ప్రముఖ మాటల రచయిత గణేష్ పాత్రో కన్నుమూత
చెన్నై : ప్రముఖ మాటల రచయిత, సాహితీకారుడు గణేష్ పాత్రో సోమవారం చెన్నైలో కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన క్యాన్సర్తో బాధపడుతున్నారు. గణేష్ పాత్రో ప్రయివేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతు ఈరోజు ఉదయం మృతి చెందారు. ఆయన స్వస్థలం విజయనగరం జిల్లా పార్వతీపురం. గణేష్ పాత్రో 1945 జూన్ 22న జన్మించారు.
పలు తెలుగు, తమిళ చిత్రాలకు గణేష్ పాత్రో మాటలు రాశారు. 1965లో సినీ రచయితగా కెరీర్ ప్రారంభించిన ఆయన 1990ల వరకు అనేక సినిమాలకు సంభాషణలు, కథను అందించారు. పదిహేనేళ్ళ తర్వాత తిరిగి సినీ రంగానికొచ్చి 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమాకు సంభాషణలు సమకూర్చారు.
నాటక రచయితగా గణేష్ పాత్రోకి మంచి పేరుంది. తరంగాలు, అసురసంధ్య నాటకాలూ, కొడుకు పుట్టాలా, పావలా, లాభం, త్రివేణి, ఆగండి! కొంచెం ఆలోచించండి మొదలైన నాటికలు ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నాయి. రచనలు చాలా తక్కువే అయినా, వ్రాసిన ప్రతి నాటికా, నాటకము రంగస్థలం మీద రక్తి కట్టి రసజ్ఞుల మెప్పుపొందింది. ఆయన మాటలు, సంభాషణలు అందించిన కొన్ని సినిమాల వివరాలు:
*సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు (సంభాషణలు, శ్రీకాంత్ అడ్డాల తో కలిసి)
*నిర్ణయం (సంభాషణలు, పాటలు)
*సీతారామయ్య గారి మనవరాలు
*రుద్రవీణ
*తలంబ్రాలు
*ప్రేమించు పెళ్ళాడు
*మయూరి
*మనిషికో చరిత్ర
*గుప్పెడు మనసు (సంభాషణలు)
*ఇది కథ కాదు
*మరో చరిత్ర
*అత్తవారిల్లు