Comedy Nights With Kapil
-
కపిల్ శర్మ సంపాదన ఎంతో తెలుసా?
కపిల్ శర్మ అనగానే కామెడీ నైట్స్ షో గుర్తుకొస్తుంది. దాంతో బాగా పాపులర్ అయిన కపిల్.. బాలీవుడ్లో కూడా అడుగుపెట్టాడు. దేశంలోనే అతిపెద్ద స్టాండప్ కమెడియన్‌గా పేరుపొందాడు. అలాంటి కపిల్‌ను ఎవరు మాత్రం వదులుకుంటారు, అందుకే సోనీ ఎంటర్టైన్మెంట్ సంస్థ 2017 సంవత్సరానికి అతడితో కొత్త కాంట్రాక్టు కుదుర్చుకుంటోంది. దాని ప్రకారం వచ్చే సంవత్సరంలో అతడి మొత్తం సంపాదన దాదాపు రూ. 110 కోట్లు ఉంటుందట! ఒక్క ఎపిసోడ్‌కే అతడు దాదాపు 60-80 లక్షలు తీసుకుంటున్నాడు. దాంతో బాలీవుడ్లో అత్యధికంగా సంపాదించే తారల సరసన కపిల్ కూడా నిలిచాడు. ఇంతకుముందు కూడా అతడు కలర్స్ చానల్లో నిర్వహించిన కామెడీ నైట్స్ విత్ కపిల్ షో సోనీ ఎంటర్టైన్మెంట్కు మంచి లాభదాయకంగా నిలిచింది. ప్రధానంగా వారాంతాల్లో టీవీలు అంతగా చూడరు అనుకునే సమయంలో కూడా జనాన్ని టీవీల ముందు కట్టి పడేయడం కపిల్ షోకే సాధ్యమైంది. షారుక్ ఖాన్, అమితాబ్ బచ్చన్ లాంటి పెద్దపెద్ద స్టార్లు కూడా ఈ షోకు వస్తుంటారు. ఇక హీరోయిన్లతో కపిల్ చేసే రొమాంటిక్ కామెడీ చూస్తే విపరీతంగా నవ్వుకోవాల్సిందే. దీపికా పదుకొనే, శిల్పాశెట్టి లాంటి పొడవైన తారల విషయంలో అయితే ముద్దుపెట్టుకోవాలంటే నిచ్చెన తెచ్చుకోవాల్సి ఉంటుందని తరచు అంటుంటాడు. ప్రియాంకా చోప్రా హాలీవుడ్‌కు వెళ్లి క్వాంటికో సిరీస్ చేస్తే, ఆ సిరీస్ మొత్తానికి కలిపి ఆమెకు 11 మిలియన్ డాలర్లు ఇచ్చారు. ఇప్పుడు కపిల్ శర్మ తీసుకుంటున్నది 14.7 మిలియన్ డాలర్లు అవుతుంది. అంటే, హాలీవుడ్ సంపాదన కంటే కూడా మనోడు ఎక్కువ సంపాదిస్తున్నాడన్నమాట. -
'భయపడలేదు.. షాక్ తిన్నా'
ముంబై: తనను అరెస్ట్ చేసినప్పుడు భయపడలేదని.. షాక్ కు గురయ్యానని టీవీ నటుడు, కమెడియన్ కికు శార్దా తెలిపాడు. 'కామెడీ నైట్స్ విత్ కపిల్' కామెడీ షోతో పాపులరైన కికు... డెరా సచ్ఛా సౌదా చీఫ్ గుర్మీత్‌సింగ్ రామ్ రహీం సింగ్‌ను అనుకరించినందుకు అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. తర్వాత బెయిల్ పై విడుదల చేశారు. 'పోలీసులు అరెస్ట్ చేసినప్పుడు నేను ఒంటరిని. దీంతో నేను దిగ్భ్రాంతికి గురయ్యా. తర్వాత రోజు ఉదయం ట్విటర్ ద్వారా క్షమాపణ కోరారు. నాకు వచ్చిన ఫీడ్ బ్యాక్ ఆధారంగానే క్షమాపణ చెప్పాను, భయపడి కాదు' అని కికు శార్దా తెలిపాడు. ప్రేక్షకులను నవ్వించాలన్న ఉద్దేశంతోనే అలా చేశానని, ఎవరినీ నొప్పించాలన్న భావన తనకు లేదని స్పష్టం చేశాడు. హర్యానాలోని పలు పోలీసు స్టేషన్లలో అతడిపై సెక్షన్ 295ఏ కింద కేసులు నమోదయ్యాయి. కాగా, కికు శార్దాకు సినిమా, టీవీ నటులు, సంఘాలు మద్దతు ప్రకటించాయి. అతడి తప్పేమీ లేదని వెనుకేసుకొచ్చారు. -
కామెడీ స్టార్ అరెస్ట్
ప్రముఖ టీవీ షో కామెడీ నైట్స్ విత్ కపిల్ లో పాలక్ గా కనిపించే కమేడియన్ కికు శర్ద అరెస్ట్ అయ్యాడు. సిర్సాకు చెందిన డేరా సచ్చా సౌదా వారి మతాచారాలను కించ పరిచే విధంగా ప్రవర్తించినందుకు ఆయనపై కేసు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్ 295ఎ కింద బుధవారం ఉదయం ముంబైలో కికును అరెస్ట్ చేశారు. ప్రముఖ ఆధ్యాత్మిక గురు, సినిమా స్టార్ అయిన గురుమీత్ రామ్ రహీమ్ సింగ్ అనుచరులు వేసిన కేసులో భాగంగా కికు శర్దను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. 2015 డిసెంబర్ 27న టెలికాస్ట్ అయిన టీవీ షోలో కికు శర్ద తమ గురువును అనుకరిస్తూ తమ మనోభావాలను దెబ్బతీశారని ఆయన అనుచరులు కేసు పెట్టారు. దీనిపై అంతకు ముందే కికు క్షమాపణలు చెప్పినా అనుచరులు వినలేదు. -
కపిల్ కోతి గంతులు
గాసిప్ కలర్స్ టీవీలో ప్రతి ఆదివారం కామెడీ నైట్స్ విత్ కపిల్ పేరుతో కడుపుబ్బ నవ్వించే కామెడీ కింగ్ కపిల్ శర్మ కంటతడి పెట్టుకునే సీన్ క్రియేట్ అయింది. మొన్నీమధ్య జరిగిన ఇంటర్నేషనల్ మరాఠీ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్స్ ఫంక్షన్‌కి కపిలూ హాజరయ్యాడట. మస్తుగా మందుకొట్టి కల్లు తాగిన కోతిలా గంతులేశాడట. అమ్మాయిల చుట్టూ తిరుగుతూ పిచ్చి వాగుడు వాగాడట. ఆ మైకంలోనే అక్కడే ఉన్న మరాఠీ నటి దీపాలీ సయ్యద్ చేయిపట్టుకొని డాన్స్ చేయబోయాడట. సోయి తప్పిన కపిల్‌ని కొట్టినంత పని చేసిందట ఆమె. పరిస్థితి శృతిమించుతోందని గమనించిన టీవీ యాక్టర్ శరత్కేల్కర్ కపిల్‌ని అక్కడి నుంచి తీసుకెళ్లడానికీ ప్రయత్నించాడనీ నేషనల్ మీడియాలో ప్రచారం. అయితే కపిల్ మాత్రం ఇదంతా శుద్ధ అబద్ధం.. నేనంటే గిట్టని వాళ్లు నా మీద చేస్తున్న దుష్ర్పచారమని అగ్గి మీద గుగ్గిలం అవుతున్నాడు. అసలు నేనా ఫంక్షన్‌కే వెళ్లనే లేదు.. అదెప్పుడు జరిగిందో కూడా తెలియదు. ఇదంతా ఎవరు కల్పించారో తెలియదు. ఏమైనా దీని వల్ల నేనో పాఠం నేర్చుకున్నాను.. అందరూ నాలాగే ఉంటారనుకోవడం తప్పని. మనతో బాగా మాట్లాడిన వాళ్లందరినీ మనవాళ్లు అనుకోకూడదని’ అంటూ వాపోతున్నాడు. -
'నా ఫస్ట్ మూవీపై దిగులే లేదు'
న్యూఢిల్లీ : తన తొలి మూవీ 'కిస్ కిస్కో ప్యార్ కరూ' గురించి దిగులు లేదని, ఎలాంటి ఆందోళన చెందడం లేదని బాలీవుడ్ వర్ధమాన కమెడియన్ కపిల్ శర్మ అన్నాడు. ఈ మూవీ తనకు మంచి కెరీర్ ఇస్తుందని, బాలీవుడ్ ఇండస్ట్రీలో తన ప్రయాణం చాలా కాలం పాటు కొనసాగేలా చేస్తుందంటూ ఆశలు పెట్టుకున్నాడు. 'కమెడీ నైట్స్ విత్ కపిల్' అనే హిందీ టీవీ ప్రోగ్రాం ద్వారా తనకంటూ అభిమానులను సంపాదించకున్నాడు కపిల్. దీంతో తన అదృష్టాన్ని బాలీవుడ్లో పరీక్షించుకోవాలని ఉబలాట పడుతున్నాడు. అబ్బాస్-మస్తాన్ల ద్వారా సిల్వర్ స్క్రీన్కు పరిచయం కాబోతున్నాడు. ఈ మూవీ పాటలు, ట్రైలర్ లకు అభిమానుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చిందన్నాడు. కమెడీ కాంపిటీషన్ 2007, 2013లలో విజేతగా నిలిచి తనకంటూ పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుని, ఆ తర్వాత తన సొంత బ్యానర్ k9 లో కామెడీ నైట్స్ విత్ కమిల్ అనే టీవీ షో రూపొందించాడు. అయితే మూవీలలో నటిస్తున్నప్పటికీ టీవీ షోలకు దూరంగా ఉండే ప్రసక్తే లేదని తేల్చి చెప్పాడు. తన తొలి మూవీ 'కిస్ కిస్కో ప్యార్ కరూ' ఈ నెల 25న విడుదల అవుతుందని చెప్పుకొచ్చాడు ఈ టీవీ స్టార్. -
ఆ దేవుడు నన్ను హర్ట్ చేయలేదు!
ముంబై: నాన్న విషయంలో తనను ఆ దేవుడు హర్ట్ చేయలేదని అంటున్నాడు కపిల్ శర్మ. 'కామెడీ నైట్ విత్ కపిల్' టెలివిజన్ కార్యక్రమంతో స్టార్ హోదాను సంపాదించుకున్న కపిల్.. తన తండ్రి చివరి క్షణాలు చాలా బాధను మిగిల్చాయని ఆవేదన వ్యక్తం చేశాడు. 'నా తండ్రితో నేను గడిపిన సమయం చాలా తక్కువ. ఆయన ఆఖరి రోజుల్లో మాత్రం నాన్నతోనే ఉన్నా. నాన్న కేన్సర్ బారిన పడ్డాక ట్రీట్ మెంట్ కోసం ఆస్పత్రికి తీసుకెళ్ల్లే వాణ్ని. ఆ సమయంలో ఆయన బాధను నేను చూడలేక పోయేవాణ్ని. ఆ క్రమంలోనే నాన్నను ఆ దేవుడు తీసుకువెళ్లిపోవాలని ప్రార్ధించే వాణ్ని. ఆ దేవుడు నామొర ఆలకించాడు. నాన్నను తొందరగానే ఈ లోకం నుంచి తీసుకుపోయాడు. ఈ విషయంలో దేవుడు నన్ను హర్ట్ చేయలేదు' అని కపిల్ తెలిపాడు. 'ప్రతీ ఒక్కరి తల్లి దండ్రులు బిడ్డల నుంచి ఏదో ఒకటి ఆశిస్తారని.. నా పేరెంట్స్ మాత్రం నన్ను ఏ విషయంలోనూ ఇబ్బంది పెట్టలేదన్నాడు. వారు ఏ రోజూ కూడా నా నుంచి ఏమీ ఆశించలేదని' కపిల్ అన్నాడు. నాన్నకు జబ్బు చేసిన సమయంలో అద్దె ఇంట్లో ఉంటున్న మా వద్ద ఆయనకు కనీసం వైద్యం చేయడానికి కూడా డబ్పులు ఉండేవు కావన్నాడు. నాన్న జీతంతోనే నెల్లో కొన్నిరోజులు ఆయన్న సంతోషం ఉంచేవాళ్లమని, ఇప్పుడు తాను సంపాదిస్తున్నా నాన్న మాత్రం మా నుంచి దూరమైయ్యారని తన మనసులోని మాటలను వెల్లడించాడు. దేవుడి ఏది చేసినా అది మన మంచికే చేస్తాడని భావించాలని కపిల్ స్పష్టం చేశాడు. -
జంజీర్ ను దత్తత తీసుకున్న కపిల్ శర్మ!
'కామెడీ నైట్ విత్ కపిల్' టెలివిజన్ కార్యక్రమంతో స్టార్ హోదాను సంపాదించుకున్న కపిల్ శర్మ రిటైరైన పోలీస్ కుక్కను దత్తత తీసుకున్నారు. పలు సంవత్సరాలుగా పోలీసు విభాగానికి సేవలందించిన లాబ్రడార్ జాతికి చెందిన కుక్కను జంతు సంరక్షణ సంస్థ నుంచి దత్తత తీసుకున్నారు. కపిల్ దత్తత తీసుకున్న కుక్క పేరు జంజీర్ అని ట్విటర్ లో పోటోలతోపాటు ఓ సందేశాన్ని పోస్ట్ చేశారు. నా కుటుంబంలో ఓ కొత్త భాగస్వామి చేరింది. ముంబై పోలీసులకు సేవలందించింది. జంజీర్ గురించి మరిన్ని విషయాలు త్వరలో మీతో పంచుకుంటాను అని కపిల్ ట్వీట్ చేశారు. జంతువుల సంరక్షణ పట్ల ఉన్న కపిల్ అభిరుచిని ప్రశంసిస్తున్నారు. కపిల్, ఆయన సతీమణి ప్రీతిలకు కేవలం కృతజ్క్షతలు మాత్రమే చెప్పలేమని.. జంతు ప్రేమికులను తమ సంస్థ ఎల్లప్పుడు గౌరవించడానికి సంస్థ సిద్దంగా ఉంటుందని నిర్వహకులు తెలిపారు. -
నన్ను గుర్తుపట్టారా?
‘‘హలో... నన్ను గుర్తు పట్టారా? గుర్తు పట్టకపోతే నిజంగా నేను సక్సెస్ అయినట్టే’’ అందా లావుపాటి ఆంటీ. ఎవరబ్బా అని అంతా తమ బుర్రకు పదునుపెట్టి మరీ ఆలోచించారు. ఎవ్వరికీ చిక్కలేదు. ఫైనల్‌గా తెలిసిందేమిటంటే తను... విద్యాబాలన్! ‘బాబీ జాసూస్’. అనే సినిమాలో కథానుసారం పన్నెండు రకాల అవతారాల్లో కనిపిస్తారు విద్యా. అందులో యాచకురాలి పాత్ర ఒకటి. సినిమా కోసం ఈ వేషం ధరించడమే కాదు.. చివరికి ఇదే గెటప్‌లో ఇటీవల ప్రచారం చేశారు విద్యా. ఇప్పుడు ‘గుత్తి’ అవతారంలోకి మారారు. ‘కామెడీ నైట్స్ విత్ కపిల్’ అనే బుల్లితెర షో ద్వారా ఈ గుత్తి కారెక్టర్ చాలా పాపులర్. అచ్చంగా గుత్తిలానే మారిపోయి, ‘జలక్ దిఖ్లా జ’ అనే డాన్స్ రియాల్టీ షోలో పాల్గొన్నారు విద్యాబాలన్. ఆమెను ఆ అవతారంలో చూసి, ముందుగా ఎవరూ గుర్తుపట్టలేదట. ఆ తర్వాత అసలు విషయం తెలుసుకుని, ‘శభాష్ విద్యా’ అని ప్రశంసించారట. నిజంగానే అభినందించదగ్గ విషయమే. విద్యాబాలన్ తన వృత్తిపట్ల ఎంత అంకితభావంతో ఉంటారో దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు. ఈ గురువారం ‘బాబీ జాసూస్’ విడుదల కానుంది. మరి.. విద్యా పడిన కష్టానికి ఎలాంటిప్రతిఫలం లభిస్తుందో చూడాలి. -
కేజ్రీవాల్, కపిల్ కామెడీకి ఈసీ బ్రేక్!
ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ పై తనదైన శైలిలో సెటైర్లు వేసి నవ్వించాలనుకున్న కపిల్ శర్మ ప్రయత్నాలకు ఎన్నికల కమిషన్ గండికొట్టింది. 'కామెడీ నైట్స్ విత్ కపిల్' అనే టెలివిజన్ కార్యక్రమంతో దేశవ్యాప్తంగా ఆదరణను చూరగొన్న కపిల్ శర్మ.. అరవింద్ కేజ్రీవాల్ తో ఓ ఎపిసోడ్ ను షూట్ చేయాలని బుధవారం ప్లాన్ చేశారు. అయితే చివరి క్షణంలో షూటింగ్ రద్దైంది. ఈ షూటింగ్ రద్దు కావడం వెనుక ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన కిందకు వస్తుందనే కారణంతో రద్దు చేసినట్టు తెలిపారు. ఢిల్లీలో ఎన్నికల జరగడానికి 48 గంటల ముందు టెలివిజన్ షోలో రాజకీయ పార్టీల నేతలను చూపించడం సరికాదు అనే కారణంతో టెలివిజన్ కార్యక్రమాన్ని పరస్పర అంగీకారంతో రద్దు చేసినట్టు టెలివిజన్ షో నిర్వాహకులు తెలిపారు. కామెడీ షోలో పార్టీ గురించి, ఇతర సీరియస్ విషయాలను ప్రస్తావించడం వివాదస్పదమవుతుంది. కేజ్రీవాల్ ధర్నా, నిరాహార దీక్ష అంశాలపై ప్రేక్షకులకు వినోదం పంచాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం రూపొందించాం అని నిర్వాహకులు తెలిపారు. -
'పకోడీలు తినడం కాదు.. వెళ్లి ఓటేయండి!'
సెలవు దొరికింది కదాని హాయిగా ఇంట్లో కూర్చుని పకోడీలు తినడం, టీలు తాగడం సరికాదని.. వెళ్లి ఓట్లు వేయాలని ప్రముఖ కమెడియన్ కపిల్ శర్మ ప్రజలకు తెలిపాడు. మంచి ప్రభుత్వం రావాలంటే ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కళ్లూ వెళ్లి ఓటు వేయాలని సూచించాడు. తెల్ల కుర్తా పైజమా, గులాబి రంగు నెహ్రూ జాకెట్ ధరించిన కపిల్.. ఢిల్లీలో ఎన్నికల కమిషన్ తరఫున ఓటరు అవగాహన కార్యక్రమం నిర్వహించాడు. 'కామెడీ నైట్స్ విత్ కపిల్' కార్యక్రమంతో బాగా పాపులర్ అయిన కపిల్‌ను ఎన్నికల కమిషన్ తమ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకుంది. నిజానికి తనకు కూడా ఓటరు గుర్తింపు కార్డు లేదని, తాను బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నాను కాబట్టి.. ప్రత్యేక కేసుగా భావించి గుర్తింపు కార్డు ఇవ్వాలని ఈసీని కపిల్ కోరాడు. తాను అమృతసర్‌లో ఉన్నప్పుడు పేరు నమోదు చేయించుకున్నా, ముంబై వచ్చిన తర్వాత అక్కడ పేరు తీసేశారని తెలిపాడు. క్రికెటర్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి సోహా అలీ ఖాన్ తదితరులు కూడా ఎన్నికల కమిషన్ తరఫున ప్రచారం చేస్తున్నారు. -
గౌరంగ్ సృజన అద్భుతం
న్యూఢిల్లీ: ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ గౌరంగ్ షాను బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ తెగ పొగిడేస్తోంది. ‘కామెడీ నైట్స్ విత్ కపిల్’ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆమె కోసం గౌరంగ్ నీలం, తెలుపురంగు కాంబినేషన్లో చేనేత వస్త్రాలతో అనార్కలీ లెహంగాను డిజైన్ చేశాడు. దీనిని ధరించి షో కోసం నిర్వహించిన షూటింగ్లో పాల్గొన్న సోనమ్ అనంతరం ఓ వార్తాసంస్థతో మాట్లాడింది. షూటింగ్ గురించి మాటమాత్రమైనా మాట్లాడని ఈ అందగత్తె తన దుస్తులను డిజైన్ చేసిన గౌరంగ్ గురించి మాత్రం ఎంతో గొప్పగా చెప్పింది. గౌరంగ్లో ఎంతో సృజన దాగుందని, చేనేత వస్త్రాలతో అనార్కలీ లెహంగా, కాంజీవరమ్ దుపట్టాతో గౌరంగ్ చేసిన డిజైన్ భారతీయ ఫ్యాషన్ రంగంలోనే కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టేలా ఉందని పేర్కొంది. ఫ్యాషన్ అంటే ఇష్టపడే తాను గౌరంగ్ డిజైన్ చేసిన దుస్తులను ధరించడాన్ని మరింత ఇష్టపడతానని చెప్పింది. సంప్రదాయాన్ని గుర్తుకు తెస్తూనే కొత్తదనాన్ని చాటేలా ఆయన డిజైన్ చేస్తారని, అవి వేటికవి భిన్నంగా, కొత్తగా ఉంటాయని చెప్పింది. ప్రతి డిజైన్లోనూ గౌరంగ్ ముద్ర కనిపిస్తుందని, చూడగానే అవి గౌరంగ్ డిజైన్ చేసిన దుస్తులని ఇట్టే చెప్పేసేలా ఉంటాయంది. ఇటీవలకాలంలో గౌరంగ్ డిజైన్ చేసిన దుస్తులు ధరించడం ఇది రెండోసారని చెప్పింది. ఇండియన్ హెరిటేజ్ ష్యాషన్ పేరుతో నిర్వహించిన భారీ కార్యక్రమంలో కూడా తాను ప్రత్యేకంగా నిలిచానంటే అందుకు కారణం గౌరంగ్ డిజైన్ చేసిన దుస్తులేనని చెప్పింది. సోనమ్లాంటి మోడల్ దొరికితే... సోనమ్ కపూర్ తనను ప్రశంసల్లో ముంచెత్తడంపై గౌరంగ్ స్పందిస్తూ... ‘భారతీయ సంప్రదాయ దుస్తులను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతో ఉంది. సోనమ్ కపూర్‌లాంటి మోడల్ దొరికితే ఆ పని మరింత సులువవుతుంది. ప్రతి కార్యక్రమంలో ఇలాంటి చేనేత వస్త్రాలతో రూపొందించిన దుస్తులను ధరించడం ద్వారా భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను చాటిచెప్పినట్లవుతుంది. ఇండియన్ హెరిటేజ్ ఫ్యాషన్‌లో నేను ఆమెకు డిజైన్ చేసిన దుస్తులు నచ్చి.. కామెడీ నైట్స్ విత్ కపిల్ కార్యక్రమానికి కూడా నన్నే డిజైన్ చేయాలని కోరారు. ఏదైనా కొత్తగా, గొప్పగా ఉండాలని చెప్పారు. వెంటనే నాకొచ్చిన ఆలోచన చేనేత వస్త్రాలతో అనార్కలీ లెహంగాను రూపొందించాలని, అదీ నీలం రంగులో ఉండాలని నిర్ణయించుకున్నాను. డిజైన్ చేశాక సోనమ్‌కు చూపాను. ఆమె ఎంతో సంబరపడింది. ఆధునిక వస్త్రాలతోనే ష్యాషన్ రంగంలో ఎదగాలనుకునేవారికి సోనమ్ భిన్నంగా ఉంటారు. అలాంటి మోడల్‌కు దుస్తులు డిజైన్ చేయడం పరోక్షంగా డిజైనర్లను ప్రోత్సహించడమే’నన్నారు. -
'కామెడీ నైట్స్ విత్ కపిల్` షోకు కేజ్రీవాల్‌ను ఆహ్వానిస్తా
ముంబై: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేసిన `ఆమ్ ఆద్మీ పార్టీ` నిర్వాహణ తీరు తాననెంతో ఆకట్టుకుందంటూ 'కామెడీ నైట్స్ విత్ కపిల్' ఫేమ్ కపిల్ శర్మ వ్యాఖ్యనించాడు. తాను నిర్వహిస్తున్న `కామెడీ నైట్స్ విత్ కపిల్` కామెడీ షోకు ఆ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ను ఓ రోజు అతిధిగా ఆహ్వానించాలని భావిస్తున్నట్టు తన షో అభిమానులకు అతను తెలిపాడు. టీవీ ప్రేక్షుకులను ఎంతోగానూ అలరిస్తున్న హాస్యపూరిత కార్యక్రమం `కామెడీ నైట్స్ విత్ కపిల్` కామెడీ షో నిర్వహకుడిగా కపిల్ శర్మ విధులు నిర్వహిస్తున్నాడు. ఈ కార్యక్రమానికి ప్రముఖులను ఆహ్వానిస్తూ తనదైన శైలీలో అతను కామెడీని పండిస్తుంటాడు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బ్రహ్మండమైన విజయాన్ని సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీపై కపిల్ శర్మ ప్రశంసల జల్లు కురిపించాడు. ఆ పార్టీ రాకతో భారతీయ ప్రజలలో కొత్త మార్పు రాబోతుందని తాను వ్యక్తిగతంగా నమ్ముతున్నట్టు అతను ఆశాభావం వ్యక్తం చేశాడు. ఎన్నికల ఫలితాల అనంతరం ప్రజలంతా కొత్తదనాన్ని కోరుకుంటున్నారని, ప్రజలందరూ ఆమ్ ఆద్మీ పార్టీ వైపే ఆసక్తిగా చూస్తున్నారంటూ కపిల్ శర్మ అభిప్రాయ పడ్డాడు.