తమిళంలో గౌతమీపుత్ర శాతకర్ణి
ఈ ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ అయి ఘనవిజయం సాధించి చారిత్రక చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి. నందమూరి బాలకృష్ణ హీరోగా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా తెలుగు నాట రికార్డ్ వసూళ్లను సాధించింది. ఇప్పుడు తమిళ నాట డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా క్రిష్ తన ఆనందాన్ని మీడియాతో పంచుకున్నారు.
ఇంత వరకూ ఎవరూ టచ్ చేయని గొప్ప చారిత్రాత్మక కథను దర్శకుడు క్రిష్ వెండితెరపై అద్భుతంగా మలిచిన తీరుకు తమిళ ప్రజలు కూడా కాసులు వర్షం కురిపిస్తారని భావిస్తున్నారు. బాలకృష్ణ సరసన శ్రియ హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో ప్రముఖ బాలీవుడ్ నటి హేమమాలిని బాలకృష్ణకు తల్లిగా కీలక పాత్రను పోషించడం విశేషం. చారిత్రక కథా చిత్రాలు అరుదైపోతున్న ఈ రోజుల్లో చరిత్రను తవ్వి,తానికి కల్పిత హంగులు అద్ది గొప్ప కళాఖండంగా ఈ సినిమాను తీర్చిదిద్దారు.
ఆర్‌ఎన్‌సీ.సినిమా పతాకంపై నిర్మాత నరేంద్ర గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాను తమిళంలో రిలీజ్ చేస్తున్నారు. ఈ చిత్ర ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమం మంగళవారం సాయంత్రం చెన్నై, సాలిగ్రామంలోని ప్రసాద్‌ల్యాబ్‌లో జరిగింది. ప్రముఖ నటీమణులు వెన్నెరాడై నిర్మల,లత,దర్శకుడు కేఎస్.రవికుమార్, జాగ్వర్‌తంగం తదితరులు అతిధులుగా పాల్గొని ట్రైలర్‌ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు క్రిష్ మాట్లాడుతూ తనకు చెన్నైతో మంచి అనుబంధం ఉందన్నారు. తన చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి తమిళనాడులో విడుదల కానండటం సంతోషంగా ఉందన్నారు. ఈ చిత్రాన్ని బాలకృష్ణ కథానాయకుడిగా చేయడమే మంచి అనుభూతిగా పేర్కొన్నారు.ప్రస్తుతం తాను హిందిలో ఝాన్సీరాణి కథతో మణికర్ణిక అనే చారిత్రక చిత్రాన్ని చేస్తున్నట్లు తెలిపారు.