జీవీ.ప్రకాశ్‌కుమార్
పెరంబూరు: యువ సంగీత దర్శకుడు, నటుడు జీవీ.ప్రకాశ్‌కుమార్ గురువారం పొల్లాచ్చి ప్రాంతానికి 50 సీసీ కెమెరాలను వితరణ చేశారు. చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉన్న ఈయన నటించిన కుప్పత్తురాజా గతవారం తెరపైకి వచ్చింది. ఈ శుక్రవారం జీవీ నటించిన వాచ్‌మెన్ తెరపైకి వచ్చింది. త్వరలో 100 శాతం లవ్ చిత్రం తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. కాగా విజయ్ దర్శకత్వం వహించిన వాచ్‌మన్ చిత్రాన్ని గురువారం నగరంలోని 300 మంది విద్యార్థులకు ఉచితంగా ప్రదర్శించారు. పూర్తి వినోదభరితంగా సాగే ఈ చిత్రాన్ని విద్యార్థులు చప్పట్లు కొడుతూ ఎంజాయ్ చేస్తూ చూశారని ఆ చిత్ర కథానాయకుడు జీవీ.ప్రకాశ్‌కుమార్ మీడియాకు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన స్థానిక సాలిగ్రామంలోని బాలలోక్ పాఠశాలలోని విద్యార్థులను కలిసి వారితో ముచ్చటించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ వాచ్‌మెన్ చిత్ర ఆడియా ఆవిష్కరణ సమావేశంలో పొల్లాచ్చి గ్రామానికి 50 సీసీ కెమెరాలను అందిస్తానని ప్రకటించానని, ఆ విధంగా 50 సీసీ కెమెరాలను ఆ గ్రామానికి అందించినట్లు తెలిపారు. ఇటీవల పొల్లాచ్చిలో జరిగిన అత్యాచార సంఘటన ఆవేదనను కలిగించిందన్నారు. మానసిక రోగులే అలాంటి అఘాయిత్యాలకు పాల్పడతారని అన్నారు. విద్యార్థులు అవగాహనతో మెలగాలని, తల్లిదండ్రులు పిల్లలపై జాగ్రత్త వహించాలని జీవీ పేర్కొన్నారు. అదే విధంగా విదేశాల్లో లైంగిక అవగాహన గురించిన పాఠ్యాంశాలను పాఠశాలల్లో ప్రవేశ పెడుతున్నారని, అలాంటి అవగాహనతో కూడిన పాఠ్యాంశాలు మన దేశంలో కూడా ప్రవేశపెడితే బాగుంటుందనే అభిప్రాయాన్ని జీవీ.ప్రకాశ్‌కుమార్ వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment