పాలకుల తీరును కళ్లకు కట్టిన ‘రాజ్యాధికారం’
చిక్కడపల్లి: రాజ్యాధికారం అంటే ఏమిటి, అది సాధిస్తే ఎలాంటి ప్రయోజనాలుంటాయో కళ్లకు కట్టినట్లు ఆర్.నారాయణమూర్తి తన ‘రాజ్యాధికారం’ సినిమాలో చూపించారని ప్రజా గాయకుడు గద్దర్ అన్నారు. సోమవారం గాంధీనగర్‌లోని ఉషా మయూరి థియేటర్‌లో ఆర్.నారాయణమూర్తి దర్శకత్వం వహించి నటించి నిర్మించిన రాజ్యాధికారం చిత్రాన్ని ఆయన వీక్షించారు. అనంతరం గద్దర్ మాట్లాడుతూ..దేశంలో 80 శాతమున్న దళితులు, బీసీలు, మైనార్టీలు ఎందుకు రాజ్యాధికారం సాధించలేకపోతున్నారో ఈ సినిమా కళ్లకు కట్టిందని పేర్కొన్నారు. రాజ్యాధికారం సాధించడం ద్వారా ఎలాంటి ప్రయోజనాలుంటాయో చక్కగా చూపించారని, అందువల్ల ఈ చిత్రం ప్రజలు తప్పకుండా చూడాల్సిన అవసరముందన్నారు.
భారతదేశంలో ప్రజలే ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని, మీడియా, సినిమా ద్వారా సమాజాన్ని ఎలా రక్షించాలో నారాయణమూర్తి చూపించారని పేర్కొన్నారు. అనంతరం చిత్రదర్శకుడు ఆర్.నారాయణమూర్తి మాట్లాడుతూ మన దేశంలో ప్రజాస్వామ్యం పరిస్థితి అధ్వానంగా మారిందన్నారు. కోట్లు గుమ్మరించి ఓట్లు సాధిస్తున్నారని, ఈవిధానం పోవాలన్నారు. సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి, అణగారిని హక్కుల పరిరక్షన కమిటీ కన్వీనర్ ఎల్.ఎ.యాదగిరి, ఓయూ జేఏసీ నాయకులు అంబేడ్కర్, చిత్ర బృందం గద్దర్ వెంట ఉన్నారు.