హృదయం ఇక్కడ ఉన్నది...
‘ఆల్ ఈజ్ వెల్’ టైటిల్ అసిన్ (29)కు కలిసొచ్చినట్టుంది. ఆ టైటిల్‌కు తగినట్టుగానే ఆమె వృత్తిగత జీవితం, వ్యక్తిగత జీవితం ఆల్ ఈజ్ వెల్‌గా ఉండబోతోంది. మరో రెండు వారాల్లో రిలీజ్ కాబోతున్న ఈ తాజా బాలీవుడ్ సినిమాలో అసిన్, అభిషేక్ బచ్చన్ పక్కన కనిపించనుంది. అయితే ఈ సినిమా ప్రమోషన్ హడావిడి కంటే అసిన్ పెళ్లి వార్త హడావిడే ఇప్పుడు ఎక్కువగా వార్తల్లో ఉంది. అవును. అసిన్ పెళ్లి చేసుకోబోతోంది. తను నటించిన ‘గజిని’ సినిమాలోలానే ఒక పెద్ద కోటీశ్వరుణ్ణి, పారిశ్రామికవేత్తను పెళ్లాడనుంది.
సినిమా నిజమైంది...
సంజయ్ రామస్వామి ప్రఖ్యాత మొబైల్ కంపెనీ అధినేత. కోటీశ్వరుడు. కాని అతడు ఒక సాదాసీదా మోడల్ ప్రేమలో పడతాడు. ఇది ‘గజిని’ సినిమాలో మనం చూశాం. ఇప్పుడు నిజ జీవితంలో కూడా అదే జరిగింది. మైక్రోమాక్స్ మొబైల్ కంపెనీ కో - ఫౌండర్, సి.ఇ.ఓ అయిన రాహుల్ శర్మ (36), అసిన్ ప్రేమలో పడ్డాడు. అసిన్ అతణ్ణి ఇష్టపడింది. వాళ్లిద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు. అసిన్ ఈ వార్తను ధ్రువీకరించిందని భోగట్టా. ‘గజిని’ సినిమాలో తన దగ్గర ఏమీ లేకపోయినా సాటివారికి సాయం చేసే పాత్రలో అసిన్ నటించింది. వ్యక్తిగత జీవితంలో కూడా ఆమె అలాంటి స్వభావం కలిగిన వ్యక్తిగా గుర్తింపు పొందింది. చాలామంది పేద అమ్మాయిలను అసిన్ చదివిస్తోంది. శ్రీలంకలో షూటింగ్ చేయడానికి వెళ్లి అక్కడ తమిళ శిబిరాల వారి పరిస్థితికి చలించి వారి కోసం హెల్త్ క్యాంప్‌లు ఏర్పాటు చేసింది. ముంబైలో అనేక ఎన్‌జిఓలకు ఆమె సపోర్ట్ చేస్తోంది. ‘గజిని’లో ఆమెకు హీరో లభించకపోయి ఉండవచ్చు. కాని నిజ జీవితంలో రాకుమారుడు అందాడు. ‘ఆమె తన వృత్తిగతమైన ఒడంబడికలను త్వరగా ముగించుకుని వ్యక్తిగత జీవితానికి అంకితం కాదలుచుకుంది. బహుశా సినిమాలకు స్వస్తి కూడా చెప్పవచ్చు’ అని ఆమె సన్నిహితురాలు ఒకరు వ్యాఖ్యానించారు.
ఎవరీ రాహుల్ శర్మ
నాగపూర్ యూనివర్సిటీలో చదువుకున్నాడు. ఆ తర్వాత కెనడాలో ఉన్నత విద్య అభ్యసించాడు. ఇండియా తిరిగి వచ్చి మైక్రోమాక్స్ సంస్థను ప్రారంభించాడు. మొదట సాఫ్ట్‌వేర్ రంగంలో పని చేసిన ఈ సంస్థ క్రమంగా మొబైల్స్ రంగంలోకి వచ్చింది. ‘ఎక్కువ సమయం నిలబడగల బ్యాటరీ ఉండే మొబైల్‌ను’ వినియోగదారులకు అందించడం అనే ఐడియా నుంచి మైక్రోమాక్స్ మొబైల్స్‌ను మార్కెట్‌లోకి తెచ్చే ఆలోచనను రాహుల్ శర్మే చేశాడు. కొత్తల్లో ఇది అంత సులువు కాలేదు. కాని రాను రాను భారతీయ మార్కెట్‌లో మైక్రోమాక్స్ సంస్థ తన స్థానాన్ని సుస్థిర పరుచుకుంది.
అక్షయ్ కుమార్ మధ్యవర్తిత్వం...
అసిన్‌కు, రాహుల్ శర్మకు పరిచయం ఏర్పడటానికి హీరో అక్షయ్ కుమార్ కారణం. అసిన్, అక్షయ్‌కుమార్ కలిసి ‘ఖిలాడీ 786’ (2012)లో నటించారు. అక్షయ్ కుమార్ అప్పటికే మైక్రోసాఫ్ట్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నాడు. అందువల్ల సాధారణంగా జరిగే సినిమా పార్టీల్లో వీళ్లను ఒకరికొకరిని పరిచయం చేసి ఉంటాడని భావిస్తున్నారు. అసిన్ అప్పటికే బాలీవుడ్‌లో టాప్‌స్టార్. ఆమె బాలీవుడ్‌లో నటించిన తొలి సినిమా ‘గజిని’ వంద కోట్లు వసూల్ చేసిన తొలి హిందీ సినిమాగా చరిత్ర సృష్టించింది. దానికి ముందే తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఆమెకు విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఇవన్నీ రాహుల్ ఆమె వైపు ఆకర్షింపబడటానికి కారణం అయ్యుండొచ్చు. రాహుల్ శర్మ అందగాడు కావడం, పారిశ్రామికవేత్తగా విజయాలు సాధించడం ఒక ఎత్తయితే అతడికి సంగీతం అంటే ఉండే ఆసక్తి, కార్ల మీద ఉండే క్రేజ్, కొత్త ప్రాంతాలు చూడాలనుకునే ఉత్సుకత ఇవన్నీ అసిన్‌కు నచ్చి ఉంటాయని ఊహించవచ్చు. రాహుల్ శర్మ దగ్గర ప్రస్తుతం ఒక రోల్స్ రాయిస్, బెంట్లే, బిఎండబ్ల్యు, మెర్సిడస్ ఉన్నాయి. అమెరికా వెళితే ఒక కారు తీసుకుని తోచిన ప్రాంతానికి వెళ్లిపోవడం అతడికి సరదా. సంగీతం అంటే ఇష్టం. అసిన్‌ను ఆకట్టుకోవడానికి ఇంతకు మించి ఏం కావాలి అంటున్నారు.
కేరళ నుంచి కోట్లకు...
కొచ్చిలో పుట్టి పెరిగిన అసిన్‌ది దాదాపుగా మధ్యతరగతి కుటుంబం. ఆమె తండ్రి మధ్యతరగతి వ్యాపారాలు చేసేవాడు. తల్లి డాక్టర్. మొదట మోడలింగ్‌లో అడుగుపెట్టిన అసిన్ 2001లో తొలిసారిగా మలయాళ సినిమాలో కనిపించింది. అయితే ఆమెను వెలుగులోకి తెచ్చింది మాత్రం తెలుగు సినిమా రంగమే. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘అమ్మా... నాన్నా... ఓ తమిళ అమ్మాయి’ సినిమా అసిన్‌ను తెలుగు ప్రేక్షకుల దృష్టిలో పడేసింది. అదే సినిమా తమిళంలో రిమేక్ అయ్యి, అక్కడా హిట్ సాధించి అసిన్‌ను బిజీ చేసింది. తెలుగులో ‘ఘర్షణ’, ‘లక్ష్మీ నరసింహ’, ‘చక్రం’ సినిమాల్లో నటించిన అసిన్ ‘గజిని’ సినిమాతో పెద్దస్థాయిని అందుకుంది. కమలహాసన్ సరసన ‘దశావతారం’లో నటించే అవకాశం కూడా దక్కించుకోవడంతో నం.1 సౌత్ హీరోయిన్‌గా ఎదిగింది. ఆ తర్వాత బాలీవుడ్‌లో అవకాశాలు రావడం కెరీర్ తొలి రోజుల్లోనే ఆమిర్‌ఖాన్, సల్మాన్ ఖాన్ సరనన నటించడం ఆమెకు పెద్ద హోదాను తెచ్చాయి. ప్రస్తుతం అసిన్ ముంబైలోని లోఖండ్‌వాలాలో నివాసం ఉంటుంది. కొచ్చి మెరైన్ డ్రైవ్‌లో ఆమెకు ఖరీదైన అపార్ట్‌మెంట్ ఉంది. కొట్టాయం సమీపంలో ఉన్న వెగమాన్ అనే హిల్ స్టేషన్‌లో ఆమెకు ఒక సొంత ఫామ్ హౌస్ కూడా ఉంది.