మోహన్ బాబు ఫ్యామిలీలో వివాదం వేళ.. మంచు విష్ణు పోస్ట్ వైరల్ | Manchu Vishnu Tweet After Clash Between Manoj and Mohan Babu | Sakshi
Sakshi News home page

Manchu Vishnu: 'వచ్చే జన్మలోనైనా తెలుసుకుంటావన్న ఆశ'.. మంచు విష్ణు పోస్ట్ వైరల్

Published Fri, Jan 17 2025 4:26 PM | Last Updated on Fri, Jan 17 2025 4:45 PM

Manchu Vishnu Tweet After Clash Between Manoj and Mohan Babu

టాలీవుడ్ నటుడు మోహన్ బాబు కుటుంబంలో వివాదం మరింత ముదురుతోంది. గతంలో జల్‌పల్లిలోని నివాసం వద్ద ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. మంచు మనోజ్‌, మోహన్‌ బాబు ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. ఆ తర్వాత తలెత్తిన పరిణామాలతో మోహన్ బాబు ఆస్పత్రి పాలయ్యారు. ఓ ప్రైవేట్‌ చికిత్స తీసుకుని వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకున్నారు. ఇటీవల సంక్రాంతి వేడుకల్లో కూడా మంచు విష్ణుతో కలిసి మోహన్ బాబు కూడా పాల్గొన్నారు. అంత బాగుందనుకున్న తరుణంలో మరోసారి వివాదం మొదలైంది.

ఈ పండుగ వేళ మంచు మనోజ్, మౌనిక దంపతులు తిరుపతి రంగంపేటలోని మోహన్ బాబుకు యూనివర్సీటికి వెళ్లడంతో మళ్లీ గొడవ మొదలైంది. మనోజ్ దంపతులను లోపలికి అనుమతించక పోవడంతో ఆయన అనుచరులు గేటు పైకి ఎక్కి లోపలికి ప్రవేశించారు. మనోజ్‌కు అనుమతి లేదని వారు చెప్పడంతో ఇరువర్గాల వారు దూషణకు దిగారు.  మనోజ్‌ అనుచరులు గేట్లు దూకడంతో సిబ్బంది, ప్రైవే­టు బౌన్సర్లు భయంతో పరుగులు పెట్టారు. ఈ క్రమంలో మనోజ్‌ అనుచరులు వారిపైకి రాళ్లు విసిరారు. ఆపై ఎంబీయూలో పని చేస్తున్న కిరణ్‌ కుమార్‌పై దాడి చేశారు.

మంచు విష్ణు ట్విటర్ పోస్ట్ వైరల్..

ఈ గొడవల నేపథ్యంలో టాలీవుడ్ హీరో మంచు విష్ణు చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తాను నటించిన రౌడీ చిత్రంలోని ఓ డైలాగ్‌ ఆడియోను ఆయన ట్విటర్‌లో పంచుకున్నారు. నా ఫేవరేట్‌ డైలాగ్స్‌లో ఇది ఒకటి.. నా ఫేవరేట్ డైరెక్టర్ ఆర్జీవీ ఈ సినిమాను అందించాడు. ఇందులో ప్రతి డైలాగ్ ఒక స్టేట్‌మెంట్‌ అంటూ ఇండస్ట్రీలో మోహన్‌ బాబు 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అంటూ హ్యాష్ ట్యాగ్ జత చేశాడు. ఇంతకీ ఆ డైలాగ్‌ ఏంటో చూసేద్దాం.

'సింహం అవ్వాలని ప్రతి కుక్కకి ఉంటుంది. కానీ వీధిలో మొరగటానికి.. అడవిలో గర్జించటానికి ఉన్న తేడా కనీసం వచ్చే జన్మలోనైనా తెలుసుకుంటావన్న ఆశ' అనే డైలాగ్‌ను మంచు విష్ణు షేర్ చేశారు. అయితే వివాదం కొనసాగుతున్న వేళ ఇలాంటి పోస్ట్‌ చేయడంపై నెటిజన్స్‌ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మంచు మనోజ్‌ను ఉద్దేశించే చేశారా? అనే తెగ చర్చించుకుంటున్నారు. 

కేసులు నమోదు..

ఈ వివాదంతో చంద్రగిరిలో మంచు ఫ్యామిలీపై 2 కేసులు నమోదు అయ్యాయి. మనోజ్‌, మోహన్‌బాబుకు సంబంధించిన ఇరువర్గాల వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రెండు కేసులు నమోదు చేశారు. మోహన్‌బాబు పీ.ఏ చంద్రశేఖర్‌ నాయుడు ఫిర్యాదుతో మంచు మనోజ్‌, మౌనికతో పాటు మరో ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అదే సమయంలో మంచు మనోజ్ కూడా తనతో పాటుగా భార్య మౌనికపై ఎంబీయూ యూనివర్శిటీ వారు దాడికి ప్రయత్నించారంటూ చంద్రగిరి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మోహన్‌బాబు పీఏతో పాటు యూనివర్శిటీ  సిబ్బంది 8 మందిపై మనోజ్‌ ఫిర్యాదు చేశారు. దీంతో ఇరువురిపై పోలీసులు నమోదు చేశారు.

తాత, నానమ్మకు మంచు మనోజ్ దంపతుల నివాళులు..

తిరుపతికి వెళ్లిన మంచు మనోజ్‌.. తన భార్యతో కలిసి తాత, నానమ్మల సమాధుల వద్దకు చేరుకుని నివాళులు అర్పించాడు. శ్రీవిద్యానికేతన్‌లో జరుగుతున్న అక్రమాలు, అన్యాయాలపై ప్రశ్నించడంతోనే తనపై దుష్ప్రచారం చేస్తున్నారని మంచు మనోజ్ చెప్పారు. ఆపై సుమారు 200 మందితో కలిసి ర్యాలీగా శ్రీవిద్యానికేతన్‌ మీదుగా నారావారి­పల్లెకు చేరుకున్న మనోజ​్‌.. అక్కడ మంత్రి నారా లోకేశ్‌తో సుమారు 25 నిమిషాల పాటు భేటీ కావడం విశేషం.
 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement