రియల్ లైఫ్‌కి దగ్గరగా... రీల్ లైఫ్‌కి దూరంగా!
‘‘తెలుగు చిత్రసీమ నాకు తల్లితో సమానం. తల్లినీ, తెలుగు చిత్రసీమనీ ఎప్పుడూ మరువను. వరుస తమిళ చిత్రాలతో బిజీగా ఉండడం వల్ల తెలుగులో గ్యాప్ వస్తోంది’’ అన్నారు హన్సిక. మంచు విష్ణుకి జోడీగా ఆమె నటించిన ‘లక్కున్నోడు’ రిలీజ్ ఈ రోజే. ఈ సందర్భంగా హన్సిక మాట్లాడుతూ – ‘‘మంచు విష్ణు మా ఫ్యామిలీ మెంబర్‌తో సమానం. తనతో నటించిన మూడో చిత్రమిది. ఇందులో పాజిటివ్ పద్మ పాత్ర చేశా. నా రియల్ లైఫ్‌కి దగ్గరగా, గత చిత్రాల్లో చేసిన పాత్రలకు భిన్నంగా ఉంటుంది.
దర్శకుడు రాజకిరణ్ చాలా ఫాస్ట్. 50 రోజుల్లో మంచి క్వాలిటీతో సిన్మా తీశారు. తండ్రి సెంటిమెంట్‌తో కూడిన చక్కని ప్రేమకథ. లక్కీగా భలే రిలీజ్ డేట్ దొరికింది. ప్రేక్షకులకి నచ్చుతుందని ఆశిస్తున్నా. ఇక, వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే... ఇప్పటివరకూ 31మందిని దత్తత తీసుకున్నా. రెండేళ్లలో ఓ వృద్ధాశ్రమాన్ని ఏర్పాటు చేయాలనుంది’’ అన్నారు. ప్రస్తుతం గోపీచంద్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంతో పాటు మరికొన్ని తమిళ సినిమాల్లో హన్సిక నటిస్తున్నారు. ‘జయం’ రవికి జోడీగా ఆమె నటించిన తమిళ చిత్రం ‘బోగన్’ వచ్చె నెల 9న విడుదల కానుంది.