సింగం వెనక్కి.. లక్కీ ముందుకి!
అతని పేరు లక్కీ. పేరులో ఉన్న అదృష్టం జీవితంలో లేదనుకుంటాడు. అయితే.. అనూహ్యంగా ఓ రోజు అతడి దగ్గరకి పాతిక కోట్లు వస్తాయి. ఆ డబ్బు ఎవరిది? చేతికి డబ్బు వచ్చిన తర్వాత లక్కీ ఏం చేశాడు? అసలు కథేంటో తెలుసుకోవాలంటే ‘లక్కున్నోడు’ చూడాల్సిందే. మంచు విష్ణు, హన్సిక జంటగా రాజకిరణ్ దర్శకత్వంలో ఎంవీవీ సత్యనారాయణ నిర్మించిన సినిమా ‘లక్కున్నోడు’.
ఈ నెల 26న ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నట్టు నిర్మాత ప్రకటించారు. మొదట ‘లక్కున్నోడు’ని ఫిబ్రవరి 3న రిలీజ్ చేయాలనుకున్నారు. ఈ 26న రిలీజ్ కావాల్సిన సూర్య ‘సింగం–3’ వాయిదా పడడంతో లక్కీగా మంచు విష్ణు ముందుకి రావాలనే నిర్ణయం తీసుకున్నారు. చెన్నైలో ‘జల్లికట్టు’ ఉదంతం, తదనంతర పరిణామాల నేపథ్యంలో ‘సింగం–3’ రిలీజ్‌కి ఇది సరైన సమయం కాదని భావించి వాయిదా వేశామని తెలుగు వెర్షన్ ‘ఎస్3–యముడు3’ నిర్మాత మల్కాపురం శివకుమార్ తెలిపారు.