సినిమాపై కేసు.. 5 లక్షల ఫైన్
తమ సినిమా స్క్రిప్టును కాపీ కొట్టి హిందీ సినిమా తీశారని, అందువల్ల ఆ సినిమా విడుదలను వాయిదా వేయాలని కోరుతూ కోర్టుకెక్కిన గుజరాతీ నిర్మాతలకు బాంబే హైకోర్టు మొట్టికాయలు వేసింది. అనుష్కా శర్మ సహనిర్మాతగా వ్యవహరించి.. సరదా దెయ్యంగా నటించిన 'ఫిల్లౌరీ' సినిమా విడుదలపై స్టే ఇవ్వడానికి నిరాకరించడమే కాక, విలువైన కోర్టు సమయాన్ని వృథా చేసినందుకు గుజరాతీ సినిమా మంగళ్ ఫేరా నిర్మాతలకు రూ. 5 లక్షల జరిమానా విధించింది. గాయత్రీ సినీ ప్రొడక్షన్ ప్రతినిధులు గాయత్రి, దర్శన్ రాథోడ్ ఈ పిటిషన్ దాఖలు చేశారు.
మంగళ్ ఫేరా సినిమాను తొలుత గుజరాతీలోను, ఆ తర్వాత భోజ్‌పురి, బెంగాలీ భాషల్లోను నిర్మించారు. తమ సినిమాలో ఓ మహిళ చెట్టును పెళ్లి చేసుకుంటుందని, కానీ ఆ చెట్టుమీద ఉన్న దెయ్యం ఆమెను ఇష్టపడి తన భార్యగా భావిస్తుందని దర్శక నిర్మాతలు చెప్పారు. ఫిల్లౌరి సినిమాలో హీరో దిల్జీత్ దోసంజ్ తన దోషాన్ని పరిహరించుకోడానికి ఇలా ఓ చెట్టును పెళ్లాడతాడు. ఆ చెట్టుమీద ఉండే దెయ్యమైన అనుష్కాశర్మ అతడిని ఇష్టపడి.. నువ్వే నా భర్త అంటుంది. అప్పటినుంచి జరిగే సరదా సన్నివేశాల చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంటుంది. ఫాక్స్ స్టార్‌తో కలిసి అనుష్కా శర్మ ఈ సినిమాను స్వయంగా నిర్మించింది. ఈ సినిమా ఈ శుక్రవారమే విడుదల అవుతోంది.