త్రిపుర రంజీ జట్టు మాజీ కెప్టెన్ రాజేష్ బానిక్ (Rajesh Banik) రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. పశ్చిమ త్రిపుర ప్రాంతంలోని ఆనంద్ నగర్‌లో ఈ ప్రమాదం జరిగింది. 40 ఏళ్ల బానిక్ తల్లిదండ్రులు, సోదరుడితో కలిసి జీవనం సాగించే వాడు.
నిత్యం కళ్లెదుటే ఉండే బానిక్ ఇక లేడని తెలిసి తల్లిదండ్రులు, సోదరుడు కన్నీరుమున్నీరవుతున్నారు. బానిక్ మరణవార్త భారత క్రికెట్ అభిమానులను దిగ్భ్రాంతికి గురి చేసింది. త్రిపుర క్రికెట్ అసోసియేషన్ బానిక్‌కు నివాళులర్పించింది.
కుడి చేతి వాటం బ్యాటర్, అకేషనల్ లెగ్ స్పిన్నర్ అయిన బానిక్ 2001-02 సీజన్‌లో త్రిపుర తరఫున రంజీ అరంగేట్రం చేశాడు. అనతికాలంలోనే నమ్మదగ్గ క్రికెటర్‌గా పేరు తెచ్చుకున్నాడు. బానిక్ 42 మ్యాచ్‌ల ఫస్ట్ క్లాస్ కెరీర్‌లో 1469 పరుగులు చేశాడు. అలాగే 24 లిస్ట్-ఏ మ్యాచ్‌ల్లో 378 పరుగులు, 18 టీ20ల్లో 203 పరుగులు చేశాడు. క్రికెటర్‌గా బానిక్ కెరీర్ 17 ఏళ్ల పాటు సాగింది.
అనంతరం అతడు త్రిపుర అండర్-16 జట్టుకు స్టేట్ సెలెక్టర్‌గా సేవలందించాడు. అండర్-15 రోజుల్లో బానిక్ టీమిండియా మాజీ ఆటగాళ్లు ఇర్ఫాన్ పఠాన్, అంబటి రాయుడుతో డ్రస్సింగ్ రూమ్‌ను షేర్ చేసుకున్నాడు. ప్రస్తుతం అగర్తలలో జరుగుతున్న రంజీ మ్యాచ్‌లో త్రిపుర జట్టు ఆటగాళ్లు బ్లాక్ ఆర్మ్‌బ్యాండ్స్ ధరించి బానిక్‌ను నివాళులర్పించారు.
చదవండి: IND vs AUS: టీ20 క్రికెట్‌లో అతి భారీ సిక్సర్.. వరల్డ్ రికార్డు బ్రేక్


