
అదిరేటి ఆఫర్?
తెలుగులో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్‌లో రకుల్ ప్రీత్‌సింగ్ ఒకరు. ఆమె కెరీర్ దూకుడు మీద ఉంది. స్టార్ హీరోల సరసన జతకడుతూ, బిజీ బిజీగా సినిమాలు చేసేస్తున్నారు రకుల్. ప్రస్తుతం ఫిలింనగర్‌లో ఆమె గురించి ఓ వార్త హల్‌చల్ చేస్తోంది. పవన్ కల్యాణ్ సరసన రకుల్ అవకాశం దక్కించుకున్నారన్నది ఆ వార్త సారాంశం. ఎస్.జె. సూర్య దర్శకత్వంలో పవన్ కల్యాణ్ హీరోగా ఓ చిత్రం రూపొందనున్న విషయం తెలిసిందే.
ఈ చిత్రంలో రకుల్‌ని కథానాయికగా తీసుకోవాలనుకుంటున్నారట. అదే కనుక జరిగితే.. వరుసగా మెగా హీరోల సరసన రకుల్ జతకడుతున్నట్లు అవుతుంది. రామ్‌చరణ్ సరసన ‘బ్రూస్‌లీ’, అల్లు అర్జున్‌తో ‘సరైనోడు’లో జతకట్టారు రకుల్. మళ్లీ రామ్‌చరణ్‌తో ‘ధ్రువ’ చేస్తున్నారు. ఒకవైపు అబ్బాయ్‌తో జతకట్టిన రకుల్ మరోవైపు బాబాయ్ పవన్ కల్యాణ్ చిత్రం కూడా అంగీకరించారట. మరి.. ఈ వార్తలో ఎంతవరకూ నిజం ఉందో నిలకడ మీద తెలుస్తుంది.