![Genelia Adorable Wishes For Hubby Riteish Deshmukh On His Birthday - Sakshi](/styles/webp/s3/article_images/2019/12/17/genelia--reteish.jpg.webp?itok=rRSnDdeE)
బాలీవుడ్ హీరో రితేశ్ దేశ్‌ముఖ్ నేడు 41వ వసంతంలోకి అడుగుపెడుతున్నాడు. ఈ సందర్భంగా రితేశ్ భార్య, నటి జెనీలియా షేర్ చేసిన ఫొటో అభిమానులను విపరీతంగా ఆకర్షిస్తోంది. తమ ఇద్దరు కుమారులు, తాను రితేశ్‌ను ఆత్మీయంగా ముద్దాడుతున్న ఫొటోను షేర్ చేసిన జెనీలియా... ‘నువ్వు ఎల్లప్పుడూ నా వాడివే. నీకు వందేళ్లు వచ్చినా ఎలాంటి మార్పూ ఉండదు. నేడైనా రేపైనా నువ్వున్నది నా కోసమే. హ్యాపీ బర్త్‌డే లవ్. ఎన్నటికైనా నా ప్రేమ నీకే సొంతం’ అంటూ క్యాప్షన్ జత చేశారు. ఈ క్రమంలో రితేశ్‌కు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అదే విధంగా జెనీలియా- రితేశ్‌ల జోడి తమకు ఆదర్శమని, మీ ప్రేమ ఎల్లప్పటికీ ఇలాగే కొనసాగాలని పలువురు నెటిజనన్లు కామెంట్లు చేస్తున్నారు.
కాగా ‘తుజే మేరీ కసమ్’ సినిమాలో కలిసి నటించిన రితేశ్ దేశ్‌ముఖ్- జెనీలియా బీ-టౌన్ ప్రేక్షకులను ఎంతగా అలరించారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ సినిమా షూటింగ్ సమయంలో ప్రేమలో పడిన ఈ జంట రియల్ లైఫ్‌లోనూ జోడీ కట్టారు. పెళ్లికి తొలుత పెద్దల నుంచి వ్యతిరేకత రావడంతో... కొన్నాళ్లపాటు స్నేహితులుగానే ఉన్న ఈ స్టార్ కపుల్.. పన్నెండేళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ప్రస్తుతం వీరికి రేహిల్, రియాన్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇక రితేశ్ దేశ్‌ముఖ్ మహారాష్ట్ర మాజీ సీఎం, దివంగత విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ తనయుడన్న సంగతి తెలిసిందే. ‘బొమ్మరిల్లు’ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకుల మనస్సుల్లో ‘హాసిని’గా చెరగని ముద్రవేసుకున్న జెనీలియా.. ప్రస్తుతం కుటుంబ బాధ్యతలు చూసుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment