
విరాజ్.జె. అశ్విన్, గోపీచంద్
‘‘అనగనగా ఓ ప్రేమకథ’ సినిమా ట్రైలర్ చాలా బాగుంది. ఈ చిత్రం మంచి హిట్ కొట్టాలి. కె.ఎల్.ఎన్. రాజు చేసిన ఈ ప్రయత్నం విజయం సాధించాలి. విరాజ్ యాక్టింగ్, డైలాగ్ డెలివరీ బాగుంది. తను మంచి హీరో అవ్వాలని కోరుకుంటున్నా. సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం ఉంది’’ అని హీరో గోపీచంద్ అన్నారు. విరాజ్.జె. అశ్విన్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘అనగనగా ఓ ప్రేమకథ’. రిద్ది కుమార్, రాధా బంగారు కథానాయికలుగా నటించారు. ప్రతాప్ తాతంశెట్టి దర్శకత్వంలో కె. సతీష్‌కుమార్ సమర్పణలో కె.ఎల్.యన్. రాజు నిర్మించారు. ఈ చిత్రం ట్రైలర్‌ను హీరో గోపీచంద్ విడుదల చేశారు.
నిర్మాత రాజు మాట్లాడుతూ– ‘‘మా సినిమా టీజర్‌ను హీరో రానా విడుదల చేశారు. ఈ చిత్రంలోని పాటలను దర్శకులు పూరి జగన్నాథ్, శేఖర్ కమ్ముల, పరశురామ్, మణిరత్నం రిలీజ్ చేశారు. ఇప్పుడు ట్రైలర్‌ను గోపీచంద్‌గారు విడుదల చేయడం సంతోషంగా ఉంది. అరకు, విశాఖపట్నం, మలేసియా, హైదరాబాద్ ప్రాంతాల్లో చిత్రీకరణ పూర్తి చేశాం. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే సినిమా విడుదల తేదీ ప్రకటిస్తాం’’ అన్నారు. ‘‘గోపీచంద్ అన్నయ్య సినిమాలు చూస్తూ పెరిగాను. ఇప్పుడు నేను హీరోగా నటించిన సినిమా ట్రైలర్‌ను ఆయన రిలీజ్ చేయడం ఆనందంగా ఉంది’’ అని విరాజ్ అన్నారు. కాశీ విశ్వనాథ్, అనీష్ కురువిళ్ల, వేణు తదితరులు నటించిన ఈ సినిమాకి సంగీతం: కే.సి. అంజన్.
Comments
Please login to add a commentAdd a comment