ముందుకు సాగిపోవాలి అంతే: జెనీలియా | Genelia Response Over Vidyut Jamwal Was Not Invited For OTT announcement | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ జమాల్‌కు అండగా జెనీలియా!

Published Tue, Jun 30 2020 9:30 PM | Last Updated on Tue, Jun 30 2020 9:41 PM

Genelia Response Over Vidyut Jamwal Was Not Invited For OTT announcement - Sakshi

‘‘ప్రతీ సినిమా ఎంతో ప్రేమతో, మరెంతో మంది చెమటతో రూపుదిద్దుకుంటుంది. దాని కోసం చాలా మంది తన సర్వస్వాన్ని ధారబోస్తారు. అలాంటి వారు కాస్త గౌరవం కోరుకోవడం సబబే. అలాగే ఓ ఇన్విటేషన్‌ వస్తుందని ఊహించడం కూడా సరైందే. కనీసం అందుకు సంబంధించిన ఓ చిన్న సమాచారం అందినా బాగుంటుంది. కానీ, కొన్నిసార్లు జీవితమే సరిగ్గా ఉండదు. ముందుకు సాగిపోవాలి అంతే ఫ్రెండ్‌’’ అంటూ బాలీవుడ్‌ నటి జెనీలియా డిసౌజా తన స్నేహితుడు, కో- స్టార్‌ విద్యుత్‌ జమాల్‌కు అండగా నిలిచారు. కొన్ని సంఘటనలు బాధించేవిగా ఉన్నా వాటిని అలా వదిలేయాలని చెప్పుకొచ్చారు. ఇందుకు బదులిచ్చిన విద్యుత్‌ జమాల్‌... ‘మై ఫేవరెట్..‌ థాంక్యూ’  అంటూ ధన్యవాదాలు తెలిపాడు.( వెండితెరపై ‘1200 కిలో మీటర్ల పయనం’)

కాగా లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ సంస్థ డిస్నీ హాట్‌స్టార్‌.. ‘బాలీవుడ్‌కీ హోమ్‌డెలివరీ’ అంటూ 7 హిందీ సినిమాలను హాట్‌స్టార్‌లో విడుదల చేస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఖిలాడీ అక్షయ్‌ కుమార్‌ నటించిన లక్ష్మీ బాంబ్‌(కాంచన రీమేక్‌), అజయ్‌ దేవగణ్‌ ‘భూజ్‌’, అలియా భట్‌ సడక్‌-2, దివంగత సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ దిల్‌ బేచారా, అభిషేక్‌ బచ్చన్‌ ‘ది బిగ్‌బుల్‌’ సినిమాలతో పాటు ద్యుత్‌ జమాల్‌ ‘ఖుదా హాఫీజ్‌’, కునాల్‌ కేము ‘లూట్‌ కేస్‌’ తదితర సినిమాలతో తన ప్రేక్షకులకు వినోదం అందించనుంది. ఈ నేపథ్యంలో అక్షయ్‌కుమార్, అజయ్‌దేవగన్, అభిషేక్‌ బచ్చన్, ఆలియా భట్‌తో స్టార్‌ కిడ్‌, హీరో వరుణ్‌ ధావన్ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించాడు‌.(మరేం చేయాలి.. లొంగిపోవాలి అంతే!)

ఈ క్రమంలో ఈవెంట్‌కు తమను ఆహ్వానించలేదని, కనీసం సమాచారం కూడా ఇవ్వలేదని తీవ్ర ఆవేదనకు గురైన విద్యుత్‌ జమాల్‌, కునాల్‌ కేము సోషల్‌ మీడియా వేదికగా అసహనం వ్యక్తం చేశారు. ఇక ఈ విషయంపై స్పందించిన జెనీలియా సహా ఇతర నెటిజన్లు వీరిద్దరికి మద్దతు పలుకుతూ సంఘీభావం ప్రకటిస్తున్నారు. స్టార్స్‌, స్టార్‌ కిడ్స్‌కు మాత్రమే ఎక్కడైనా సముచిత గౌరవం దక్కుతుందంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. కాగా జెనీలియా, విద్యుత్‌ జమాల్‌ ఫోర్స్‌(వెంకటేష్‌ ఘర్షణ రీమేక్‌) సినిమాలో స్క్రీన్‌ షేర్‌ చేసుకున్న సంగతి తెలిసిందే.


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement