అడవి శేష్‌తో శశికిరణ్
తెలుగు సినిమా కొత్తపుంతలు తొక్కుతోంది. పాతచింతకాయ పచ్చడి నుంచి బయటకొచ్చి కథే మూలంగా కథనం నడుస్తోంది.ఈ నేపథ్యంలోనే చిన్న సినిమాలూ పెద్ద విజయాలు అందుకుంటున్నాయి. ఓ బలమైన కథతోఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన గూఢచారి... తెలుగు జేమ్స్‌బాండ్‌లా గుర్తింపు పొందింది. ప్రేక్షకులకుఓ మంచి కిక్ ఇచ్చిన ఈ సినిమాకు సీక్వెల్ కూడా వస్తాయనితీయని కబురు అందించారుచిత్ర దర్శకుడు శశికిరణ్ తిక్క.ఆయన ‘సాక్షి’తో పంచుకున్నవిశేషాలివీ...
శ్రీనగర్‌కాలనీ: మాది రాజమండ్రి. ఇంట్లో అమ్మానాన్న, అన్నయ్య, నేను. విజయవాడ లయోలా కాలేజీలో బీకాం చేశాను. అక్కడ కల్చరల్ వింగ్‌కు లీడర్ నేనే. కొత్త ఆలోచనలతో నాటకాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేవాడిని. నేను చేసిన ఓ ఈవెంట్ చూసిన నాగార్జున యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ సినిమాల్లో ట్రై చేయమని సలహా ఇచ్చారు. బీకాం తర్వాత ఇక్ఫాయ్ యూనివర్సిటీలో ఎంబీఏ చేశాను. అప్పుడే ఐడీబీఐ బ్యాంక్‌లో ఇంటర్న్‌షిప్ చేశాను. జాబ్ ఆఫర్ వచ్చినప్పటికీ సినిమాలపై ఆసక్తితో 2007లో హైదరాబాద్ వచ్చేశాను.
ఇంగ్లిష్ సినిమాకుఅవకాశం...
సన్నిహితుల ద్వారా ఓ అడ్వర్‌టైజింగ్ ఏజెన్సీకి వెళ్లాను. మార్కెటింగ్ ఆఫర్ చేస్తే, నాకు క్రియేటివ్ సైడ్ ఆసక్తి ఉందని చెప్పాను. నా మొండితనం నచ్చి ఏజెన్సీ ఓనర్ సోదరుడు వాల్ట్ డిస్నీ యానిమేషన్ ఇంగ్లిష్ సినిమాలకు పనిచేసే ఉమాకాంత్ దగ్గరికి పంపించారు. అలా ఆయన దర్శకత్వంలో వచ్చిన చిల్డ్రన్ సినిమా ‘7 డేస్ ఇన్ స్లో మోషన్’ అనే ఇంగ్లీష్ చిత్రానికి ప్రోడక్షన్‌లో పని చేశాను. ఆ చిత్రాన్ని హైదరాబాద్‌లోనే రూపొందించారు. తర్వాత న్యూయార్క్ వెళ్లి ‘న్యూయార్క్ ఫిలిం అకాడమీ’లో దర్శకత్వంపై శిక్షణ తీసుకున్నాను.
అసిస్టెంట్‌గా ప్రయాణం ప్రారంభం...
ఇంగ్లిష్ చిత్రానికి పనిచేసిన సమయంలో దర్శకుడు శేఖర్ కమ్ముల దగ్గర పనిచేసే సూరి పరిచయమయ్యారు. ఇండియాకు తిరిగొచ్చాక ఆయన ద్వారా శేఖర్ కమ్ముల దగ్గర ‘లీడర్’ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశాను. నా పని విధానం నచ్చిన ఆయన సినిమాలకు ట్రై చేయమని ప్రోత్సహించారు. ఆ సమయంలోనే అడవి శేష్‌తో పరిచయం ఏర్పడింది. సినిమాల కోసం ప్రయత్నిస్తుండగా ఓ పెద్ద ప్రొడక్షన్‌లో అవకాశం వచ్చింది. కానీ అనివార్య కారణాలతో అది పట్టాలెక్కలేదు. ఆ సమయంలో అమెరికాలో వెబ్ సీరిస్ దర్శకుడిగా అవకాశం వచ్చింది. ఇక వెళ్లాలని నిర్ణయించుకున్నాను. అప్పటికే శేష్‌తో మంచి స్నేహం ఉంది. ఆయన అమెరికాలోనే ఉంటే.. ఫోన్ చేసి విషయం చెప్పాను. అయితే శేష్ నన్ను వద్దని వారించాడు. ‘సినిమా తీయాలనే నీ కలను నెరవేర్చుకో ముందు అని..’ ఫ్లైట్ టికెట్స్ క్యాన్సిల్ చేయించాడు.
మూల కథ శేష్‌దే...
శేష్‌కు నేనో బ్యాంక్ దొంగతనం కథ చెప్పాను. కానీ అది వర్కవుట్ కాలేదు. అప్పుడు శేష్ నాకో కథ చెప్పాడు. అయితే అది ఇప్పుడున్న పరిస్థితులకు సరిపోదని, ఇద్దరం కలిసి 8 నెలలు శ్రమించి స్క్రిప్ట్ రెడీ చేశాం. స్పై, థ్రిల్లింగ్, యాక్షన్ సన్నివేశాలతో తెలుగు జేమ్స్‌బాండ్‌లా గూఢచారిని రూపొందించాం. టెక్నాలజీ అడ్వాన్స్‌గా ఉండాలని దానిపై దృష్టిపెట్టాం. చిత్రంపై నమ్మకంతో నిర్మాతలు సైతం వెనుకాడలేదు. రచయిత అబ్బూరి రవి సలహాలు సూచనలిచ్చారు. 116 రోజుల్లో సినిమా పూర్తి చేశాం. ట్రైలర్‌కు, ఆ తర్వాత సినిమాకు వస్తున్న స్పందన మాకెంతో ఆనందాన్నిస్తోంది. ఇది అందరి కృషితోనే సాధ్యమైంది. గూఢచారి 2, గూఢచారి 3 చేయాలనే ఆలోచనలు మా ఇద్దరికీ ఉన్నాయి. సీక్వెల్‌కు ప్రయత్నాలు చేస్తున్నాం.
యాక్షన్, కామెడీ ఇష్టం...
నాకు యాక్షన్‌తో పాటు కామెడీ చిత్రాలు చేయాలని ఉంది. కామెడీ చిత్రాలతో ప్రేక్షకులకు మరింత దగ్గరవుతాం. సినిమా హిట్ అయిందనే గర్వం లేదు. హిట్ అయినా కాకున్నా సినిమానే జీవితం. నలుగురికి మంచి చేయాలనేదే నా భావజాలం. హైద రాబాద్‌లో ఫ్రీడమ్, ప్రశాంతత ఉంటుంది. ప్రశాసన్‌నగర్‌లోని పార్క్ అంటే ఇష్టం. జూబ్లీహిల్స్‌లోని స్మార్ట్ అలెక్, బంజారాహిల్స్‌లోని టెర్రసన్ కెఫెకు వెళ్తుంటాను. సమయం దొరికితే ఇంట్లోనే ఉంటాను.
రిజిస్ట్రార్ ఆఫీస్‌లో పెళ్లి...
నాది లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్. నా భార్య దీపిక యూఎస్‌లో జాబ్ చేస్తుండేది. మ్యాట్రిమోనీలో ఇద్దరి మనసులు కలవడంతో పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నాం. అప్పటికి గూఢచారి పట్టాలెక్కలేదు. ఇరు కుటుంబాల అంగీకారంతో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాం. పెళ్లికి అయ్యే ఖర్చును బ్యాంక్‌లో డిపాజిట్ చేసి, వచ్చే వడ్డీతో అనాథలకు సహాయం చేస్తున్నాం. మా ఆలోచనలు మానవతా దృక్పథానికి దగ్గరగా ఉంటాయి. కొంచెం సెటిల్ అయ్యాక ట్రస్ట్ ఏర్పాటు చేయాలనుకుంటున్నాం.
Comments
Please login to add a commentAdd a comment