క్రికెట్ కోసమే నటుడినయ్యా!
తమిళసినిమా: క్రికెట్ ఆడడం కోసమే నటుడినయ్యానంటున్నారు ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్ ఎన్‌జే.సత్య. ఆ కథేంటో చూద్దామా విజయ్ నటించిన భైరవా, త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న శింబు త్రిపాత్రాభినయం చేసిన అన్భానవన్ అసరాదవన్ అడంగాదవన్ చిత్రం వంటి పలు చిత్రాలకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా పని చేసిన సత్య తాజాగా నటుడి అవతారమెత్తి పలు చిత్రాల్లో వివిధ పాత్రల్లో నటిస్తున్నారు.
కాస్ట్యూమ్ డిజైనర్‌గా బిజీగా ఉన్న సమయంలో నటుడిగా మారడానికి కారణం నటనపై ఆసక్తి కాదట. మరేమిటన్నది ఆయన మాటల్లోనే..నన్ను ఒక క్రికెట్ క్రీడాకారుడిగా చూడాలన్నది మా నాన్న కల. నేను నా ఆసక్తితో కాస్ట్యూమ్ డిజైనర్‌నయ్యాను. అయితే నాన్న కల నిజం చేయడానికిప్పుడు నటుడిగా మారాను. ఇప్పుడు నా లక్ష్యం ఇక్కడ ప్రతి ఏడాది సెలబ్రిటీ క్రికెట్ లీగ్ ఆడుతున్నారు. అందులో నేనూ భాగస్వామ్యం కావాలనుకున్నాను.
అయితే ఆ జట్టులో చోటు సంపాదించాలంటే చిన్నచిన్న పాత్రల్లోనైనా కనీసం ఏడు చిత్రాల్లో నటించాలని చెప్పారు. అందుకే జీవా, వెట్రివేల్, కిడారి, పొదువాగ ఎమ్మనసు తంగం, అన్బానవన్ అసరాదవన్ అడంగాదవన్ చిత్రాల్లో నటించాను. ఇప్పుడు నటుడిగానూ మంచి పాత్రలు లభిస్తున్నాయి. ముఖ్యంగా శింబు నటించిన అన్భానవన్ అసరాదవన్ అడంగాదవన్ చిత్రంలో నటి కస్తూరితో కలిసి నటించాను. ఇందులో మంచి గుర్తిం పున్న పాత్రలో నటించాను. ఈ చిత్రం విడుదల తరువాత మరిన్ని మంచి అవకాశాలు వస్తాయనే నమ్ముతున్నాను. ఇకపై నటుడిగానే కొనసాగాల ని నిర్ణయించుకున్నట్టు తెలిపారు.