‘లవ్ ఫెయిల్యూర్’, ‘స్వామి రారా’, ‘దోచెయ్’, ‘త్రిపుర’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన తార... పూజా రామచంద్రన్. ‘బిగ్‌బాస్’ షోతో మరింత దగ్గరైన పూజా ‘లా’ సినిమాతో మరోసారి పలకరించింది. ఆమె తన గురించి తాను చెప్పిన ముచ్చట్లు కొన్ని...
అయ్యో!
కోయంబత్తూరులో విజువల్ కమ్యూనికేషన్ చదువుకున్నాను. యస్‌యస్ మ్యూజిక్‌లో వీజేగా చేస్తున్నప్పుడు చాలా సినిమా ఆఫర్లు వచ్చాయి. ‘నేను నటించగలనా!’ అనే భయంతో సారీ చెప్పేశాను. నేను వద్దనుకున్న కొన్ని సినిమాలు పెద్ద హిట్ అయినప్పుడు మాత్రం ‘అయ్యో’ అనిపించింది.‘లవ్ ఫెయిల్యూర్’లో నటించిన తరువాత మాత్రం... ‘ఫరవాలేదు. నేను నటించగలను’ అనే నమ్మకం వచ్చింది.
భయం వద్దు!
‘ఇదే ఫిల్మ్ ఇండస్ట్రీలో, ఇదే జానర్‌లో సుదీర్ఘకాలం పాటు నటించాలి’ అనే ఆశ లేదు. తొందరపాటు లేదు. నా కెరీర్‌గ్రాఫ్ గురించి సంతృప్తిగా ఉన్నాను. ఏ పని చేసినా సానుకూల దృక్పథంతో చేయడం మొదటి నుంచీ అలవాటు. ‘అలా జరుగుతుందేమో’ ‘ఇలా జరుగుతుందేమో’లాంటి ప్రతికూల ఆలోచనలను దగ్గరికి రానివ్వను.మనలో ప్రతికూల ఆలోచనలు ఉన్నప్పుడు ‘భయం’లో బందీలమవుతాం. ఒక అడుగు ముందుకు వేయడానికి కూడా భయపడతాం.
ఇలా అయితేనే...
నేను చేసే సినిమాలో అయిదు సీన్‌లు ఉన్నాయా, పది సీన్‌లు ఉన్నాయా అనే దాని గురించి ఆలోచించను. చేసే పాత్ర నాకు క్రియేటివ్ శాటిస్పెక్షన్ ఇవ్వడంతో పాటు స్క్రిప్ట్ నచ్చాలి. డైరెక్టర్ నచ్చాలి. నేను ఎవరితో కలిసి పనిచేస్తున్నాను అనేది కూడా పరిగణనలోకి తీసుకుంటాను.తిండిగింజల మీద రాసి పెట్టి ఉన్నట్లుగానే పాత్రల విషయంలోనూ జరుగుతుందని నమ్ముతాను.
హ్యాపీగా!
బిగ్‌బాస్ షో వల్ల ‘నేనేమిటి?’ అనేది తెలిసిపోతుంది.మరి నేనేమిటీ? ఎప్పుడూ హ్యాపీగా ఉండాలనుకుంటాను. పాజిటివ్‌గా ఆలోచిస్తాను. ఒకరి గురించి ఏదైనా అభిప్రాయం ఉంటే చాటుమాటుగా కాకుండా సూటిగా చెబుతాను. పారదర్శకంగా ఉండడానికి ప్రయత్నిస్తాను. ‘ఒక విషయం గురించి పదిమంది ఇలా అనుకుంటున్నారు. నేను కూడా అలా అనుకోకపోతే బాగోదు’ అనే మనస్తత్వం నాది కాదు.పదిమందికి ఒక అభిప్రాయం ఉన్నా, అది నా అభిప్రాయానికి సరిపోకపోతే విభేదిస్తాను!
Comments
Please login to add a commentAdd a comment