హీరోలకు దీటుగా... ధీమాగా... దర్జాగా... | heriones are giving competition to heros | Sakshi
Sakshi News home page

హీరోలకు దీటుగా... ధీమాగా... దర్జాగా...

Published Sun, Dec 29 2013 12:48 AM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

heriones are giving competition to heros

ఓ సినిమా విజయం సాధిస్తే... ఆ ఘనతను ఎక్కువ శాతం హీరోకి ఆపాదిస్తారు. అలాగే దర్శకుడికి కూడా కొంత భాగం దక్కుతుంది. కానీ, మెరుపు తీగలా కనిపించి, కనువిందు చేసే హీరోయిన్ గురించి పెద్దగా మాట్లాడుకోరు. అయితే, కొన్ని సినిమాల విషయంలో దీనికి మినహాయింపు ఉంటుంది. ముఖ్యంగా ఈ ఏడాది బాలీవుడ్‌లో బంపర్ హిట్ అయిన సినిమాల్లో హీరోలకు ఎంత భాగం ఉందో, హీరోయిన్లకూ అంతే ఉంది. ఆ సినిమాలో ఆ ‘నాయిక’ నటించి ఉండకపోతే, కచ్చితంగా ఇంత హిట్టయ్యేది కాదనే స్థాయిలో కొంతమంది కథానాయికలకు పేరొచ్చింది. అలా ఈ ఏడాది హీరోలకు దీటుగా పేరు తెచ్చుకున్న హీరోయిన్ల గురించి తెలుసుకుందాం...
 
 
 ఈ ఏడాది బాలీవుడ్ క్వీన్: ఈ ఏడాది బాలీవుడ్‌లో దీపికా పదుకునేదే హవా. వరుసగా నాలుగు విజయవంతమైన చిత్రాల్లో నటించి, 2013లో ‘నంబర్ వన్’ నాయిక అనిపించుకున్నారు. ఈ సొట్ట బుగ్గల సుందరి నటించిన ‘రేస్ 2’, ‘యే జవానీ హై దివానీ’, ‘చెన్నయ్ ఎక్స్‌ప్రెస్’, ‘రామ్‌లీలా’ చిత్రాలు ఘనవిజయం సాధించాయి. ఈ చిత్రాలన్నీ వంద కోట్ల క్లబ్‌లో చేరినవే. ఈ చిత్రాల విజయానికి హీరో ఎంత కారణమో, హీరోయిన్ కూడా అంతే కారణమని బాలీవుడ్‌వారు అంటున్నారు.  ఈ విజయాల్లో సమ భాగం దక్కించుకున్నందున దీపికా మార్కెట్ మరింత పెరిగింది. ‘క్వీన్ ఆఫ్ ది 2013’ తనే అని కూడా కితాబులిచ్చేస్తున్నారు.
 
 
 హాట్ గాళ్ మాత్రమే కాదు: హాట్ గాళ్ ఇమేజ్ తెచ్చుకున్న కంగనా రనౌత్ కేవలం గ్లామరస్ రోల్స్‌కి మాత్రమే పనికొస్తుందనేవారు. కానీ, ఆ అభిప్రాయం మార్చుకునేలా చేశారామె. ఈ మధ్య విడుదలైన ‘క్రిష్ 3’ చిత్రంలో కంగనాతో పాటు ప్రియాంక చోప్రా కూడా నటించినా, కంగనాకే ఎక్కువ మార్కులు పడ్డాయి. ఇక, ‘రజ్జో’ చిత్రంలో తన నటన ‘భేష్’ అంటున్నారు. ఈ చిత్రం మొత్తాన్ని కంగనా తన భుజాల మీద నడిపించేసిందని ప్రశంసిస్తున్నారు. ఇక, జాన్ అబ్రహాం నటించిన ‘షూట్ అవుట్ ఎట్ వదాలా’ విజయంలో కథానాయిక కంగనాకి ఎక్కువ భాగస్వామ్యమే ఉందని బాలీవుడ్ ప్రముఖులు చెబుతున్నారు. కంగనాని గ్లామరస్ రోల్స్‌కి మాత్రమే కాదు.. అభినయానికి ఆస్కారం ఉన్న పాత్రలకు కూడా తీసుకోవచ్చని ఫిక్స్ అయ్యారు.
 
 రెడ్ కార్పెట్‌పై హాట్‌గా.. సిల్వర్ స్క్రీన్‌పై హోమ్లీగా: తొలి చిత్రం ‘సావరియా’తో తనలో మంచి నటి ఉందని నిరూపించుకున్నారు సోనమ్ కపూర్. వెండితెరపై మాత్రమే కాదు.. విడిగా కూడా చాలా గ్లామరస్‌గా డ్రెస్ చేసుకోవడం సోనమ్ అలవాటు. ముఖ్యంగా పలు వేడుకల్లో గ్లామరస్‌గా డ్రెస్ చేసుకొని ఎర్ర తివాచీపై ఆమె నడిచే హంస నడకలను చూపులు తిప్పుకోకుండా చూసేవారి సంఖ్య చాలానే ఉంది. అలాంటి సోనమ్ ‘రాన్‌జనా’ చిత్రం కోసం పూర్తిగా మారిపోయారు.
 
  సాదాసీదా ‘దేశీయ వనిత’గా ఆమె ఒదిగిపోయిన వైనానికి శెభాష్ అనకుండా ఉండలేకపోయారు. ఈ చిత్రవిజయంలో హీరో ధనుష్‌కి ఎంత భాగం ఉందో, అంతే భాగం సోనమ్‌కి కూడా ఉంది. అలాగే, ‘భాగ్ మిల్కా భాగ్’లో సోనమ్ చేసింది చిన్న పాత్రే అయినా, సినిమాకి చాలా ప్లస్ అయ్యిందిసవాల్‌ని ఎదుర్కొంది: ఈ ఏడాది మంచి నటిగా పేరు తెచ్చుకున్న తారల జాబితాలో నిమ్రత్ కౌర్‌ని విస్మరించలేం. ‘ది లంచ్ బాక్స్’లో హౌస్‌వైఫ్ కేరక్టర్‌ను అద్భుతంగా చేశారు నిమ్రత్. అది కూడా సీనియర్ ఆర్టిస్ట్ ఇర్ఫాన్ ఖాన్ సరసన ఆయనకు దీటుగా నటించడం అంటే ఏ యువ హీరోయిన్‌కైనా సవాల్‌లాంటిదే. ఆ సవాల్‌ని సమర్థవంతంగా ఎదుర్కొన్నారు కాబట్టే, ఎంతోమంది స్టార్ హీరోయిన్స్ మధ్య ఈ యువ హీరోయిన్ మంచి గుర్తింపు తెచ్చుకోగలిగారు.
 
 ఇంకా ఈ ఏడాది ఇలా ఆయా సినిమాల విజయానికి దోహదపడిన తారల్లో దివ్య దత్తా, హ్యుమా ఖురేషి, రిచా చడ్డా, శిల్పా శుక్లా కూడా ఉన్నారు. ‘భాగ్ మిల్కా భాగ్’, ‘జిల్లా గజియాబాద్’, ‘లూటేరా’ చిత్రాల్లో దివ్య దత్తా చేసినవి సహాయ పాత్రలే అయినా, ఆ చిత్రాలకు ఓ హీరోయిన్ అన్నట్టుగా అనిపించాయి. అలాగే, ‘ఏక్ తి దయాన్’, ‘డి-డే’, ‘ఫార్ట్స్’ చిత్రాల్లో కథానాయికగా నటించిన హ్యూమా ఖురేషీకి కూడా మంచి పేరొచ్చింది. అందం, అభియం మెండుగా ఉన్న తారగా హ్యుమాని అభినందిస్తున్నారు. ఇక, రిచా చడ్డా విషయానికొస్తే.. ‘ఫక్రి’, ‘షార్ట్స్’, ‘రామ్‌లీలా’ చిత్రాల్లో ఆమె ఓ నాయికగా నటించారు. రిచా అభినయాన్ని విమర్శకులు సైతం అభినందించారు. ‘బి.ఎ. పాస్’ చిత్రంలో బోల్డ్ రోల్ చేసి శిల్పా శుక్లా అందర్నీ ఆకట్టుకున్నారు. శిల్పాకి మంచి భవిష్యత్తు ఉందని బాలీవుడ్‌వారు అంటున్నారు. ఈ ఏడాది హీరోలతో పాటు హీరోయిన్ల హవా కూడా సాగింది. మరి.. 2014లో కూడా కథానాయికల హవా నడుస్తుందా? ఔననే అంటున్నాయి బాలీవుడ్‌వారు.
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement