
రామ్ రహీమ్ సింగ్ మరో సంచలనం
ఆధ్యాత్మిక గురువు గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ మరో సంచలనానికి సిద్ధమయ్యారు.
ముంబై: ఆధ్యాత్మిక గురువు గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ మరో సంచలనానికి సిద్ధమయ్యారు. పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్(పీవోకే)లో భారత సైన్యం ఇటీవల జరిపిన సర్జికల్ దాడుల నేపథ్యంలో సినిమా తీస్తున్నట్టు ప్రకటించారు. సర్జికల్ దాడులకు ఆధారాలు చూపాలని డిమాండ్ చేస్తున్న వారికి ఈ సినిమా సమాధానంగా నిలుస్తుందన్నారు. ‘ఎం.ఎస్.జి.- ద వారియర్ లయన్ హార్ట్’ విజయోత్సవం సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.
' ‘ఎం.ఎస్.జి.- ద లయన్ హార్ట్- హింద్ కా నాపాక్ కో జవాబ్’ పేరుతో సినిమా మొదలు పెట్టబోతున్నాను. దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను ఇందులో ప్రధానంగా చూపించబోతున్నాం. సైన్యం జరిపిన సర్జికల్ దాడులకు ఆధారాలు చూపించాలని అడుగుతున్నవారికి ఇందులో సమాధానం దొరుకుతుంది. 25 రోజుల్లోనే ఈ సినిమా పూర్తిచేయాలని భావిస్తున్నామ'ని తెలిపారు.
సెప్టెంబర్ 18న కశ్మీర్ లోని ఉడీ సైనిక స్థావరంపై ఉగ్రవాదులు జరిపిన దాడిలో 19 మంది సైనికులు అమరులయ్యారు. దీనికి స్పందనగా భారత ఆర్మీ పీవోకేలోని తీవ్రవాద స్థావరాలపై సర్జికల్ దాడులు చేసింది. 'తరచుగా మనం సైనికులను కోల్పోతున్నాం. ఎంతమంది దీని గురించి మాట్లాడుతున్నారు? హఠాత్తుగా కొంతమంది తెరపైకి వచ్చి సర్జికల్ దాడులకు ఆధారాలు చూపాలని అడుగుతున్నారు. ఇది నన్ను చాలా బాధించింది. ఇలాంటి వారికి నా సినిమా ద్వారా చెప్పాలనుకున్నా'నని గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ అన్నారు.