‘జెర్సీ’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు ‘సారా’గా పరిచయమైన శ్రద్ధా శ్రీనాథ్ డాక్టర్ కాబోయి యాక్టర్ కాలేదు. లాయర్‌గా ప్రాక్టీస్ చేసి మరీ యాక్టర్ అయ్యారు. ‘‘భవిష్యత్‌లో చేయబోయే తెలుగు సినిమాలలో నా పాత్రకు నేనే డబ్బింగ్ చెబుతాను’’ అంటున్న శ్రద్ధా గురించి కొన్ని ముచ్చట్లు...
లాయరమ్మ
శ్రద్ధా తండ్రి ఆర్మీ ఆఫీసర్. తల్లి స్కూల్ టీచర్. నాన్నగారి ఉద్యోగరీత్యా రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరఖాండ్, అస్సాం...రాష్ట్రాలలో చదువుకుంది. ఇక సికింద్రాబాద్‌లో 7 నుంచి 12వ తరగతి వరకు చదువుకుంది. ఆ తరువాత బెంగళూరులో ‘లా’ చదువుకుంది.
నాటకాలు
బెంగళూర్‌లో ‘లా’ పూర్తయిన తరువాత అదే నగరంలో రియల్ ఎస్టేట్ లాయర్‌గా పనిచేసింది. ఆ తరువాత ఒక ఫ్రెంచ్ రిటైల్ కంపెనీకి లీగల్ అడ్వైజర్‌గా పనిచేసింది. ఫుల్–టైమ్ కార్పొరేట్ ఉద్యోగం చేస్తూనే నాటకాల్లో నటించింది. ‘ఏ బాక్స్ ఆఫ్ షార్ట్స్’ ‘టేక్ ఇట్ ఆర్ లీవ్ ఇట్’...మొదలైన నాటకాలు శ్రద్ధాకు మంచి పేరు తీసుకువచ్చాయి. వ్యాపార ప్రకటనలు చేస్తున్న రోజుల్లో ఒక కన్నడ సినిమాలో కథానాయికగా ఎంపికైంది. అయితే ఆ సినిమా విడుదలకు నోచుకోలేదు. ఆ తరువాత ‘కోహినూర్’ అనే మలయాళ సినిమాలో నటించింది. ఇదంతా ఒక ఎత్తయితే 2016లో పనన్ కుమార్ దర్శకత్వంలో నటించిన కన్నడ సినిమా ‘యూ టర్న్’ పదిమంది దృష్టిలో పడేలా చేసింది.
ఊహించని ఛాన్సు!
మొదటిసారి అడిషన్‌కు వెళ్లినప్పుడు... ‘‘మీ కన్నడ కన్విన్సింగ్‌గా లేదు’’ అన్నాడు డైరెక్టర్.‘‘అయ్యో!’’ అనుకుంది శ్రద్ధా.‘‘ఈ సినిమాల్లో నాకు ఛాన్సు రావడం కష్టమే’’ అనుకుంది నిరాశగా. అయితే, మూడో అడిషన్‌కు మాత్రం తనను తాను రుజువు చేసుకుని మంచి మార్కులు కొట్టేసింది. ‘యూ టర్న్’ (కన్నడ)లో జర్నలిస్ట్ రచన పాత్రకు ఎంపికైన తరువాత... ఆ పాత్ర కోసం రీసెర్చ్ కూడా చేసింది.
బాలీవుడ్‌లో...
ఈ సంవత్సరం ‘మిలన్ టాకీస్’ సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగు పెట్టింది శ్రద్ధా. తిగ్మాంశు ధూలియా డైరెక్ట్ చేసిన ఈ సినిమా పెద్దగా ఆడనప్పటికీ శ్రద్ధా నటనకు మంచి గుర్తింపు వచ్చింది. ‘మైథిలి పాత్రకు ప్రాణం పోసింది’ అని రాశారు సినీ విమర్శకులు.
పీడకల!
‘నాటకాల్లో సరే...మిమ్మల్ని మీరు వెండి తెర మీద చూసుకోవడం ఎలా అనిపించింది?’ అని అడిగితే– ‘ప్రేక్షకుల సంగతేమిటోగానీ, నా వరకైతే నన్ను నేను వెండితెర మీద చూసుకోవడం పీడకలలా అనిపిస్తుంది’ అంటూ నవ్వేస్తుంది శ్రద్ధా శ్రీనాథ్!
Comments
Please login to add a commentAdd a comment