దర్శకుడైన హీరో విక్రమ్!
హీరో విక్రమ్ ఇప్పుడు దర్శకుడి అవతారమెత్తారు. అదేంటి? శుభ్రంగా హీరోగా చేస్తున్నవాడు... ఇలా దర్శకుడయ్యాడేమిటని నివ్వెరపోకండి! ఆ మధ్య చెన్నై నగరాన్ని వర్షాలు, వరదలు ముంచెత్తి, జనజీవ నాన్ని అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే. జనం కృతనిశ్చయంతో ఆ కష్టాలను అధిగమించారు. చెన్నై నగర వాసుల్లోని స్ఫూర్తిదాయకమైన ఈ సానుకూల అంశాన్ని ప్రతిఫలిస్తూ, విక్రమ్ ఇప్పుడో పాటను వీడియోగా చిత్రీకరిస్తున్నారు. అలా ఈ హీరో తొలిసారిగా దర్శకుడి అవతారమెత్తారు.
‘ది స్పిరిట్ ఆఫ్ చెన్నై’ (చెన్నై నగర స్ఫూర్తి) అనే ఈ పాట చిత్రీకరణ కూడా సహజంగానే చెన్నై నగరంలోనే చేస్తున్నారు. విశేషం ఏమిటంటే, బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ కూడా వచ్చి ఇందులో నటించారు. ప్రముఖ రచయిత మదన్ కార్కీ (‘బాహుబలి’లో కిల్కి భాష సృష్టికర్త), రాకేశ్, గానా బాల ఈ పాట రాశారు. 20 మందికి పైగా పాడారు. తమిళ హీరో సూర్య, మలయాళ నటుడు నివిన్ పాలీ, కన్నడ హీరో పునీత్ రాజ్‌కుమార్, ఇంకా శివకార్తికే యన్, ప్రభుదేవా, ‘జయం’ రవి, జీవా, భరత్, వరలక్ష్మీ శరత్‌కుమార్ తదితరులు వీడియోలో నటించారు. మొత్తానికి, కొన్నేళ్ళ క్రితం మణిరత్నం ‘రావణ్’లో కలసి నటించినప్పటి నుంచి స్నేహితులైన విక్రమ్, అభిషేక్‌లు ఇంతకాలానికి మళ్ళీ కలసి కెమేరా ముందుకు రావడం విశేషమే.