‘ఎన్టీఆర్: కథానాయకుడు’ సినిమాలో కృష్ణకుమారిగా మెప్పించిన బొంగరాల కళ్ల అమ్మాయి ప్రణిత సుభాష్ శాకాహారమే తన అందానికి సగం కారణం అంటోంది. త్వరలో బాలీవుడ్‌లో మెరవనున్న ఈ ముద్దుగుమ్మ చెప్పిన ముచ్చట్లు....
డాక్టర్ల ఫ్యామిలీ
‘యాక్టర్ కాకపోయి ఉంటే డాక్టర్ అయ్యేదాన్ని’ అంటుంటారు. కాని నేను నిజంగానే డాక్టర్ అయ్యేదాన్ని. ఎందుకంటే మాది డాక్టర్ల కుటుంబం. అమ్మా,నాన్నలకు బెంగళూరులో హాస్పిటల్ ఉంది.
వృత్తిపరమైన బిజీలో మా వాళ్లు సినిమాలు అసలు చూడరు. ఇప్పుడిప్పుడే నా సినిమాలు చూస్తున్నారు. ఇక నా స్నేహితుల విషయానికి వస్తే ‘ఆహో ఒహో’ అనే టైప్ కాదు. వారికి ఏమాత్రం నచ్చకపోయినా ‘ఇదేం సినిమా!’ అంటారు. వాళ్లు ఎక్కువగా ఇంగ్లిష్ సినిమాలు చూస్తారు కాబట్టి....‘‘హాలీవుడ్‌లో నటించు’’ అని సలహా ఒకటి ఇస్తుంటారు!
డిష్యుం డిష్యుం!
పాటలే కాదు ఫైట్స్ అంటే కూడా నాకు ఇష్టం. అయితే ఫైట్లు చేసే ఛాన్సు హీరోలకే ఎక్కువ కదా! ‘డైనమెట్’ సినిమాలో ఫైట్లు చేసే అవకాశం వచ్చింది. ఛాలెంజ్‌గా అనిపించింది. ఎప్పుడోగాని ఇలాంటి అవకాశం రాదు కాబట్టి శ్రద్ధగా చేశాను. ఫస్ట్ హీరోయిన్, సెకండ్ హీరోయిన్....ఇలాంటివేమీ పట్టించుకోను. ఒక సినిమాకు ప్రతి పాత్ర ముఖ్యమైనది అని నా అభిప్రాయం. గ్లామర్‌రోల్స్ మాత్రమే చేయాలని నేనేమీ కంకణం కట్టుకోలేదు. డీగ్లామర్ రోల్ కూడా చేస్తాను. చేశాను కూడా. అడవి నేపథ్యంతో నడిచే ఒక కన్నడ సినిమా కోసం డీగ్లామర్‌గా నటించాను.
తెలుగు తెలుసు
నావరకైతే ఒక కొత్త భాష నేర్చుకోవాలంటే చాలా కష్టం. ఎలా వచ్చిం దో ఏమోగాని...ఇప్పుడు మాత్రం తెలుగు చక్కగా మాట్లాడగులుగుతున్నాను! మొదటి సారి తెలుగు స్క్రిప్ట్ ఇచ్చినప్పుడు సౌండ్స్‌తో బై హార్ట్ చేశాను. అప్పుడు తెలుగు ఏమీ తెలియదు. నా పేరు విని చాలామంది నేను తెలుగు అమ్మాయిని అనుకుంటారు!
నా బలం... బలహీనత
కష్టపడే తత్వం నా బలం. కష్టపడకుండా ఏ చిన్న అదృష్టం కూడా తలుపు తట్టదు. ఇక బలహీనత విషయానికి వస్తే అందరినీ గుడ్డిగా నమ్మేస్తాను. మరొకటి... మొహమాటం!నేను పనిలో ఉన్నప్పుడు ఎవరైనా వచ్చి...‘కాఫీ తాగివద్దాం’’ అన్నారు అనుకోండి.‘‘నేను పనిలో ఉన్నాను’’ అనలేను. ‘‘అయిదు నిమిషాల్లో వచ్చేస్తాను’’ అంటాను! ఇలాంటి మొహమాటలు వదులుకోవాలి. ఇక సినిమాల విషయానికి వస్తే... ‘డార్క్’ సినిమాల కంటే ఎంటర్‌టైన్‌మెంట్, ఫన్ సినిమాలంటేనే నాకు ఇష్టం.
Comments
Please login to add a commentAdd a comment