గౌరంగ్ సృజన అద్భుతం
గౌరంగ్ సృజన అద్భుతం
Published Thu, Mar 6 2014 10:26 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM
న్యూఢిల్లీ: ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ గౌరంగ్ షాను బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ తెగ పొగిడేస్తోంది. ‘కామెడీ నైట్స్ విత్ కపిల్’ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆమె కోసం గౌరంగ్ నీలం, తెలుపురంగు కాంబినేషన్‌లో చేనేత వస్త్రాలతో అనార్కలీ లెహంగాను డిజైన్ చేశాడు. దీనిని ధరించి షో కోసం నిర్వహించిన షూటింగ్‌లో పాల్గొన్న సోనమ్ అనంతరం ఓ వార్తాసంస్థతో మాట్లాడింది. షూటింగ్ గురించి మాటమాత్రమైనా మాట్లాడని ఈ అందగత్తె తన దుస్తులను డిజైన్ చేసిన గౌరంగ్ గురించి మాత్రం ఎంతో గొప్పగా చెప్పింది. గౌరంగ్‌లో ఎంతో సృజన దాగుందని, చేనేత వస్త్రాలతో అనార్కలీ లెహంగా, కాంజీవరమ్ దుపట్టాతో గౌరంగ్ చేసిన డిజైన్ భారతీయ ఫ్యాషన్ రంగంలోనే కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టేలా ఉందని పేర్కొంది.
ఫ్యాషన్ అంటే ఇష్టపడే తాను గౌరంగ్ డిజైన్ చేసిన దుస్తులను ధరించడాన్ని మరింత ఇష్టపడతానని చెప్పింది. సంప్రదాయాన్ని గుర్తుకు తెస్తూనే కొత్తదనాన్ని చాటేలా ఆయన డిజైన్ చేస్తారని, అవి వేటికవి భిన్నంగా, కొత్తగా ఉంటాయని చెప్పింది. ప్రతి డిజైన్‌లోనూ గౌరంగ్ ముద్ర కనిపిస్తుందని, చూడగానే అవి గౌరంగ్ డిజైన్ చేసిన దుస్తులని ఇట్టే చెప్పేసేలా ఉంటాయంది. ఇటీవలకాలంలో గౌరంగ్ డిజైన్ చేసిన దుస్తులు ధరించడం ఇది రెండోసారని చెప్పింది. ఇండియన్ హెరిటేజ్ ష్యాషన్ పేరుతో నిర్వహించిన భారీ కార్యక్రమంలో కూడా తాను ప్రత్యేకంగా నిలిచానంటే అందుకు కారణం గౌరంగ్ డిజైన్ చేసిన దుస్తులేనని చెప్పింది.
సోనమ్‌లాంటి మోడల్ దొరికితే...
సోనమ్ కపూర్ తనను ప్రశంసల్లో ముంచెత్తడంపై గౌరంగ్ స్పందిస్తూ... ‘భారతీయ సంప్రదాయ దుస్తులను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతో ఉంది. సోనమ్ కపూర్‌లాంటి మోడల్ దొరికితే ఆ పని మరింత సులువవుతుంది. ప్రతి కార్యక్రమంలో ఇలాంటి చేనేత వస్త్రాలతో రూపొందించిన దుస్తులను ధరించడం ద్వారా భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను చాటిచెప్పినట్లవుతుంది. ఇండియన్ హెరిటేజ్ ఫ్యాషన్‌లో నేను ఆమెకు డిజైన్ చేసిన దుస్తులు నచ్చి.. కామెడీ నైట్స్ విత్ కపిల్ కార్యక్రమానికి కూడా నన్నే డిజైన్ చేయాలని కోరారు. ఏదైనా కొత్తగా, గొప్పగా ఉండాలని చెప్పారు. వెంటనే నాకొచ్చిన ఆలోచన చేనేత వస్త్రాలతో అనార్కలీ లెహంగాను రూపొందించాలని, అదీ నీలం రంగులో ఉండాలని నిర్ణయించుకున్నాను. డిజైన్ చేశాక సోనమ్‌కు చూపాను. ఆమె ఎంతో సంబరపడింది. ఆధునిక వస్త్రాలతోనే ష్యాషన్ రంగంలో ఎదగాలనుకునేవారికి సోనమ్ భిన్నంగా ఉంటారు. అలాంటి మోడల్‌కు దుస్తులు డిజైన్ చేయడం పరోక్షంగా డిజైనర్లను ప్రోత్సహించడమే’నన్నారు.
Advertisement
Advertisement