హన్సిక ఖాతాలో భారీ ఆఫర్..?
బాహుబలి తరువాత అంతటి భారీ చిత్రంగా తెరకెక్కుతున్న సౌత్ సినిమా సంఘమిత్ర. తమిళ దర్శకుడు సుందర్.సి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తూనే ఉంది. ముందుగా టాలీవుడ్, కోలీవుడ్ టాప్ హీరోలతో ఈ సినిమాను తెరకెక్కించాలని భావించిన చిత్రయూనిట్, అది కుదరకపోవటంతో జయం రవి, ఆర్యలతో సరిపెట్టుకున్నారు. టైటిల్లో రోల్లో శృతిహాసన్ నటిస్తుందంటూ ప్రకటించారు.
శృతి కూడా సినిమా కోసం యుద్ధ విద్యలు నేర్చుకునే పని మొదలు పెట్టింది. కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో సినిమాను భారీగా లాంచ్ చేసిన తరువాత శృతి ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. దీంతో నిర్మాతలు మరోసారి హీరోయిన్ కోసం వెతకటం ప్రారంభించారు. నయనతార, అనుష్కల పేర్లు ప్రముఖంగా వినిపించినా.. దర్శకుడు సుందర్.సి మాత్రం హన్సికకే ఓటు వేశాడట. ఇప్పటికే హన్సికతో చంద్రకళ, కళావతి సినిమాలు తెరకెక్కించిన సుందర్, మరోసారి ఆమెతోనే వర్క్ చేసేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నాడు. త్వరలోనే సంఘమిత్ర హీరోయిన్పై చిత్రయూనిట్ క్లారిటీ ఇవ్వనుంది.