సమాజ హితం కోసమే ‘రాజ్యాధికారం’
మెదక్‌టౌన్: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన మన దేశంలో దళిత, బడుగు, బలహీన వర్గాలకు రాజ్యాంగ ఫలాలు అందడం లేదని ప్రముఖ సినీ దర్శకుడు, నిర్మాత, నటుడు ఆర్.నారాయణమూర్తి పేర్కొన్నారు. మంగళవారం ఆయన మెదక్ వచ్చిన సందర్భంగా స్థానిక టీఎన్జీఓ భవన్‌లో విలేకరులతో మాట్లాడుతూ ఈనెల 19న విడుదల కానున్న రాజ్యాధికారం సినిమా ప్రజాస్వామ్యవాదులను, దళిత, బడుగు, బలహీన వర్గాల వారి మనస్సులను హత్తుకునేలా ఉంటుందన్నారు.
సమాజ హితం కోసమే రాజ్యాధికారం సినిమా తీసినట్లు తెలిపారు. సామాజిక ఇతివృత్తాలతో తీస్తున్న సినిమాలకు ఆదరణ కరువవుతుందన్నారు. ప్రేమ, యాక్షన్ సినిమాలు కాకుండా సమాజాన్ని చైతన్యం చేసే సినిమాలు రావాలని అభిప్రాయ పడ్డారు. ప్రజాస్వామ్య దేశంలో ప్రతి పౌరుడు ఓటుహక్కును వినియోగించుకొని మంచి నాయకుడిని ఎన్నుకోవాలన్నారు. అప్పుడే ఆట్టడుగు వర్గాలకు రాజ్యాంగ ఫలాలు అందినట్లని అభిప్రాయపడ్డారు.
తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వాలు ప్రజా సంక్షేమానికి పాటు పడాలన్నారు. రెండు తెలుగు ప్రభుత్వాలు ఒకరినొకరు సహకరించుకొని సినిమా రంగాభివృద్ధికి తోడ్పాటు నందించాలన్నారు. సినిమా రంగంలో వ్యాపార దృక్పథం పెరిగిపోయిందన్నారు. తన సినిమాల పట్ల ప్రజలు చూపుతున్న ఆదరాభిమానాలను ఎప్పటికీ మర్చిపోలేనన్నారు.