lakkunnodu
-
వారిద్దరిలా నాకు వయసవ్వలేదు
నయనతార, త్రిషలా నాకు వయసవ్వలేదు అంటోంది నటి హన్సిక. తమిళం, తెలుగు భాషల్లో కథానాయకిగా మంచి గుర్తింపు పొందిన నటి ఈ ఉత్తరాది భామ. అయితే తెలుగు కంటే తమిళంలోనే అధిక చిత్రాల్లో నటించారు. ఇక్కడ విజయ్, సూర్య, ధనుష్, జయంరవి, ఆర్య ఇలా స్టార్ హీరోలందరితోనూ నటించారు. అలాంటి హన్సికకు అనూహ్యంగా మార్కెట్ డౌన్ అయ్యింది. చేతిలో ఒక్క చిత్రం లేదు. తెలుగులో చాలా గ్యాప్ తరువాత నటించిన లక్కున్నోడు చిత్రం ఇటీవలే విడుదలైంది. ఇక తమిళంలో జయంరవికి జంటగా ముచ్చటగా మూడోసారి నటించిన భోగన్ చిత్రం ఫిబ్రవరి రెండవ తేదీన తెరపైకి రానుంది. ఈ చిత్రం మంచి విజయం సాధిస్తే హన్సికకు కొత్త అవకాశాలేమైనా వస్తాయేమో. కొత్త అవకాశాల కోసం గాలం వేసే పనిలో పడ్డారీ అమ్మడు. అందులో భాగంగా తానెప్పుడూ హీరోలను దృష్టిలో పెట్టుకుని చిత్రాలను ఒప్పుకోలేదని, తన కథాపాత్రలు నచ్చితేనే అంగీకరించి నటించానని చెప్పుకొచ్చారు. కథ నచ్చక ప్రముఖ హీరోల చిత్రాలు కూడా వదిలేశానని అన్నారు. ఇకపోతే నూతన నటుల సరసస నటిస్తారా? అని చాలా మంది అడుగుతున్నారని, అలాంటి అవకాశాలు వెతుక్కుంటూ వస్తే తప్పకుండా నటిస్తానని అన్నారు. అదే విధంగా నయనతార, త్రిషలా హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటిస్తారా? అన్న ప్రశ్నకు నయనతార, త్రిషలా తనకు వయసవ్వలేదని, ఇప్పటికి తన వయసు 25 నని అన్నారు. వారి వయసుకు వచ్చిన తరువాత అలాంటి పాత్రల గురించి ఆలోచిస్తానని చర్చనీయాంశ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతానికి తన వయసుకు తగ్గట్టు యూత్‌ఫుల్ పాత్రల్లోనే నటిస్తానని హన్సిక చెప్పుకొచ్చారు. అయితే అలాంటి అవకాశాలు ప్రస్తుతానికి కనుచూపుమేరలో కనిపించడం లేదన్నది గమనార్హం. ఆఫ్టర్ భోగన్ ఏమైనా అవకాశాలు వస్తాయేమో చూద్దాం. -
రియల్ లైఫ్‌కి దగ్గరగా... రీల్ లైఫ్‌కి దూరంగా!
‘‘తెలుగు చిత్రసీమ నాకు తల్లితో సమానం. తల్లినీ, తెలుగు చిత్రసీమనీ ఎప్పుడూ మరువను. వరుస తమిళ చిత్రాలతో బిజీగా ఉండడం వల్ల తెలుగులో గ్యాప్ వస్తోంది’’ అన్నారు హన్సిక. మంచు విష్ణుకి జోడీగా ఆమె నటించిన ‘లక్కున్నోడు’ రిలీజ్ ఈ రోజే. ఈ సందర్భంగా హన్సిక మాట్లాడుతూ – ‘‘మంచు విష్ణు మా ఫ్యామిలీ మెంబర్‌తో సమానం. తనతో నటించిన మూడో చిత్రమిది. ఇందులో పాజిటివ్ పద్మ పాత్ర చేశా. నా రియల్ లైఫ్‌కి దగ్గరగా, గత చిత్రాల్లో చేసిన పాత్రలకు భిన్నంగా ఉంటుంది. దర్శకుడు రాజకిరణ్ చాలా ఫాస్ట్. 50 రోజుల్లో మంచి క్వాలిటీతో సిన్మా తీశారు. తండ్రి సెంటిమెంట్‌తో కూడిన చక్కని ప్రేమకథ. లక్కీగా భలే రిలీజ్ డేట్ దొరికింది. ప్రేక్షకులకి నచ్చుతుందని ఆశిస్తున్నా. ఇక, వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే... ఇప్పటివరకూ 31మందిని దత్తత తీసుకున్నా. రెండేళ్లలో ఓ వృద్ధాశ్రమాన్ని ఏర్పాటు చేయాలనుంది’’ అన్నారు. ప్రస్తుతం గోపీచంద్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంతో పాటు మరికొన్ని తమిళ సినిమాల్లో హన్సిక నటిస్తున్నారు. ‘జయం’ రవికి జోడీగా ఆమె నటించిన తమిళ చిత్రం ‘బోగన్’ వచ్చె నెల 9న విడుదల కానుంది. -
అప్పుడు బ్యాడ్ బిజినెస్ మ్యాన్ కింద లెక్క!
‘‘హీరోలు కాదు, దర్శకులే నిజమైన ఫిల్మ్ మేకర్స్. రియల్ స్టార్ పవర్ ఉండేది దర్శకుల చేతిలోనే! ఈ సంక్రాంతికి వచ్చిన చిత్రాలు చూడండి. ‘ఖైదీ నంబర్ 150’ వంటి చిత్రాలు చిరంజీవి అంకుల్ చాలా చేసినా... వీవీ వినాయక్‌గారు మళ్లీ బ్రహ్మాండంగా తీశారు. ‘గౌతమిపుత్ర శాతకర్ణి’లో చరిత్రని క్రిష్ అద్భుతంగా ఆవిష్కరించారు. రెండూ హిట్టయ్యాయి కదా! నిజంగా, ప్రేక్షకులను మార్చగలిగేది దర్శక, రచయితలే’’ అన్నారు మంచు విష్ణు. ఆయన హీరోగా రాజకిరణ్ దర్శకత్వంలో ఎంవీవీ సత్యనారాయణ నిర్మించిన ‘లక్కున్నోడు’ రేపు ప్రేక్షకుల ముందుకొస్తుంది. ఈ సందర్భంగా విష్ణు చెప్పిన విశేషాలు.... శాంతియుత పోరాటం వల్లే మనకు స్వాతంత్య్రం వచ్చింది. మరోసారి ‘జల్లికట్టు’ ఆ అంశాన్ని గుర్తు చేసింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేక హోదా కోసం పోరాటానికి సిద్ధమవుతున్నారు. ఎవరైనా శాంతియుతంగా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తే తప్పకుండా గుర్తించాలి. నాకు మంట తెప్పించే అంశం ఏంటంటే... ఉత్తరాది, దక్షిణాదిల మధ్య ఓ విభజన రేఖ గీయడం. మనం (దక్షిణాది ప్రజలు) నిర్ణయిస్తేనే ఢిల్లీలో ప్రభుత్వాలు ఏర్పడతాయి. కానీ, వాళ్లు మనకి సరైన విలువ, గౌరవం, గుర్తింపు ఇవ్వడం లేదు. విలువ ఇవ్వనప్పుడు వేర్వేరు దేశాలు చేస్తే బాగుంటుంది కదా. ► ‘ఎస్3’ వాయిదాతో లక్కీగా మీకు మంచి విడుదల తేదీ దొరికింది! సినిమా ప్రారంభించినప్పుడు జనవరి 26న విడుదల చేయాలనేది మా ప్లాన్. లాంగ్ వీకెండ్, సెలవులు, మంచి విడుదల తేదీ అనేది మా ఫీలింగ్. ఫస్ట్ కాపీ ఎప్పుడో రెడీ అయింది. కానీ, డిసెంబర్లో రావాల్సిన చిత్రాలు వాయి దా పడడంతో వచ్చే నెల 3న విడుదల చేద్దామనుకున్నాం. 26న ఖాళీ కావడంతో వచ్చేస్తున్నాం. ► ఈ సినిమాలో మీ పేరు లక్కీ. పేరులో ఉన్న లక్ ఆ కుర్రాడి జీవితంలో ఉందా? ‘నేను లక్కీనా? అన్‌లక్కీనా?’ అనే ప్రశ్న అతడిలోనూ ఉంటుంది. ఎందుకంటే... తన ప్రమేయం లేకుండానే లక్కీ జీవితంలో ఏవేవో జరుగుతాయి. అందరూ అతణ్ణి అపార్థం చేసుకుంటారు. అలా అపార్థం చేసుకున్న తండ్రి చేత ఒక్క ప్రశంస అయినా పొందాలని లక్కీ కోరిక. తండ్రి సెంటిమెంట్‌తో కూడిన మంచి కామెడీ ఎంటర్టైనర్. ► థ్రిల్లర్స్ తీసిన దర్శకుడు రాజకిరణ్, ఈ కామెడీ టచ్ ఉన్న సిన్మాని ఎలా హ్యాండిల్ చేశారు? ఆయనలో విపరీతమైన కామెడీ టైమింగ్ ఉంది. ‘గీతాం జలి’ని కొంచెం కామెడీగానే తీశారు కదా. మంచి కథకి తోడు ప్రతి సీన్లోనూ నవ్వించే డైలాగులు పడ్డాయి. ఈ సినిమాకి మెయిన్ హీరో డైలాగ్సే. ‘డైమండ్’ రత్నబాబు కథ చెబుతున్నంత సేపూ నేను నవ్వుతూనే ఉన్నాను. ప్రేక్షకులూ అంతే ఎంజాయ్ చేస్తారు. ఇందులో నా సై్టల్ ఆఫ్ యాక్షన్, కామెడీ, మంచి పాటలు.. అన్నీ ఉన్నాయి. ► మీ లక్కీ పెయిర్ హన్సికని రిపీట్ చేయాలనే ఐడియా ఎవరిది? ఇందులో హీరో హీరోయిన్ల మధ్య మంచి కామెడీ టైమింగ్, సాన్నిహిత్యం ఉండాలి. దర్శకుడు కథ చెప్పినప్పుడు ‘మీరు, హన్సిక అయితే బాగుంటుంది. సినిమాలు చేశారు కదా. మళ్లీ జంటగా నటిస్తారా?’ అనడిగారు. ఆయన ముందే హన్సికకి ఫోన్ చేసి అడగ్గానే కథ వినకుండానే ఓకే చెప్పేసింది. ►బయట నిర్మాణ సంస్థల్లో నటిస్తున్నప్పుడు ఎలా ఉంటుంది? బ్యానర్ ఎవరిదైనా డబ్బు డబ్బే. సొంత సినిమాకి ఎంత ఖర్చుపెట్టినా నా ప్రమోషన్ కాస్ట్ అనుకోవచ్చు. బయట నిర్మాతలతో అయితే జాగ్రత్తగా, లాభాలు రావాలని ఆలోచిస్తా. ►హీరోగా, నిర్మాతగా మీరు లెక్కలు వేసుకుంటారా? వంద శాతం. లేదంటే బ్యాడ్ బిజినెస్‌మ్యాన్ కింద లెక్క. ఉదాహరణకు.. నా లాస్ట్ సినిమా 20 కోట్లు వసూలు చేస్తే, కొత్త సినిమాకి అంత బడ్జెట్ కాకుండా 15 కోట్లలో సినిమా లాభం వచ్చేలా చూసుకోవాలి. 20 కోట్లు వచ్చాయని 30 కోట్లు పెట్టి సినిమా తీయాలనుకోను. కథ విన్నప్పుడే బడ్జెట్ ఎంతనే అవగా హన వచ్చేస్తుంది. కొన్ని సినిమాలకు మాత్రం ఈ లెక్కలు వేయకూడదు. ‘భక్త కన్నప్ప’కి మేం అనుకున్న బడ్జెట్ 45 కోట్లు. ఇప్పుడు నా మార్కెట్ వేల్యూ అంత లేదు. కానీ, ఆ కథపై నాకంత నమ్మకం. ►‘భక్త కన్నప్ప’, ‘రావణ్’ సినిమాలు ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? ప్రస్తుతం ‘భక్త కన్నప్ప’ స్టోరీబోర్డ్ స్టేజిలో ఉంది. తనికెళ్ల భరణిగారు కథ మాత్రమే ఇస్తున్నారు. ఇక, నా డ్రీమ్ ప్రాజెక్ట్ ‘రావణ్’ ఎప్పుడనేది రాముడే చెప్పాలి. -
సింగం వెనక్కి.. లక్కీ ముందుకి!
అతని పేరు లక్కీ. పేరులో ఉన్న అదృష్టం జీవితంలో లేదనుకుంటాడు. అయితే.. అనూహ్యంగా ఓ రోజు అతడి దగ్గరకి పాతిక కోట్లు వస్తాయి. ఆ డబ్బు ఎవరిది? చేతికి డబ్బు వచ్చిన తర్వాత లక్కీ ఏం చేశాడు? అసలు కథేంటో తెలుసుకోవాలంటే ‘లక్కున్నోడు’ చూడాల్సిందే. మంచు విష్ణు, హన్సిక జంటగా రాజకిరణ్ దర్శకత్వంలో ఎంవీవీ సత్యనారాయణ నిర్మించిన సినిమా ‘లక్కున్నోడు’. ఈ నెల 26న ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నట్టు నిర్మాత ప్రకటించారు. మొదట ‘లక్కున్నోడు’ని ఫిబ్రవరి 3న రిలీజ్ చేయాలనుకున్నారు. ఈ 26న రిలీజ్ కావాల్సిన సూర్య ‘సింగం–3’ వాయిదా పడడంతో లక్కీగా మంచు విష్ణు ముందుకి రావాలనే నిర్ణయం తీసుకున్నారు. చెన్నైలో ‘జల్లికట్టు’ ఉదంతం, తదనంతర పరిణామాల నేపథ్యంలో ‘సింగం–3’ రిలీజ్‌కి ఇది సరైన సమయం కాదని భావించి వాయిదా వేశామని తెలుగు వెర్షన్ ‘ఎస్3–యముడు3’ నిర్మాత మల్కాపురం శివకుమార్ తెలిపారు. -
అందుకే నేను లక్కున్నోణ్ణి
– మంచు విష్ణు ‘‘సుమారు 180 చిత్రాల్లో హీరోగా చేసినా... నటుడిగా 560 చిత్రాలు చేసినా... విలన్ పాత్రంటేనే నాకు ఇష్టం. విలన్ వేషాలు వేద్దామనే మద్రాస్ వెళ్లాను. ప్రతినాయకుడి పాత్ర చేయడం సులువు కాదు. ఈ చిత్రంలో పాత్రకు తగ్గట్టు విలన్‌గా నిర్మాత ఎంవీవీ అద్భుతంగా నటించారు. నా తదుపరి చిత్రంలో అతనే మెయిన్ విలన్’’ అన్నారు మంచు మోహన్‌బాబు. ఆయన కుమారుడు మంచు విష్ణు హీరోగా రాజాకిరణ్ దర్శకత్వంలో ఎంవీవీ సత్యనారాయణ నిర్మించిన చిత్రం ‘లక్కున్నోడు’. ప్రవీణ్ లక్కరాజు స్వరపరచిన ఈ చిత్రం పాటల సీడీలను మోహన్‌బాబు విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ – ‘‘ఈమధ్యకాలంలో ఇంత మంచి చిత్రం చూడలేదు. ప్రతి సీన్లోనూ ట్విస్ట్‌తో దర్శకుడు భలే నవ్వించారు. చివర్లో, తండ్రీకొడుకుల సెంటిమెంట్ కంటతడి పెట్టించింది. విష్ణు కోసమే ‘డైమండ్’ రత్నబాబు ఈ కథ రాశాడు. డైలాగులు బాగున్నాయి. విష్ణు మంచి క్రమశిక్షణ ఉన్నవాడని అందరూ చెబుతుంటే సంతోషంగా ఉంది. జీవితమంతా సుఖాలు లేదా కష్టాలు ఉండవు. ఎప్పుడో ఒకసారి దేవుడు చేయి అందించి, పైకి లాగుతాడు. అందుకని క్రమశిక్షణగా మెలగాలి. ‘చెప్పిన టైమ్ కంటే ముందు సెట్‌కి వెళితే.. దర్శక, నిర్మాతలతో పాటు ప్రతి ఒక్కరూ భయపడతారు. లేటుగా వెళితే వాళ్లకి నువ్వు భయపడాలి. నీకు వాళ్లు భయపడాలా? నువ్వు భయపడాతావా? ఆలోచించుకో’ అని దాసరిగారు అన్నారు. ఆ క్రమశిక్షణ, పద్ధతి నా బిడ్డలకు నేర్పించా’’ అన్నారు. ‘‘పది కోట్ల తెలుగు ప్రజల్లో ఇరవై, ముప్ఫై మంది హీరోలున్నారు. వారిలో నేనొకణ్ణి. నా తల్లిదండ్రులను, నన్ను ప్రేమించే అభిమానులను చూసి నేను ‘లక్కున్నోడి’గా భావిస్తున్నా’’ అన్నారు మంచు విష్ణు. ‘‘విష్ణుతో మరో సినిమా చేయాలనుంది. ఆయనలాంటి హీరోని నేను చూడలేదు. కామెడీతో పాటు మంచి ఎమోషన్స్ ఉన్న సినిమా ఇది’’ అన్నారు రాజాకిరణ్. ‘‘విష్ణుతో మరిన్ని సినిమాలు చేయాలనుంది. విష్ణు కామెడీ టైమింగ్ సినిమాకి ప్లస్’’ అన్నారు ఎంవీవీ సత్యనారాయణ. ప్రతి ఫ్యామిలీ చూడదగ్గ చిత్రమిదని ‘డైమండ్’ రత్నబాబు అన్నారు. పరుచూరి గోపాలకృష్ణ, పోసాని కృష్ణమురళి, కోన వెంకట్, రఘుబాబు తదితరులు పాల్గొన్నారు. -
ఫిబ్రవరిలో... లక్
‘దేనికైనా రెడీ’, ‘పాండవులు పాండవులు తుమ్మెద’ తర్వాత మంచు విష్ణు, బబ్లీ బ్యూటీ హన్సిక జంటగా తెరకెక్కిన తాజా చిత్రం– ‘లక్కున్నోడు’. ‘గీతాంజలి’, ‘త్రిపుర’ వంటి హారర్ చిత్రాలతో ప్రేక్షకులను భయపెట్టిన రాజ్ కిరణ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఎం.వి.వి సినిమా పతాకంపై ఎం.వి.వి. సత్యనారాయణ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తవడంతో చిత్రబృందం గుమ్మడికాయ కొట్టేశారు. నిర్మాత మాట్లాడుతూ– ‘‘లవ్ అండ్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన చిత్రమిది. ఈ సినిమాతో విష్ణు, హన్సికల కాంబినేషన్ మూడో హిట్ సాధించనుంది. నటీనటులు, సాంకేతిక నిపుణుల సపోర్ట్‌తో అనుకున్న టైమ్‌కి షూటింగ్ పూర్తయింది. పోసాని, ‘వెన్నెల’ కిశోర్, ప్రభాస్ శ్రీనుల వినోదం ప్రేక్షకులను కడుపు»్బ నవ్విస్తుంది. జనవరిలో పాటలు, ఫిబ్రవరి 3న సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: పి.జి.విందా, సంగీతం: అచ్చు ప్రవీణ్ లక్కరాజు, స్క్రీన్‌ప్లే, మాటలు: డైమండ్ రత్నబాబు, సహ నిర్మాత: రెడ్డి విజయ్‌కుమార్. -
మనసున్నోడు!
ప్రేమించిన అమ్మాయి అతడి పక్కనే ఉంది. మనీకి లోటుందా? అనడిగితే, లేదనే చెప్పాలి. అన్నిటికీ మించి ఆ కుర్రాడు మంచి మనసున్నోడు, అదృష్టవంతుడు. మరి, ఇంకేంటి అతడి సమస్య? అంటే... ‘లక్కున్నోడు’ విడుదల వరకూ వెయిట్ చేయమంటున్నారు దర్శకుడు రాజ్‌కిరణ్. మంచు విష్ణు, హన్సిక జంటగా ఆయన దర్శకత్వంలో ఎంవీవీ సత్యనారాయణ నిర్మిస్తున్న సినిమా ‘లక్కున్నోడు’. నేడు విష్ణు బర్త్‌డే సందర్భంగా టీజర్ విడుదల చేశారు. ‘‘విష్ణు శైలిలో సాగే లవ్ ఎంటర్టైనర్ ఇది. త్వరలో పాటల్ని, డిసెంబర్లో చిత్రాన్ని రిలీజ్ చేయాలనుకుంటున్నాం’’ అని నిర్మాత అన్నారు. ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే, మాటలు: ‘డైమండ్’ రత్నబాబు, కెమేరా: పీజీ విందా, సంగీతం: అచ్చు, ప్రవీణ్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: విజయ్‌కుమార్. -
లక్కు... లెక్కున్నోడు!
ప్రతిభతో పాటు అదృష్టం తోడైతే.. ఏ రంగంలోనైనా విజయం తథ్యమనేది పెద్దల మాట. ఆ కుర్రాడి అదృష్టానికి లోటు లేదు. లక్ మాత్రమే కాదు, లెక్క కూడా బోలెడంత ఉందట. దాంతో ఈ లెక్కునోణ్ణి ‘లక్కున్నోడు’ అంటుంటారంతా. మరి, లవ్ సంగతేంటి? అనడిగితే... మా ‘లక్కున్నోడు’ విడుదల వరకూ ఎదురు చూడమంటున్నారు దర్శకుడు రాజ్ కిరణ్. మంచు విష్ణు, హన్సిక జంటగా నటిస్తున్న మూడో చిత్రమిది. రాజ్ కిరణ్ దర్శకత్వంలో ఎం.వి.వి. సత్యనారాయణ నిర్మిస్తున్నారు. ఈ నెలాఖరుతో చిత్రీకరణ పూర్తవుతుంది. నిర్మాత మాట్లాడుతూ - ‘‘లవ్, కామెడీలతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్న చిత్రమిది. విష్ణు పాత్ర, లుక్ కొత్తగా ఉంటాయి. ‘దేనికైనా రెడీ’, ‘పాండవులు పాండవులు తుమ్మెద’ చిత్రాల తర్వాత విష్ణు, హన్సిక జంటగా నటిస్తున్న ఈ చిత్రం కూడా మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. తనికెళ్ల భరణి, పోసాని కృష్ణమురళి, ‘వెన్నెల’ కిశోర్, ‘ప్రభాస్’ శీను, ‘సత్యం’ రాజేశ్ నటిస్తున్న ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే-మాటలు: ‘డైమండ్’ రత్నబాబు, కెమేరా: పి.జి. విందా, సంగీతం: అచ్చు, సహ నిర్మాత: రెడ్డి విజయ్‌కుమార్. -
లవ్‌లో లక్కున్నోడు
అమ్మాయితో ప్రేమలో పడితే చాలదు. ఆ ప్రేమను దక్కించుకోవాలంటే ఒక్కోసారి అదృష్టమూ కలసి రావాలనే కథాంశంతో రూపొందుతోన్న సినిమా ‘లక్కున్నోడు’. మంచు విష్ణు, హన్సిక జంటగా నటిస్తున్న మూడో చిత్రమిది. రాజ్ కిరణ్ దర్శకత్వంలో ఎంవీవీ సత్యనారాయణ నిర్మిస్తున్నారు. ఈ సినిమా రెండో షెడ్యూల్ సోమవారం ప్రారంభం కానుంది. నిర్మాత మాట్లాడుతూ - ‘‘లవ్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ ఇది. విష్ణు కామెడీ సినిమాకే హైలైట్ అవుతుంది. సోమవారం నుంచి నవంబర్ వరకూ జరిగే షెడ్యూల్లో షూటింగ్ అంతా పూర్తి చేస్తాం’’ అన్నారు. రాజ్ కిరణ్ మాట్లాడుతూ - ‘‘వింత వింత మనస్తత్వాలున్న ఓ కుటుంబంలోని అమ్మాయిని ప్రేమిస్తాడు ఓ అబ్బాయి. వింత మనుషులతో వేగుతూ ఆ అబ్బాయి తన ప్రేమకథను ఎలా గెలిపించుకున్నాడు? అదృష్టం అతనికి ఎలా కలిసొచ్చింది? అనేది ఆసక్తికరం’’ అన్నారు. తనికెళ్ల భరణి, ‘వెన్నెల’ కిశోర్, పోసాని కృష్ణమురళి, ప్రభాస్ శీను, ‘సత్యం’ రాజేశ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే-మాటలు: ‘డైమండ్’ రత్నబాబు, కెమేరా: పీజీ విందా, సంగీతం: అచ్చు, ప్రవీణ్ లక్కరాజు, సహ నిర్మాత: రెడ్డి విజయ్‌కుమార్. -
వెరైటీ ఫ్యామిలీతో..!
రెండేళ్ల తర్వాత హన్సిక నటిసున్న స్ట్రయిట్ తెలుగు సినిమా ‘లక్కున్నోడు’. హీరో మంచు విష్ణుతో ఆమెకిది మూడో సినిమా. రాజ్‌కిరణ్ దర్శకత్వంలో ఎంవీవీ సత్యనారాయణ ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఇందులో కథంతా హన్సిక పాత్ర చుట్టూనే తిరుగుతుందట. పద్మ అనే అమ్మాయి పాత్రలో హన్సిక నటిస్తున్నారు. పద్మతో ప్రేమలో పడిన యువకుడు ఆమె కుటుంబంతో ఎలాంటి పాట్లు పడ్డాడు? ఆయా సందర్భాలకు తగ్గట్టు ‘డైమండ్’ రత్నబాబు రాసిన ఫన్నీ డైలాగులు ప్రేక్షకులను నవ్విస్తాయని యూనిట్ సన్నిహిత వర్గాలు తెలిపాయి. ‘రేసు గుర్రం’లో హీరోయిన్ ఫ్యామిలీ టైపులో, ఈ సినిమాలో హీరోయిన్‌ది ఓ వెరైటీ ఫ్యామిలీ అట. ఆ కుటుంబ సభ్యుల క్యారెక్టరైజేషన్లు ఒక్కొక్కటీ ఒక్కో టైప్‌లో డిఫరెంట్‌గా ఉంటాయట! -
హ్యాట్రిక్‌కి క్లాప్!
మంచు విష్ణు, హన్సిక జంటగా రాజ్‌కిరణ్ దర్శకత్వంలో ఎంవీవీ సత్యనారాయణ నిర్మిస్తున్న ‘లక్కున్నోడు’ చిత్రం ఆదివారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి మోహన్‌బాబు క్లాప్ ఇచ్చారు. పూజా కార్యక్రమాల అనంతరం దర్శకుడికి స్క్రిప్ట్ అందించి, చిత్రబృందాన్ని అభినందించారాయన. నిర్మాత మాట్లాడుతూ - ‘‘దేనికైనా రెడీ’, ‘దూసుకెళ్తా’ వంటి విజయాల తర్వాత విష్ణు, హన్సిక జంటగా నటిస్తున్న మూడో చిత్రమిది. కచ్చితంగా హ్యాట్రిక్ మూవీ అవుతుంది. ‘గీతాంజలి’, ‘త్రిపుర’ వంటి హారర్ సినిమాలతో హిట్ దర్శకుడు అనిపించుకున్న రాజ్‌కిరణ్ కూడా ఈ ‘లక్కున్నోడు’తో హ్యాట్రిక్‌పై కన్నేశారు. లవ్ అండ్ కామెడీ ఎంటర్టైనర్. వచ్చే జనవరి 26న చిత్రాన్ని విడుదల చేయాలను కుంటున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే-మాటలు: ‘డైమండ్’ రత్నబాబు, కెమేరా: పీజీ విందా, మ్యూజిక్: అచ్చు, సహ నిర్మాత: రెడ్డి విజయ్‌కుమార్.