ఇలాంటి కథే చేయాలనుకున్నా!
‘‘ఇండస్ట్రీకి వచ్చినప్పట్నుంచీ గోపాల్‌గారితో సినిమా చేయాలని నా కోరిక. నిర్మాత బుజ్జి (నల్లమలుపు శ్రీనివాస్) కాంబినేషన్‌లో ఓసారి అనుకున్నా... సినిమా కుదరలేదు. వంశీ (వక్కంతం) కథ చెబుతాడు.. వినమని గోపాల్‌గారు ఫోన్ చేశారు. కథ విన్న తర్వాత ఆయనతో చేస్తే... ఇలాంటి కథే చేయాలనుకున్నా’’ అన్నారు గోపీచంద్. ఆయన హీరోగా బి. గోపాల్ దర్శకత్వంలో తాండ్ర రమేశ్ నిర్మించిన ‘ఆరడుగుల బుల్లెట్’ వచ్చే నెల 9న విడుదల కానుంది.
గోపీచంద్ మాట్లాడుతూ – ‘‘చిరంజీవిగారు, బాలకృష్ణగారు వంటి పెద్ద హీరోలతో చేసిన గోపాల్‌గారితో వర్క్ ఎలా ఉంటుందో? అనుకున్నా. కానీ, కూల్‌గా షూటింగ్ జరిగింది. నయనతార లవ్లీ క్యారెక్టర్‌లో నటించారు. మణిశర్మగారు మంచి పాటలు, నేపథ్య సంగీతం ఇచ్చారు. సినిమా ఈ స్థాయికి రావడానికి కారణమైన పీవీపీగారికి థ్యాంక్స్’’ అన్నారు. ‘‘నా చిత్రాల్లో ఉండే మాస్, కామెడీలతో పాటు అన్ని ఎమోషన్స్ ఉన్నాయి’’ అన్నారు బి. గోపాల్. ‘‘కుటుంబమే ఆస్థి అని నమ్మే హీరో కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఏం చేశాడనేది చిత్రకథ’’ అన్నారు అబ్బూరి రవి. నిర్మాత తాండ్ర రమేశ్ పాల్గొన్నారు.