రజనీ సార్ రాజకీయాల్లోకి రావాలి: హీరోయిన్
రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తాడనే ప్రచారం జరుగుతూనే వస్తోంది. అభిమానులు, కొంత మంది నాయకులు ఆయన రాజకీయ ఆరంగ్రేటం కోసం ఎదురుచూస్తున్నారు. అందులో తాను ఉన్నానని అంటోంది విశ్వనటుడు కమలహాసన్ వారసురాలు. రజనీకాంత్ సార్ రాజకీయాల్లోకి రావాలని భారతీయ చిత్ర పరిశ్రమలోనే క్రేజీ నటిగా విరజిల్లుతున్న నటి శృతిహాసన్ అన్నది. ఈ బోల్డ్ తార ఏం చెప్పినా, ఏం చేసినా సంచలనమే. తనకు నచ్చింది చేసే, మనసుకు తట్టింది చెప్పే అరుదైన హీరోయిన్లలో శృతి ఒకరని చెప్పడం ఏ మాత్రం అతిశయోక్తి కాదు. ఆ మధ్య పెళ్లికి ముందే బిడ్డను కంటాను అని ఈ బ్యూటీ అన్నట్లు మీడియాలో వైరల్ అయింది. ఈ ప్రచారంలో నిజం లేదని స్పష్టం చేసిన శృతి పలు అంశాల గురించి ఒక భేటీలో తనదైన బాణీలో టకటకా చెప్పేశారు. వాటిలో కొన్నిటిని చూద్దాం.
తాను ఎవరి సిపార్సుతోనూ నటిని కాలేదని.. సొంత ప్రయత్నంతోనే ఈ స్థాయికి ఎదిగానని చెప్పారు. తన తండ్రి సాధనలో తాను ఒక్క శాతం కూడా సాధించలేదన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో స్త్రీలకు రక్షణ కరువైందని ఆమె అన్నారు. దీనికి ఎవరినీ తప్పు పట్టి లాభం లేదని ఈ సమాజమే అలా ఉందన్నారు. మన దేశంలో మగవారికే గౌరవం అధికం అని పేర్కొన్నారు. చాలా మంది మగబిడ్డ పుడితే పండగ చేసుకుంటారని, ఆడపిల్ల పుడితే బాధ పడతారని శృతి అన్నారు. అయితే తమ ఇంట్లో అలా కాదన్నారు. తనకు మగపిల్లాడు పుడితే ఆడవారిని గౌరవించాలనే విషయాలు నేర్పిస్తానన్నారు. తమిళనాడు గానీ, తమిళులను గానీ తక్కువ చేసి మాట్లాడితే తాను అలాంటి వారి పని పడతానని నటి హెచ్చరించారు.
తన తండ్రి ఒక టీవీలో నిర్వహిస్తున్న బిగ్‌బాస్ షో గురించి స్పందించాల్సిందిగా కోరగా ఆ షోను తాను ఇంకా చూడలేదని చెప్పారు. నటుడు రజనీకాంత్ రాజకీయ రంగప్రవేశం గురించి జరుగుతున్న చర్చపై మాట్లాడుతూ రజనీ సార్ రాజకీయాల్లోకి రావాలన్నారు. అప్పుడే తమిళనాడులో మార్పు వస్తుందనీ, సినిమా రంగానికీ గౌరవం పెరుగుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సంఘమిత్ర చిత్రం వివాదం గురించి అడిగిన ప్రశ్నకు అది ముగిసిపోయిన కథ అని బదులిచ్చారు. ప్రస్తుతం ఈ బ్యూటీ తన తండ్రి దర్శకత్వంలో నటిస్తున్న శభాష్‌నాయుడు షూటింగ్ కోసం ఎదురు చూస్తున్నారు. అదే విధంగా మళ్లీ సంగీతంపై దృష్టిసారిస్తున్నారు. తన సంగీత బృందంతో కలిసి మ్యూజిక్ ఆల్బమ్‌ను తయారు చేయాలన్న ఆలోచనలో ఉన్నారట.