
'ఆ సినిమాను ప్రజలు బహిష్కరించాలి'
ఏ దిల్ హై ముష్కిల్ సినిమాను ఇంకా వివాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. రిలీజ్కు ముందు పాకిస్థానీ నటుల కారణంగా బ్యాన్కు గురైన ఈ సినిమా మహారాష్ట్ర ముఖ్యమంత్రి చొరవతో రిలీజ్ అయ్యింది. అయితే రిలీజ్ తరువాత కూడా ఈ సినిమాను వివాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. తాజాగా గోవా డీజీపీ ముఖేష్ చందర్ ఈ సినిమాను ప్రజలు బహిష్కరించాలంటూ ప్రజలకు పిలుపునిచ్చారు.
వివాదాలతోనే భారీ ప్రచారం పొందిన ఏ దిల్ హై ముష్కిల్ ఇప్పుడు మరో వివాదంలో ఇరుక్కుంది. సినిమాలోని ఓ డైలాగ్ లెజెండరీ సింగర్ మహ్మద్ రఫీని అవమానించేదిగా ఉందని, ఈ డైలాగ్ వల్ల సంగీతాభిమానుల మనోభావాలు దెబ్బతిన్నాయన్న వాదన వినిపిస్తోంది. సినిమాను బహిష్కరించాలంటూ ఏకంగా డీజీపీ స్థాయి వ్యక్తి పిలుపునివ్వటంతో ఈ సినిమా మరోసారి వార్తల్లో నిలిచింది.
రణబీర్ కపూర్, అనుష్క శర్మతో చెప్పిన 'మహ్మద్ రఫీ..? ఓ గాతే కమ్, రోతే జ్యాదా తే నా..?' అనే డైలాగ్ వివాదానికి కారణం అయ్యింది. ప్రస్తుతం మంచి కలెక్షన్లతో సత్తాచాటుతున్న ఏ దిల్ హై ముష్కిల్ సినిమాకు ఈ వివాదం వల్ల ఎంత నష్టం జరుగుతుందో చూడాలి.