అందుకే నేను లక్కున్నోణ్ణి
– మంచు విష్ణు
‘‘సుమారు 180 చిత్రాల్లో హీరోగా చేసినా... నటుడిగా 560 చిత్రాలు చేసినా... విలన్ పాత్రంటేనే నాకు ఇష్టం. విలన్ వేషాలు వేద్దామనే మద్రాస్ వెళ్లాను. ప్రతినాయకుడి పాత్ర చేయడం సులువు కాదు. ఈ చిత్రంలో పాత్రకు తగ్గట్టు విలన్‌గా నిర్మాత ఎంవీవీ అద్భుతంగా నటించారు. నా తదుపరి చిత్రంలో అతనే మెయిన్ విలన్’’ అన్నారు మంచు మోహన్‌బాబు. ఆయన కుమారుడు మంచు విష్ణు హీరోగా రాజాకిరణ్ దర్శకత్వంలో ఎంవీవీ సత్యనారాయణ నిర్మించిన చిత్రం ‘లక్కున్నోడు’. ప్రవీణ్ లక్కరాజు స్వరపరచిన ఈ చిత్రం పాటల సీడీలను మోహన్‌బాబు విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ – ‘‘ఈమధ్యకాలంలో ఇంత మంచి చిత్రం చూడలేదు. ప్రతి సీన్‌లోనూ ట్విస్ట్‌తో దర్శకుడు భలే నవ్వించారు. చివర్లో, తండ్రీకొడుకుల సెంటిమెంట్ కంటతడి పెట్టించింది. విష్ణు కోసమే ‘డైమండ్’ రత్నబాబు ఈ కథ రాశాడు. డైలాగులు బాగున్నాయి.
విష్ణు మంచి క్రమశిక్షణ ఉన్నవాడని అందరూ చెబుతుంటే సంతోషంగా ఉంది. జీవితమంతా సుఖాలు లేదా కష్టాలు ఉండవు. ఎప్పుడో ఒకసారి దేవుడు చేయి అందించి, పైకి లాగుతాడు. అందుకని క్రమశిక్షణగా మెలగాలి. ‘చెప్పిన టైమ్ కంటే ముందు సెట్‌కి వెళితే.. దర్శక, నిర్మాతలతో పాటు ప్రతి ఒక్కరూ భయపడతారు. లేటుగా వెళితే వాళ్లకి నువ్వు భయపడాలి. నీకు వాళ్లు భయపడాలా? నువ్వు భయపడాతావా? ఆలోచించుకో’ అని దాసరిగారు అన్నారు. ఆ క్రమశిక్షణ, పద్ధతి నా బిడ్డలకు నేర్పించా’’ అన్నారు. ‘‘పది కోట్ల తెలుగు ప్రజల్లో ఇరవై, ముప్ఫై మంది హీరోలున్నారు. వారిలో నేనొకణ్ణి.
నా తల్లిదండ్రులను, నన్ను ప్రేమించే అభిమానులను చూసి నేను ‘లక్కున్నోడి’గా భావిస్తున్నా’’ అన్నారు మంచు విష్ణు. ‘‘విష్ణుతో మరో సినిమా చేయాలనుంది. ఆయనలాంటి హీరోని నేను చూడలేదు. కామెడీతో పాటు మంచి ఎమోషన్స్ ఉన్న సినిమా ఇది’’ అన్నారు రాజాకిరణ్. ‘‘విష్ణుతో మరిన్ని సినిమాలు చేయాలనుంది. విష్ణు కామెడీ టైమింగ్ సినిమాకి ప్లస్’’ అన్నారు ఎంవీవీ సత్యనారాయణ. ప్రతి ఫ్యామిలీ చూడదగ్గ చిత్రమిదని ‘డైమండ్’ రత్నబాబు అన్నారు. పరుచూరి గోపాలకృష్ణ, పోసాని కృష్ణమురళి, కోన వెంకట్, రఘుబాబు తదితరులు పాల్గొన్నారు.