Rajyadhikaram movie
-
సమాజ హితం కోసమే ‘రాజ్యాధికారం’
మెదక్టౌన్: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన మన దేశంలో దళిత, బడుగు, బలహీన వర్గాలకు రాజ్యాంగ ఫలాలు అందడం లేదని ప్రముఖ సినీ దర్శకుడు, నిర్మాత, నటుడు ఆర్.నారాయణమూర్తి పేర్కొన్నారు. మంగళవారం ఆయన మెదక్ వచ్చిన సందర్భంగా స్థానిక టీఎన్జీఓ భవన్లో విలేకరులతో మాట్లాడుతూ ఈనెల 19న విడుదల కానున్న రాజ్యాధికారం సినిమా ప్రజాస్వామ్యవాదులను, దళిత, బడుగు, బలహీన వర్గాల వారి మనస్సులను హత్తుకునేలా ఉంటుందన్నారు. సమాజ హితం కోసమే రాజ్యాధికారం సినిమా తీసినట్లు తెలిపారు. సామాజిక ఇతివృత్తాలతో తీస్తున్న సినిమాలకు ఆదరణ కరువవుతుందన్నారు. ప్రేమ, యాక్షన్ సినిమాలు కాకుండా సమాజాన్ని చైతన్యం చేసే సినిమాలు రావాలని అభిప్రాయ పడ్డారు. ప్రజాస్వామ్య దేశంలో ప్రతి పౌరుడు ఓటుహక్కును వినియోగించుకొని మంచి నాయకుడిని ఎన్నుకోవాలన్నారు. అప్పుడే ఆట్టడుగు వర్గాలకు రాజ్యాంగ ఫలాలు అందినట్లని అభిప్రాయపడ్డారు. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వాలు ప్రజా సంక్షేమానికి పాటు పడాలన్నారు. రెండు తెలుగు ప్రభుత్వాలు ఒకరినొకరు సహకరించుకొని సినిమా రంగాభివృద్ధికి తోడ్పాటు నందించాలన్నారు. సినిమా రంగంలో వ్యాపార దృక్పథం పెరిగిపోయిందన్నారు. తన సినిమాల పట్ల ప్రజలు చూపుతున్న ఆదరాభిమానాలను ఎప్పటికీ మర్చిపోలేనన్నారు. -
పాలకుల తీరును కళ్లకు కట్టిన ‘రాజ్యాధికారం’
చిక్కడపల్లి: రాజ్యాధికారం అంటే ఏమిటి, అది సాధిస్తే ఎలాంటి ప్రయోజనాలుంటాయో కళ్లకు కట్టినట్లు ఆర్.నారాయణమూర్తి తన ‘రాజ్యాధికారం’ సినిమాలో చూపించారని ప్రజా గాయకుడు గద్దర్ అన్నారు. సోమవారం గాంధీనగర్లోని ఉషా మయూరి థియేటర్లో ఆర్.నారాయణమూర్తి దర్శకత్వం వహించి నటించి నిర్మించిన రాజ్యాధికారం చిత్రాన్ని ఆయన వీక్షించారు. అనంతరం గద్దర్ మాట్లాడుతూ..దేశంలో 80 శాతమున్న దళితులు, బీసీలు, మైనార్టీలు ఎందుకు రాజ్యాధికారం సాధించలేకపోతున్నారో ఈ సినిమా కళ్లకు కట్టిందని పేర్కొన్నారు. రాజ్యాధికారం సాధించడం ద్వారా ఎలాంటి ప్రయోజనాలుంటాయో చక్కగా చూపించారని, అందువల్ల ఈ చిత్రం ప్రజలు తప్పకుండా చూడాల్సిన అవసరముందన్నారు. భారతదేశంలో ప్రజలే ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని, మీడియా, సినిమా ద్వారా సమాజాన్ని ఎలా రక్షించాలో నారాయణమూర్తి చూపించారని పేర్కొన్నారు. అనంతరం చిత్రదర్శకుడు ఆర్.నారాయణమూర్తి మాట్లాడుతూ మన దేశంలో ప్రజాస్వామ్యం పరిస్థితి అధ్వానంగా మారిందన్నారు. కోట్లు గుమ్మరించి ఓట్లు సాధిస్తున్నారని, ఈవిధానం పోవాలన్నారు. సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి, అణగారిని హక్కుల పరిరక్షన కమిటీ కన్వీనర్ ఎల్.ఎ.యాదగిరి, ఓయూ జేఏసీ నాయకులు అంబేడ్కర్, చిత్ర బృందం గద్దర్ వెంట ఉన్నారు. -
నాలుగు పాత్రల్లో నారాయణమూర్తి
విప్లవ చిత్రాలకు కేరాఫ్ చిరునామా ఆర్. నారాయణమూర్తి తన తాజా చిత్రం ‘రాజ్యాధికారం’ కోసం ఒక ప్రయోగం చేశారు. రైతు రామయ్యగా, అతని ముగ్గురు కుమారులుగా 4 పాత్రలు పోషించారు. ‘‘వేషాల పిచ్చితో నేను మద్రాసు వెళ్ళా. ‘ఇద్దరు మిత్రులు’లో అక్కి నేని ద్విపాత్రాభియనం మొదలు, తమిళ ‘నవరాత్రి’లో శివాజీ గణేశన్ 9 పాత్రలు, ‘దానవీర శూర కర్ణ’లో ఎన్టీఆర్ 3 పాత్రలు, కమలహాసన్ ‘దశావతారం’ లో 10 పాత్రలు - ఇలా మహానుభావులెందరో అనన్య సామాన్యంగా బహు పాత్ర పోషణ చేశారు. వాళ్ళ స్ఫూర్తితో ఈ చిత్రంలో కథానుగుణంగా 4 వేషాలు వేస్తున్నా. ఆ మహామహులతో నాకు పోలిక లేదు కానీ, ఏదో పిల్లగాణ్ణి నా ప్రయత్నం చేస్తున్నా’’ అని నారాయణమూర్తి అన్నారు. ముగ్గురు కొడుకుల పాత్రల్లో ఒకటి ముస్లిము వద్ద పెరిగే అయూబ్ పాత్ర. మరొకటి ఉద్యమకారుడు శంకరన్న అయితే, మూడోది తండ్రి దగ్గర పెరిగిన అమాయకపు అర్జునుడు పాత్ర. ప్రతి పాత్రా భిన్నంగా ఉంటుంది. ‘‘చట్టం ముందు అందరూ సమానులే అన్నది ఆచరణలో సాధ్యం కాకపోతే, ప్రజలకు ప్రజాస్వామ్యంపై నమ్మకం పోతుంది. అలా జరగరాదని చెప్పేదే మా ‘రాజ్యాధికారం’’’ అన్నారు. అన్నట్లు, యెప్పటి లానే తెర వెనుక కూడా కథ, కథనం, మాటలు, ఫొటోగ్రఫీ, సంగీతం, దర్శకత్వం, నిర్మాతగా ఆయన బహుపాత్ర పోషణ చేయడం గమనార్హం.