కేజ్రీవాల్, కపిల్ కామెడీకి ఈసీ బ్రేక్!
ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ పై తనదైన శైలిలో సెటైర్లు వేసి నవ్వించాలనుకున్న కపిల్ శర్మ ప్రయత్నాలకు ఎన్నికల కమిషన్ గండికొట్టింది. 'కామెడీ నైట్స్ విత్ కపిల్' అనే టెలివిజన్ కార్యక్రమంతో దేశవ్యాప్తంగా ఆదరణను చూరగొన్న కపిల్ శర్మ.. అరవింద్ కేజ్రీవాల్ తో ఓ ఎపిసోడ్ ను షూట్ చేయాలని బుధవారం ప్లాన్ చేశారు. అయితే చివరి క్షణంలో షూటింగ్ రద్దైంది. ఈ షూటింగ్ రద్దు కావడం వెనుక ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన కిందకు వస్తుందనే కారణంతో రద్దు చేసినట్టు తెలిపారు.
ఢిల్లీలో ఎన్నికల జరగడానికి 48 గంటల ముందు టెలివిజన్ షోలో రాజకీయ పార్టీల నేతలను చూపించడం సరికాదు అనే కారణంతో టెలివిజన్ కార్యక్రమాన్ని పరస్పర అంగీకారంతో రద్దు చేసినట్టు టెలివిజన్ షో నిర్వాహకులు తెలిపారు. కామెడీ షోలో పార్టీ గురించి, ఇతర సీరియస్ విషయాలను ప్రస్తావించడం వివాదస్పదమవుతుంది. కేజ్రీవాల్ ధర్నా, నిరాహార దీక్ష అంశాలపై ప్రేక్షకులకు వినోదం పంచాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం రూపొందించాం అని నిర్వాహకులు తెలిపారు.