ప్రశ్నించడమే నేరమా? : విశాల్
షాక్ కాదుగానీ...ఆశ్చర్యమేసింది: హీరో
Published Tue, Nov 15 2016 8:52 AM | Last Updated on Mon, Sep 4 2017 8:10 PM
చెన్నై: ప్రశ్నించడమే నేరమా? ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు ప్రతి పౌరుడికీ ఉంటుందని నటుడు, నిర్మాత, నడిగర్ సంఘం కార్యదర్శి విశాల్ అన్నారు. తమిళ నిర్మాతల సంఘం నిర్వాహకులపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై తాత్కాలిక సస్పెన్షన్ విధించినట్లు నిర్మాతల మండలి ప్రకటన విడుదల చేసిన నేపథ్యంలో ఆయన స్పందించారు. ఇది తనకు షాక్ అని భావించను గానీ, ఆశ్చర్యపరచిందన్నారు. తనకు నిర్మాతల సంఘం నుంచి అంతకు ముందు ఎప్పుడో ఒక లేఖ వచ్చిందనీ, అందులో సంఘం అధ్యక్షుడి పేరుగానీ, కార్యదర్శి పేరుగానీ లేదనీ, ఒక న్యాయవాది ద్వారా ఆ లేఖను పంపారనీ వివరించారు.
అయినా ఒక నిర్మాతగా సహ నిర్మాతలకు మంచి జరగాలని కోరుకోవడం, వారి పక్కన నిలబడి ప్రశ్నంచడం నేరమా? అని ప్రశ్నించారు. తన సస్పెన్షన్‌ను చట్టబద్దంగా ఎదుర్కొంటానని, ఈ విషయంలో భయపడేది లేదనీ సోమవారం విలేకరుల సమావేశంలో విశాల్ తెలిపారు. నిజానికి తాను చేసిన నేరం ఏమిటో తనకు తెలియదన్నారు. అప్పుడెప్పుడో ఒక పత్రికకు ఇచ్చిన భేటీలో నిర్మాతల సంఘం నిర్వాహకులు నిర్మాతల శ్రేయస్సు గురించి పట్టించుకోవడం లేదనీ, బోండా, బజ్జీలు తింటూ కాలం గడిపేస్తున్నారని అన్నానని తెలిపారు.
అలా అనడం తప్పని తాను భావించడం లేదని పేర్కొన్నారు. అదే తప్పు అయితే అంతకు ముందు అలాంటి వ్యాఖ్యల్నే నటుడు కరుణాస్ చేశారనీ, ఆయనపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. అప్పట్లో నడిగర్ సంఘంలోనూ ఇలాంటి పరిస్థితే ఎదురైతేనే తాను ఎన్నికల్లో పోటీ చేయాల్సి వచ్చిందన్నారు. పైరసీని అరికట్టే విషయంలో నిర్మాతల సంఘం ఎలాంటి చర్యలు తీసుకుందని ప్రశ్నించారు. ఈ విషయం లో చాలా మంది తనకు ఫోన్ చేసి అడుగుతున్నారన్నారు. అలాంటిది నిర్మాతల సంఘం నుంచి వస్తే తాను వారికి సహకరించగలనీ అన్నారు.
నిర్మాతల సంఘం ఎన్నికల్లో పోటీ చేస్తాం
ఏ విషయంలోనైనా పోటీ ఉండాలన్నారు. జనవరిలో జరగనున్న నిర్మాతల మండలి ఎన్నికల్లో తన తరఫు నుంచి పోటీ ఉంటుందనీ విశాల్ వెల్లడించారు. తనకు ఎవరిపైనా వ్యక్తిగత విరోధాలు లేవనీ, నిర్మాతల సం ఘం అధ్యక్షుడు కలైపులి ఎస్.థాను అంటే తనకు గౌరవమనీ తెలిపారు. అలాగని తనతో చిత్రం చేయమని ఆయన్ని అడగలేదనీ అన్నారు. ఎవరైనా నిర్మాతలు ఈ విషయంలో మద్దతు తెలిపారా? అన్న ప్రశ్నకు వ్యక్తిగతంగా తనకు ఎవరూ మద్దతు తెలపాల్సిన అవసరం లేదనీ, తన పోరాటంలో న్యాయం ఉందనిపిస్తే వారే మద్దతిస్తారనీ బదులిచ్చారు.
Advertisement