆయన మాటల్లోనే...
పవన్ కళ్యాణ్ స్పం దిస్తాడు. ఆవేశపరుడు. ‘ఇజం’ రాశాడు. పార్టీ పెట్టాడు. మంచిదే. కానీ గుజరాత్ వెళ్లి నరేంద్రమోడీని కలిసి మద్దతు ఇస్తామనడమే నాకు నచ్చలేదు. పవన్ కళ్యాణ్ ఒకటి గుర్తించాలి. కృష్ణా, గోదావరి (కేజీ) బేసిన్ నుంచి ఉత్పత్తి అవుతున్న చమురు నిక్షేపాల ఫలాలు మొత్తం స్థానికంగా ఉన్న వారికి చెందాలి. కానీ దాన్నంతా పైపుల ద్వారా గుజరాత్‌కు తరలించుకుపోతున్నారు. ముఖేష్ అంబానీ ఈ సంపదను దోపిడీ చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆ సంపదను అంబానీకి కట్టబెట్టడం దుర్మార్గం. గుజరాత్‌లో గ్యాస్ సిలెండర్ 250 రూపాయలు అమ్ముకుంటూ, ఇక్కడ మాత్రం 800 రూపాయలకు అమ్ముతున్నారు. స్థానికంగా గ్యాస్ దొరకుతున్నప్పుడు ఇక్కడ వంద రూపాయలకే అమ్మాలి. గుజరాత్‌లో వెయ్యి రూపాయలకు అమ్మాలి. కానీ ఇక్కడి ప్రజల సంపదను అక్కడకు దోచుకెళ్లేట్లు చేస్తున్నాడు మోడీ. ఆయన తన సొంత రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటున్నాడు. ఇక్కడి వారికి అన్యాయం చేస్తున్నాడు. కేజీ బేసిన్ చమురు నిక్షేపాల సంపద మాదంటే మాదని అనిల్ అంబానీ, ముఖేష్ అంబానీ కొట్టుకుంటున్నారు.
కోర్టులకూ ఎక్కారు. ఇది ఎవడబ్బ సొమ్ము? జాతి సంపద కాదా? ప్రజలకు ఈ రకంగా అన్యాయం జరుగుతుంటే... అందుకు కారణమైన మోడీకి పవన్ కళ్యాణ్ ఎలా మద్దతు పలుకుతాడు? అక్కడ అభివృద్ధి జరుగుతోందని చెప్పాడు. ఈ దోపిడీ ఎలా అభివృద్ధి అవుతుంది? పవన్‌కు ఒకటే విన్నవిస్తున్నా... ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ ఉంటానంటున్నారు. కేజీ బేసిన్ ఆయిల్‌ను ఓఎన్‌జీసీ కనుగొన్నది. కేంద్రాన్ని మేనేజ్ చేసి దాన్ని రిలయన్స్ దక్కించుకుంది. ముఖేష్ అంబానీ అక్కడి చమురును బ్లాక్ చేస్తూ ఇష్టానుసారంగా రేట్లు పెంచుతున్నాడు. ఈ అన్యాయానికి వ్యతిరేకంగా పవన్ ఉద్యమం చేయాల్సింది పోయి మోడీకి మద్దతు పలుకుతాడా? మేం రిలయన్స్ దోపిడీకి వ్యతిరేకంగా ఉద్యమాలు చేశాం. పవన్‌ని కూడా కోరుతున్నా దానికి వ్యతిరేకంగా పోరాటం చేయాలని. ఆయన పోరాటం చేయగలరా? ప్రజల పక్షాన నిలిస్తేనే
అది జనసేన అవుతుంది.
లేకుంటే కార్పొరేట్ సేన అనిపించుకుంటుంది. పవన్ కళ్యాణ్ పదేపదే చేగువేరా, భగత్‌సింగ్‌ల గురించి చెబుతుంటారు. చేగువేరా అంతర్జాతీయ విప్లవవాది. ఆయన సామ్రాజ్యవాదానికి, పెట్టుబడిదారీ విధానానికి వ్యతిరేకంగా పోరాడాడు. భగత్‌సింగ్ దేశ స్వాతంత్రం కోసం, సామ్రాజ్యవాదానికి, పెట్టుబడిదారీ విధానానికి వ్యతిరేకంగా పోరాడాడు. అలాంటి చేగువేరా, భగత్‌సింగ్‌ల గురించి ప్రస్తావించే పవన్‌కళ్యాణ్ రిలయన్స్‌కు వ్యతిరేకంగా పనిచేయాలి. రాష్ట్ర విభజన సరిగా జరగలేదని పవన్ చెప్తున్నారు. ఎలా విభజన చేయాలో ఆయన ముందెందుకు చెప్పలేదు? తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు విభజన ఎలా చేయాలో చెప్పి ఉండాలి కదా! తెలంగాణ కోసం అనేకమంది అమరులైనప్పుడు, ఉద్యమం తీవ్రంగా ఉన్నప్పుడు ఎందుకు నోరు విప్పలేదు? అప్పుడేమీ మాట్లాడని పవన్ కళ్యాణ్ ఇప్పుడు మాట్లాడటంలో ఆంతర్యం ఏమిటి? ఇప్పుడు రెండు రాష్ట్రాలు ఎలా అభివృద్ధి పథంలోకి వెళ్లాలో మాట్లాడాలి. ఎలా పునర్నిర్మాణం జరగాలో చెబితే ప్రయోజనం ఉంటుంది.
సాయుధ పోరాటం...
తెలంగాణ అణచివేతకు గురైంది. దోపిడీకి గురైంది. ఆనాటి తెలంగాణ సాయుధ పోరాటంలో 10 లక్షల మంది పాల్గొన్నారు. భవిత కోసం, భుక్తి కోసం జరిగిన పోరాటం అది. పదివేల మంది అమరులయ్యారు. ఫ్రెంచి విప్లవం, రష్యా బోల్షివిక్ విప్లవం, చైనా విప్లవం విన్నాం. వాటికి ఏమాత్రం తగ్గని మహోన్నత పోరాటం అది. దురదృష్టవశాత్తు ఈ చరిత్రను పాఠ్య పుస్తకాల్లో చేర్చలేదు. స్వాతంత్ర పోరాటానికి ఎంత చరిత్ర ఉందో తెలంగాణ సాయుధ పోరాటానికి అంతే చరిత్ర ఉంది. అలాంటి దాన్ని పాఠ్యపుస్తకాల్లో చేర్చకపోవడం కుట్రలో భాగమే. ఇప్పటికైనా తెలంగాణ వచ్చింది కాబట్టి తెలంగాణ సాయుధ పోరాట చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చాలి.
ఒకప్పుడు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ సినిమా రంగం చెన్నై కేంద్రంగా ఉండేది. మద్రాసు నుంచి మనం విడిపోయినా సినిమా పరిశ్రమ చాన్నాళ్లు అక్కడే ఉండిపోయింది. తర్వాత హైదరాబాద్ తరలి వచ్చింది. ఇక్కడ బ్రహ్మాండంగా అభివద్ధి చెందింది. హిందీ మాట్లాడే రాష్ట్రాలు తొమ్మిది ఉన్నాయి. ముంబై కేంద్రంగా హిందీ పరిశ్రమ నడుస్తున్నప్పుడు... రెండు తెలుగు రాష్ట్రాలకు హైదరాబాద్ కేంద్రంగా ఉంటే తప్పేంటి? కళకు హద్దులు లేవు. అయితే సీమాంధ్రలోనూ అంటే విశాఖ లేదా విజయవాడ లేదా తిరుపతిల్లో సినీ స్టుడియోలు నిర్మించాలి. ఆ చిత్రాలను ఇక్కడ ఆదరించాలి. ఇక్కడి సినిమాలను అక్కడ ఆదరించాలి. హైదరాబాద్ నుంచి సిని పరిశ్రమ కొనసాగుతూనే సీమాంధ్రలోనూ సినీరంగం అభివద్ధి చెందాలి. అన్నదమ్ముల్లా అందరూ కలిసి ఉండాలి. తెలంగాణలో వచ్చే ప్రభుత్వం ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ పెట్టాలి. దానికో శాఖను ఏర్పాటు చేయాలి. స్టుడియోలు నిర్మించాలి.
ఆంధ్ర వికాసం...
ఎక్కడ చిన్న రాష్ట్రాలు ఉంటాయో అక్కడ స్వేచ్ఛ స్వావలంబన ఉంటుంది. రెండు మూడు కోట్ల జనాభా దాటిన ప్రాంతాన్ని విడదీయాలని అంబేద్కర్ చెప్పారు. అనంతపురం, శ్రీకాకుళం వంటి వారు రాజధాని హైదరాబాద్ రావాలంటే దూరాభారం అవుతుంది. కాబట్టి పరిపాలన కేంద్రీకరణ వల్ల ఇబ్బందులు వస్తాయి. చిన్న రాష్ట్రాల వల్ల సంపద వికేంద్రీకరణ జరుగుతుంది. సీమాంధ్రతో కూడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి పెరుగుతుంది. వెయ్యి కిలోమీటర్ల మేర తీర ప్రాంతం ఉంది. తెలంగాణకు సింగరేణి ఎలాగో సీమాంధ్రకు తీర ప్రాంతం అలాంటిది. ఉమ్మడి రాష్ట్రాలుగా ఉన్నప్పుడు ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలు తీవ్రంగా వెనుకబడ్డాయి. హైదరాబాద్, దుబాయ్, గల్ఫ్ ప్రాంతాలకు వలస పోయారు. వాటిని రానున్న ప్రభుత్వం నివారించాలి.