సుల్తాన్... బాక్సాఫీస్ కా భాయిజాన్! | Here's how Salman Khan prepared himself for the 'paunch' scene in 'Sultan' | Sakshi
Sakshi News home page

సుల్తాన్... బాక్సాఫీస్ కా భాయిజాన్!

Published Tue, Jul 12 2016 11:33 PM | Last Updated on Mon, Sep 4 2017 4:42 AM

సుల్తాన్... బాక్సాఫీస్ కా భాయిజాన్!

సుల్తాన్... బాక్సాఫీస్ కా భాయిజాన్!

 ... హిస్టరీ రిపీట్స్

రంజాన్ పండగకు హీరో సల్మాన్ ఖాన్ సినిమా రిలీజయ్యిందంటే హిట్ గ్యారంటీ. అందుకే ఈ కండలవీరుడు నటించే సినిమాలు ఈ పండుగకే విడుదల కావాలని అభిమానులు కోరుకుంటారు. సల్మాన్‌కి కూడా ఇలా ఈద్ సందర్భంగా సినిమా విడుదల చేయడం ఇష్టమే. మరి... ఈ పండుగకు విడుదలైన ప్రతి సినిమా హిట్టే కాబట్టి, ఆ మాత్రం ఇష్టం ఉండటం కరెక్టే. గతంలో ‘వాంటెడ్’, ‘దబంగ్’, ‘బాడీగార్డ్’, ‘ఏక్ థా టైగర్’, ‘బజరంగీ భాయిజాన్’ చిత్రాలు రంజాన్ కానుకలుగా  విడుదలై, బంపర్ హిట్ సాధించాయి. ఈసారి ఈద్‌కి హిస్టరీ రిపీట్ చేసిన చిత్రం - ‘సుల్తాన్’.
 
 ఈ నెల 6న ఈ చిత్రం విడుదలైంది. ఈద్ పండుగకు రెండు రోజుల ముందే ‘సుల్తాన్’ తెరపైకి దూసుకొచ్చి, విజయ విహారం చేస్తున్నాడు. ఈ చిత్రం వసూళ్లు ఇప్పుడో సంచలనం.
 
 అయిదురోజులకే వచ్చేసిన ఖర్చు!..: విడుదలైన తొలి ఐదు రోజుల్లోనే ఈ చిత్రం 180 కోట్ల రూపాయలు వసూలు చేయడం గురించి ఇప్పుడు అందరూ చెప్పుకుంటున్నారు. ఈ చిత్ర నిర్మాణ వ్యయం దాదాపు 90 కోట్ల రూపాయలని భోగట్టా. కాబట్టి, రిలీజైన బుధవారం నుంచి ఆదివారం దాకా తొలి వారాంతంలోనే బడ్జెట్‌కు రెండింతలు వసూలు చేసిందని హిందీ సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. వసూళ్లలో దాదాపు 50 శాతం పంపిణీదారులకు, థియేటర్ యజమానులకూ పోతే, మిగతా 50 శాతం నిర్మాతకు దక్కుతుందని ఉజ్జాయింపు లెక్క.
 
 అంటే, రిలీజైన వీకెండ్‌కల్లా సినిమాకు పెట్టిన ఖర్చు వచ్చే సిందనుకోవచ్చు. సోమవారం నుంచి వస్తున్నదంతా లాభాలే. రిలీజైన ఐదు రోజుల్లోనే సినిమా లాభాల బాట పట్టడంతో యశ్‌రాజ్ ఫిల్మ్స్‌కు చెందిన నిర్మాత ఆదిత్యా చోప్రా ఆనందపడ తారని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో సల్మాన్ మల్ల యోధుడిగా కనిపించిన విషయం తెలిసే ఉంటుంది. దీని కోసం బరువు పెరిగి, తగ్గి.. ఇలా రెండు రకాలుగా సల్మాన్ కనిపించి, ఆకట్టుకున్నారు. ఆ శ్రమకు తగ్గ ఫలితమే దక్కింది.
 
 వారం లోపే 200 కోట్ల క్లబ్‌లో...: ఇక.. ఈ సినిమాకి రిలీజ్ వ్యూహం కూడా కలిసొచ్చింది. మామూలుగా వీకెండ్ వసూళ్లు రాబట్టుకోవడానికి శుక్రవారం సినిమాలను రిలీజ్ చేస్తుంటారు. ఒక్కోసారి అటూ ఇటూ అవుతుంది. అలాగే, పవిత్ర ఉపవాస దినాలన్నీ అయిపోతాయి కాబట్టి, సర్వసాధారణంగా రంజాన్ పండగ రోజునే సినిమా రిలీజ్ కూడా జరిగేలా చూస్తారు. కానీ, సల్మాన్ ‘సుల్తాన్’ రెండు రోజుల ముందే వచ్చింది.
 
 రంజాన్‌ను టార్గెట్ చేసి, 6న రిలీజ్  చేశారు. ఈసారి రంజాన్ ఒక రోజు ఆలస్యమై, 8న రావడం కూడా సినిమాకు బాగా ఉపయోగప డింది. ఆ తర్వాత వారాంతం. దాంతో మంచి వసూళ్లు రాబట్ట గలిగింది. సల్మాన్ గత చిత్రం ‘బజరంగీ భాయిజాన్’ (2015) శుక్రవారం నుంచి ఆదివారం దాకా తొలి వారాంతంలో రూ. 102 కోట్ల వసూలు చేస్తే, ‘సుల్తాన్’ ఆ మూడు రోజులకీ రూ. 107 కోట్లు సాధించింది. ఇప్పటి వరకు ఇదే అత్యధికం.
 
 సల్మాన్‌ఖాన్ ‘బజ్‌రంగీ భాయిజాన్’, ఆమిర్ ఖాన్ సూపర్ హిట్ మూవీ ‘పీకే’ ఏడు రోజుల్లో వసులు చేసిన మొత్తాలను (వరుసగా రూ. 182 కోట్లు, రూ. 179 కోట్లు) అయిదు రోజులకే ‘సుల్తాన్’ దాటేయడం విశేషం. దేశవ్యాప్తంగా దాదాపు 4,350 స్క్రీన్స్‌లో విడుదలైన ఈ చిత్రం మొదటి నుంచీ రోజూ సగటున దాదాపు రూ. 36 కోట్ల పైచిలుకు వసూలు చేసింది. ఆ తర్వాత నాలుగు రోజులూ ఆ స్థాయి కలెక్షన్సే రాబట్టింది. వీకెండ్ తర్వాత టికెట్ రేట్లు తగ్గినా, థియేటర్లలో ‘సుల్తాన్’ పట్టు సడలలేదని సినీ వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. ఏమైనా రిలీజై, వారం కూడా పూర్తి కాకముందే ‘సుల్తాన్’ 200 కోట్ల క్లబ్‌లో చేరి, సుల్తాన్ బాక్సాఫీస్ భాయిజాన్ అనిపించుకున్నాడు.
 
 అంతర్జాతీయంగా..: విదేశాల్లో కూడా ‘సుల్తాన్’ హవా సాగుతోంది. విదేశాల్లో దాదాపు వెయ్యికి పైగా థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ఇప్పటికే 14 మిలియన్ డాలర్లు (దాదాపు రూ. 96 కోట్లు) వసూలు చేసింది. మన సోదర దేశమైన పాకిస్తాన్‌లో సైతం ‘ఈద్’ పండుగ ‘సుల్తాన్’కు బాగా కలిసొచ్చింది. ఆ దేశంలో కూడా రూ. 15 కోట్ల పైగా వసూళ్ళు వచ్చినట్లు భోగట్టా. రానున్న రోజుల్లో వచ్చే తదుపరి వసూళ్లను బట్టి ఇది ఏ రేంజ్ చిత్రం అవుతుందో తెలుస్తుంది. ఏమైనా, ఈ ఏటి టాప్ 3 హిందీ చిత్రాల్లో ‘సుల్తాన్’ ఒకటి అవుతుందని బాక్సాఫీస్ పండితులు ఇప్పటికే అంచనా వేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement