అష్టాచమ్మాలో నానికి అవకాశం ఎలా వచ్చిందంటే... | Hero Nani Birthday Special | Sakshi
Sakshi News home page

అష్టాచమ్మాలో నానికి అవకాశం ఎలా వచ్చిందంటే...

Published Mon, Feb 24 2020 5:25 PM | Last Updated on Mon, Feb 24 2020 7:22 PM

Hero Nani  Birthday Special  - Sakshi

నాచురల్‌ స్టార్‌ నాని పూర్తిపేరు గంటా నవీన్‌బాబు‌. గంటా రాంబాబు, విజయలక్ష్మీ దంపతులకు 1984 ఫిబ్రవరి 24న జన్మించిన నానికి.. చిన్నప్పటినుంచే సినిమాలపై ఆసక్తి ఉండేది. దీంతో డిగ్రీ సెకండ్‌ ఇయర్‌లో ఉండగానే చదువు  మధ్యలో వదిలేసి అవకాశాల కోసం డైరెక్టర్‌ ఆఫీసుల చుట్టూ తిరిగేవాడు. అలా బాపు దర్శకత్వంలో తెరకెక్కిన రాధాగోపాలం సినిమాకు క్లాప్‌ అసిస్టెంట్‌గా అవకాశం వచ్చింది. తర్వాత రాఘవేంద్రరావు, శ్రీనువైట్ల దగ్గర పనిచేశాడు. ఆ తర్వాత హైదరాబాద్‌లో రేడియోజాకీలో పనిచేస్తున్న సమయంలో ఓ వాణిజ్యప్రకటనలో నాని నటనను చూసి దర్శకుడు ఇంద్రగంటి మోమన్‌కృష్ణ ‘అష్టాచమ్మా ’సినిమాలో అవకాశం ఇచ్చాడు. మొదట ఈ సినిమాలో నానిని సెకండ్‌ లీడ్‌గా అనుకున్నా..నాని నటనకు ఇంప్రెస్‌ అయ్యి మెయిన్‌లీడ్‌లో నటించే అవకాశం ఇచ్చాడు దర్శకుడు.  అలా అసిస్టెంట్‌ డైరెక్టర్‌ స్థాయి నుంచి సినీ హీరోగా ఎదిగాడు. 

తర్వాత  ‘రైడ్‌’, ‘స్నేహితుడా’, ‘భీమిలి కబడ్డీ’ జట్టు సినిమాల్లో నటించినా అవి పెద్దగా సక్సెస్‌ కాలేవు. 2011 లో నందినీరెడ్డి దర్శకత్వంలో నాని హీరోగా తెరకెక్కిన ‘అలా మొదలైంది’ సినిమా..నాని కెరియర్‌కు బాగా ప్లస్‌ అయ్యింది. ఎటువంటి అంచనాలు లేకుండా రిలీజైన ఈ సినిమా.. 23 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టింది. ఈ సమయంలోనే తమిళంలో వెప్పం అనే సినిమాలోనూ నటించాడు. ఇది తెలుగులో ‘సెగ’ పేరుతో రిలీజైంది. 2012లో రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘ఈగ’ సినిమాలో నానిది తక్కువ నిడివే అయినా తన నటనతో అందర్నీ ఆకట్టుకున్నాడు. అదే సంవత్సరం గౌతమ్‌మీనన్‌ దర్శకత్వంలో నాని, సమంత  నటించిన ఎటో వెళ్లిపోయింది సినిమాతో మరోసారి ఆకట్టుకొని నంది అవార్డును అందుకున్నాడు. నిర్మాతగా నాని తీసిన మొదటి సినిమా ఢీ ఫర్‌ దోపిడి. ఈ సినిమా భారీ నష్టాలను మిగిల్చింది. 


‘పైసా’, ‘జెండాపై కపిరాజు’ సినిమాల్లో నటించినా అవి పెద్దగా ఆడలేదు. ఇక నాని సినీ గ్రాఫ్‌ పడిపోతుంది అనుకున్న సమయంలో  2015లో నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో వచ్చిన ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ సినిమాలో నటించి మంచి క్లాసిక్‌ హిట్‌ను అందుకున్నాడు. అదే సంవత్సరం ‘భలేభలే మగాడివోయ్‌’ సినిమా విడుదలై నాని కెరియర్‌లోనే బిగెస్ట్‌ హిట్‌గా నిలిచింది. ఓవర్సీస్‌ మార్కెట్‌లోనూ ఈ సినిమా మంచి వసూళ్లను కొల్లగొట్టింది. ఆ తర్వాత 2017 వరకు కృష్ణగాడి వీరప్రేమగాధ, జెంటిల్‌మెన్‌, మజ్ను, నేను లోకల్‌, నిన్నుకోరి, ఎమ్‌సిఎ...ఇలా 2015 నుంచి వరుసగా 8 సినిమాలు సూపర్‌ సక్సెస్‌ అయ్యాయి.  2018లో నాగార్జునతో కలిసి దేవదాసు సినిమాలో నటించాడు. అ అనే సినిమాతో నిర్మాతగానూ మంచి విజయం సాధించాడు. 2019లో గ్యాంగ్‌లీడర్‌, జెర్సీ సినిమాలతో మంచి హిట్‌ అందుకున్నాడు. బిగ్‌బాస్‌2 సిరీస్‌కి హాస్ట్‌గానూ మెప్పించి అందరి ప్రశంసలు దక్కించుకున్నాడు.


 


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement