మైసూరు: ఫేస్‌బుక్‌లో తాను చేసిన పోస్ట్‌ను డిలీట్ చేయడంపై ఓ మహిళా ఐపీఎస్ అధికారి ఫేస్‌బుక్ యాజమాన్యాన్ని నిలదీశారు. సెన్సార్ షిప్ పేరుతో అలా చేయడం తగదంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. వివరాల్లోకి వెళితే... మహిళా ఐపీఎస్ అధికారి రూప మౌద్గిల్... బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహ మధ్య ట్విట్టర్ వేదికగా మాటల యుద్ధం చోటుచేసుకుంది. కర్ణాటక రాష్ట్రంలో నలుగురు ఐపీఎస్ అధికారుల బదిలీపై చేసిన ట్వీట్‌తో ఎంపీ, మహిళా ఐపీఎస్ అధికారి మధ్య ట్విట్టర్, ఫేస్‌బుక్ సాక్షిగా వార్ జరిగింది.
ఐపీఎస్ అధికారులు మధుకర్‌శెట్టి, కౌశలేంద్రకుమార్, లాభూరామ్, సోనియా సింగ్‌లను ఇటీవల కేంద్రానికి బదిలీ చేస్తున్నట్లు కొన్ని మాధ్యమాల్లో వచ్చిన వార్తలను మైసూరు బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. కర్ణాటక రాష్ట్రంలో ఐపీఎస్ అధికారులను ఉన్నత పదవులతో గౌరవించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమవుతుడంటంతోనే ఐపీఎస్ అధికారులు కేంద్రానికి బదిలీపై వెళుతున్నట్లు పేర్కొన్నారు.
అయితే ప్రతాప్ సింహ చేసిన ట్విట్టర్‌పై ఐపీఎస్ అధికారి రూప అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఐపీఎస్, ఐఏఎస్ అధికారులను రాజకీయ వివాదాల్లోకి రావద్దంటూ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ప్రతీ ఐఏఎస్, ఐపీఎస్ అధికారికి కేంద్రంలో పని చేయాలనే ఉంటుందంటూ తెలిపిన ఆమె దీనికి రాజకీయ ప్రతినిధులు రాజకీయ రంగు పులమరాదంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇటువంటి చర్యల ద్వారా పాలన వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుందని తద్వారా పాలన వ్యవస్థ గాడి తప్పుతుందంటూ అందులో పేర్కొన్నారు.
దీనిపై స్పందించిన ప్రతాప్ సింహ తాను కేవలం మాధ్యమాల్లో ప్రచురితమైన వార్తలను మాత్రమే షేర్ చేసానని, మీకు వీలైనపుడు ట్వీట్లను మరోసారి పునఃపరిశీలించాలంటూ సూచించారు. దీనిపై మహిళా ఐపీఎస్ అధికారి రూప రాజకీయ నాయకులుగా మీపని మీరు చేసుకుంటూ ఐపీఎస్, ఐఏఎస్ అధికారులను వారి పని చేసుకోనివ్వాలంటూ పరోక్షంగా హితవు పలికారు. అంతేకాకుండా ఫేస్‌బుక్‌లో ఎంపీ తీరుపై ఆమె విరుచుకుపడ్డారు. అయితే ఎంపీ ప్రతాప్ సింహపై ఫేస్‌బుక్ తాను చేసిన పోస్ట్‌ను తొలగించడంపై రూప మాల్గుడి అభ్యంతరం వ్యక్తం చేశారు. తొలగించిన ఆ పోస్ట్‌ను ఆమె మళ్లీ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. రూప పోస్ట్‌కు ఫేస్‌బుక్ లో ప్రశంసలు వెల్లువెత్తుతోంది.
కాగా ఎంపీ ప్రతాప్ సింహకు వివాదాలు కొత్తమీ కాదు. కార్గిల్ అమరుడి కుమార్తె, ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి గుర్మెహర్ కౌర్ ను దావూద్ ఇబ్రహీంతో పోల్చి వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. ఆయన ...'1993లో జనాన్ని నేను చంపలేదు. బాంబులు చంపాయి' అని రాసున్న ప్లకార్డును మాఫియా డాన్ దావుద్ ఇబ్రహీం పట్టుకున్నట్లుగా ట్వీట్ చేసి... గుర్మెహర్ను హేళన చేశారు.