కాంగ్రెస్.. డోంగ్రెస్!
యూట్యూబ్‌లో హల్‌చల్ చేస్తున్న పొలిటికల్ పేరడీలు
ఎన్నికల వేడి నెట్టింటికీ పాకింది. బ్లాగ్స్ ద్వారా, ఫేస్‌బుక్, ట్విటర్ వంటి సోషల్ నెట్‌వర్కింట్ సైట్ల ద్వారా హాట్‌హాట్ చర్చలు గిగా బైట్ల లెక్కన ఇంటర్‌నెట్లో పోగుపడుతున్నాయి. అయితే, ఆ వేడిని చల్లార్చే కామెడీ పేరడీలు కూడా నెట్లో దర్శనమిస్తున్నాయి. ముఖ్యంగా ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీల ముఖ్యమైన నినాదాలు, ప్రచార చిత్రాలు.. విపరీతంగా పేరడీకి గురవుతున్నాయి. వీడియో నెట్‌వర్కింగ్ సైట్ యూట్యూబ్‌లో వీటికి మంచి స్పందన లభిస్తోంది. ఆయా నినాదాలు, ప్రచార చిత్రాలను హస్యభరితంగా అనుకరిస్తూ ఆ స్పూఫ్స్‌ను రూపొందిస్తున్నారు.
నెట్లో హల్‌చల్ చేస్తున్న కొన్ని పేరడీలు..
కాంగ్రెస్‌పై..
‘కట్టర్ సోచ్ నహీ.. యువ జోష్’(చాంధసవాదం కాదు.. యువ శక్తి)
పేరడీ..
‘కోయీ సోచ్ నహీ.. ఖాళీ పీలీ కా జోష్( ఏ ఆలోచనా లేదు.. అర్థంలేని ఆవేశమే)
హర్ హాత్ కీ శక్తి.. హర్ హాత్ కీ తరక్కీ ( ప్రతీ వ్యక్తికి అధికారం.. ప్రతీ వ్యక్తికి అభివృద్ధి)
పేరడీ..
‘హర్ హాత్ హరీ పట్టీ.. వికాస్ కో లాల్‌బత్తీ’(ప్రతీ చేతిలో పచ్చనోటు.. అభివృద్ధికి రెడ్ సిగ్నల్)
మరో స్పూఫ్‌లో కాంగ్రెస్‌ను డోంగ్రెస్ అని, రాహుల్‌ను కాహుల్ అని పేర్కొన్నారు.
బీజేపీపై..
‘నయీ సోచ్.. నయీ ఉమ్మీద్.. బీజేపీ’( కొత్త ఆలోచన.. కొత్త ఆశ)
పేరడీ
‘నా హీ సోచ్.. నా హీ ఉమీద్.. పీజేపీ’ (ఆలోచనా లేదు.. ఆశలూ లేవు)
అరవింద్ కేజ్రీవాల్‌పై..
రాజకీయాల్లో కేజ్రీవాల్ ఎదుగుదలను ఓ పేరడీలో సినిమా ట్రైలర్‌లా రూపొందించారు. అందులో బాలీవుడ్ నటుడు అలోక్‌నాథ్‌లా ఉండే ఒక వ్యక్తి కేజ్రీవాల్‌లా ఉండే మరో వ్యక్తికి.. సామాన్యుడిలా, పేదవాడిలా కనిపించాలంటే ఏమేం చేయాలో చెబుతుంటాడు. స్వెటర్ ధరించడం, తన చౌకీదారు నుంచి మఫ్లర్ అరువు తీసుకుని మెడలో వేసుకోవడం, గాంధీ టోపీ పెట్టుకోవడం.. తదితర సలహాలు ఇస్తుంటాడు.