'పకోడీలు తినడం కాదు.. వెళ్లి ఓటేయండి!'
సెలవు దొరికింది కదాని హాయిగా ఇంట్లో కూర్చుని పకోడీలు తినడం, టీలు తాగడం సరికాదని.. వెళ్లి ఓట్లు వేయాలని ప్రముఖ కమెడియన్ కపిల్ శర్మ ప్రజలకు తెలిపాడు. మంచి ప్రభుత్వం రావాలంటే ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కళ్లూ వెళ్లి ఓటు వేయాలని సూచించాడు. తెల్ల కుర్తా పైజమా, గులాబి రంగు నెహ్రూ జాకెట్ ధరించిన కపిల్.. ఢిల్లీలో ఎన్నికల కమిషన్ తరఫున ఓటరు అవగాహన కార్యక్రమం నిర్వహించాడు.
'కామెడీ నైట్స్ విత్ కపిల్' కార్యక్రమంతో బాగా పాపులర్ అయిన కపిల్ను ఎన్నికల కమిషన్ తమ బ్రాండ్ అంబాసిడర్గా నియమించుకుంది. నిజానికి తనకు కూడా ఓటరు గుర్తింపు కార్డు లేదని, తాను బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నాను కాబట్టి.. ప్రత్యేక కేసుగా భావించి గుర్తింపు కార్డు ఇవ్వాలని ఈసీని కపిల్ కోరాడు. తాను అమృతసర్లో ఉన్నప్పుడు పేరు నమోదు చేయించుకున్నా, ముంబై వచ్చిన తర్వాత అక్కడ పేరు తీసేశారని తెలిపాడు. క్రికెటర్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి సోహా అలీ ఖాన్ తదితరులు కూడా ఎన్నికల కమిషన్ తరఫున ప్రచారం చేస్తున్నారు.