ప్రతీకాత్మక చిత్రం
బాలీవుడ్ నటుడు, మాజీ ఎంపీ గోవిందా హాలీవుడ్ బ్లాక్ బస్టర్ సినిమా అవతార్‌లో నటించమని జేమ్స్ కామెరూన్ తనను అడిగాడని మొన్న సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా బాలీవుడ్ దర్శకుడు డేవిడ్ దావన్‌పై వివాదాస్పద వాఖ్యలు చేశాడు. 1989లో గోవింద, డేవిడ్ దావన్ దర్శకత్వంలో హీరోగా పరిచయమయ్యాడు. ఆ తర్వాత వీరి కాంబినేషన్‌లో 17 సినిమాలు వచ్చాయి. వీటిలో చాలా హిట్ అయ్యాయి. వీరి కాంబినేషన్‌లో వచ్చిన చివరి చిత్రం పార్ట్‌నర్. సల్మాన్, గోవింద హీరోలుగా 2007లో రిలీజ్ అయిన ఈ సినిమా మంచి విజయం సాదించింది. ఆ తర్వాత ఇప్పటి వరకు గోవిందా, డేవిడ్ కలిసి సినిమా చేయలేదు.
ఈ విషయంపై గోవింద ఇండియా టుడేతో జరిగిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘నేను రాజకీయాల నుంచి తప్పుకున్నాక ఒకరోజు నా సెక్రటరీతో డేవిడ్‌కు ఫోన్ చేయించి స్పీకర్ ఆన్ చేయమన్నాను. అవతలి నుంచి డేవిడ్ స్పందిస్తూ ‘‘చీచీ (గోవింద నిక్‌నేమ్) చాలా ప్రశ్నలు అడుగుతాడు. నేను అతనితో పని చేసే ప్రసక్తే లేదు. చిన్న చిన్న పాత్రలు చేసుకోమని చెప్పమన్నాడు’’. అతని సమాధానంతో నేను షాకయ్యాను. ఆ తర్వాత నాలుగైదు నెలల తర్వాత అతని సినిమాల్లో అతిథి పాత్రలు చేయాలని మళ్లీ ఫోన్ చేశాను. కానీ అతను స్పందించలేదు. అతను ఇదివరకు నాకు తెలిసిన డేవిడ్ కాడు. అతని మీద వేరే వారి ప్రభావమేదో ఉండి ఉండొచ్చు. అయితే ఇది జరిగి చాలా రోజులైంద’ని తెలిపాడు. ఇంకో ప్రశ్నకు సమాధానమిస్తూ ‘తోటి పంజాబీకి పని కల్పించమనే సంజయ్‌దత్ సూచన మేరకు నేను, డేవిడ్‌తో 17 సినిమాలు చేశాను. ఒకవేళ నా సోదరులు డైరెక్టర్‌గా ఉన్నా కూడా వారితో అన్ని సినిమాలు చేసేవాడిని కాదు. అంతెందుకు ఇప్పుడు వరుణ్ ధావన్ (డేవిడ్ ధావన్ కొడుకు) కూడా వాళ్ల నాన్నతో ఇన్ని సినిమాలు చేయలేడ’’ని చెప్పాడు.
Comments
Please login to add a commentAdd a comment