‘వాళ్ల సినిమాలు చెత్తగా ఉన్నా ఆడతాయి’
సాక్షి, చెన్నై: చిత్ర పరిశ్రమలో మగవారిదే పైచేయి అని నటి జ్యోతిక వ్యాఖ్యానించారు. హీరో సూర్యను ప్రేమించి పెళ్లి చేసుకుని నటనకు విరామం ఇచ్చిన జ్యోతిక, వయదినిలే చిత్రంతో రీఎంట్రీ ఇచ్చారు. తాజాగా మరో చిత్రం మగళీర్ మట్టుంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇందులో ఆమెతో పాటు నటి ఊర్వశి, శరణ్యపొన్‌వన్నన్, భానుప్రియ నటించారు. 2డీ ఎంటర్‌టెయిన్‌మెంట్ పతాకంపై సూర్య నిర్మించిన ఈ చిత్రం ఈనెల 15న విడుదల కానుంది.
ఈ సందర్భంగా జ్యోతిక మాట్లాడుతూ.. మగళీర్ మట్రుం రోడ్‌ట్రిప్ నేపథ్యంలో సాగే కథా చిత్రమని, ఇంతకు ముందెప్పుడూ తెరపైకి రానటువంటి కథతో వస్తున్న చిత్రం అని చెప్పారు. ఊర్వశి, శరణ్య పొనువన్నన్, భానుప్రియలతో కలిసి నటించడం సంతోషంగా ఉందన్నారు. అంతేకాక చిత్ర పరిశ్రమపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ఒక్క విషయం మాత్రం చెప్పాలి. పురుషాధిక్యత గల పరిశ్రమ ఇది. హీరోలు నటించిన ఎంత చెత్త సినిమా అయినా నాలుగైదు రోజులు ఆడతుంది.
అదే హీరోయిన్ సెంట్రిక్ కథా చిత్రం అయితే ఎంత మంచి కాన్సెప్ట్‌తో రూపొందినా వారం తరువాతే వసూళ్లను రాబట్టు కోగలుగుతుంది. అదే విధంగా మహిళా రచయితలకు ప్రాముఖ్యత తక్కువే. ఈ పరిస్థితి మారాలి. సుధ కొంగర లాంటి మహిళా దర్శకురాలికి నటుడు మాధవన్ అవకాశం కల్పించకపోతే ఇరుదుచుట్రు లాంటి విజయవంతమైన చిత్రం వచ్చేది కాదు. పరిశ్రమలో మహిళలకు తగిన స్థానం కల్పించాలి' అని జ్యోతిక కోరారు.