అఖిల్ కాదు.. నితిన్‌తోనే.. హను సెకండ్ సినిమాలో ట్విస్ట్! | Hanu Raghavapudi To Direct Nithiin | Sakshi
Sakshi News home page

అఖిల్ కాదు.. నితిన్‌తోనే.. హను సెకండ్ సినిమాలో ట్విస్ట్!

Published Sat, Aug 13 2016 12:59 AM | Last Updated on Mon, Sep 4 2017 9:00 AM

అఖిల్ కాదు.. నితిన్‌తోనే.. హను సెకండ్ సినిమాలో ట్విస్ట్!

అఖిల్ కాదు.. నితిన్‌తోనే.. హను సెకండ్ సినిమాలో ట్విస్ట్!

 దర్శకుడు హను రాఘవపూడి రెండో సినిమాలో హీరో ఎందుకు మారారు?
 అఖిల్ కోసం రాసిన కథతోనే నితిన్‌తో సినిమా చేస్తున్నారా? అసలు ఏం జరిగింది? ‘సాక్షి’ ఎక్స్‌క్లూజివ్ రిపోర్ట్...

 
 హను రాఘవపూడి దర్శకత్వంలో రెండో సినిమా చేస్తున్నట్టు గత నెల 27న అక్కినేని అఖిల్ స్వయంగా ప్రకటించారు. హను రాఘవపూడి ఎవరో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ‘కృష్ణగాడి వీరప్రేమగాథ’తో దర్శకుడిగా పరిచయమై, తొలి అడుగులోనే విజయం సాధించి ఇటు పరిశ్రమ వర్గాలను, అటు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. హను దర్శకత్వంలో అఖిల్ సినిమా ప్రకటించి పట్టుమని పదిహేను రోజులు గడవకముందే ఫిల్మ్ నగర్‌లో ఓ చర్చ మొదలైంది. విశ్వసనీయ వర్గాల ప్రకారం ‘సాక్షి’కి అందిన సమాచారం ఏంటంటే... అఖిల్ డేట్స్ మైత్రి మూవీ మేకర్స్ సంస్థ దగ్గరున్నాయట.
 
  మైత్రిలో రెండో సినిమా చేస్తానని అఖిల్ సంతకం చేశారట. హను రాఘవపూడి తనను ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ ద్వారా దర్శకుడిగా పరిచయం చేసిన 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థకే రెండో సినిమా కమిట్‌మెంట్ ఇచ్చారట. అఖిల్, హను.. ఇలా వేర్వేరు నిర్మాణ సంస్థలతో అగ్రిమెంట్స్ చేసుకోవడంతో రెండో సినిమాకి ఈ కాంబినేషన్ సెట్ అయ్యే పరిస్థితి లేదని తెలిసింది. దీని గురించి క్లియర్‌గా మాట్లాడుకుని కమిట్ అయిన బేనర్‌కి సినిమా చేసి, ఆ తర్వాత తమ కాంబినేషన్‌లో సినిమా చేద్దామని అఖిల్, హను అనుకున్నారట.
 
 ఈ నేపథ్యంలో తన రెండో చిత్రాన్ని నితిన్‌తో చేయబోతున్నారట హను. 14 రీల్స్ దగ్గర నితిన్ డేట్స్ ఉండటంతో హను ఈ హీరోకి ఫిక్సయ్యారని తెలుస్తోంది. అయితే.. అఖిల్ కోసం రాసిన కథతో కాకుండా నితిన్ కోసం లవ్, అడ్వంచరస్ యాక్షన్ నేపథ్యంలో హను కొత్త కథ రాశారట. నవంబర్‌లో షూటింగ్ మొదలు పెట్టాలనుకుంటున్నారట. ఆల్రెడీ స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందని సమాచారం. ఈ సినిమా పూర్తయిన తర్వాత అఖిల్‌తో, అంతకు ముందు ఆయనకు చెప్పిన కథతోనే హను సినిమా చేస్తారని తెలిసింది.
 
 ఈ నెల 27న హను పెళ్లి
 హను రాఘవపూడి త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నారు. విశాఖ అమ్మాయి అమూల్యతో ఈ నెల 27న ఏడడుగులు వేయనున్నారు. పెద్దలు కుదిర్చిన వివాహమిది. రెండు సినిమాల స్క్రిప్ట్ వర్క్స్ పూర్తి చేసిన ఆయన ప్రస్తుతం పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement