magalir mattum
-
చెయ్యేసే బాస్‌కు బడితపూజ
ఆడవాళ్లకు మాత్రమే సీటులో కూర్చుంటే ఏం తెలుస్తుంది? ఆఫీసుకు టైమ్‌కు వస్తుంది టైమ్‌కు వెళుతోంది అని అనిపిస్తుంది. కాని ఒకామె భర్తకు ఉద్యోగం పోయింది. ఇంట్లో ఉంటున్నాడు. ఉద్యోగం పోయినందుకు చిన్నబుచ్చుకుంటూ ఇంట్లో ఉన్నందుకు భార్యకు సాయం చేస్తూ చిన్న పాప ఉంటే ఆ పాపను చూసుకుంటూ ఉన్నాడు. భర్త గురించి ఆమెకు టెన్షన్. కాని తయారయ్యి ఆఫీసులో సీటులో కూర్చుని ఉంటే ఆ టెన్షన్ కనిపిస్తుందా? ఇంకొక ఆమెకు మొగుడు తాగుబోతు. దేవుడి హుండీని కూడా లుంగీలో దాచుకెళ్లి చుక్కేసుకొని వచ్చి పెళ్లాంతో వాదులాటకు దిగుతుంటాడు. చిన్న గుడిసె. లేని బతుకు. జీవితం గడవాలంటే పని చేయాలి. తనొచ్చి ఆఫీసులో చీపురు పట్టి ఊడుస్తూ ఉంటే ఆమె టెన్షన్ కనిపిస్తుందా? ఇంకొక అమ్మాయికి పెళ్లి కాదు. వీళ్లు యాభై వరకు అనుకొని ఉంటారు. వచ్చినవాడు లక్ష అడుగుతుంటాడు. పైగా ఇరవై తులాల బంగారం పెట్టాలట. బండి ఇవ్వాలట. పెళ్లి ఖర్చులు పెట్టుకోవాలట. ఆ అమ్మాయికి కోపం. అలాగైతే తాళి నేను కడతాను కట్టించుకోమనండి అంటుంది. అలాంటి అమ్మాయి తన సీటులో తాను కూర్చుని ఉంటే ఆ సమస్య కనిపిస్తుందా? ఆఫీసు టైము టెన్ టు ఫైవ్. ఆ టైములో వీరు ముగ్గురు ఆఫీసులో అవైలబుల్గా ఉంటారు. సీట్లలో కూర్చుని ఉంటారు. వీళ్లకు బాస్ తను. అనగా వీళ్లపై సర్వాధికారి తను. వీళ్ల ఒంటి మీద చెయ్యేస్తే ఏమవుతుంది? ఏమవుతుంది... ‘ఆడవాళ్లకు మాత్రమే’ కథ అవుతుంది. ∙∙ గార్మెంట్స్ ఫ్యాక్టరీ అది. అందరూ మహిళా ఉద్యోగులే. ఒంటి మీద బట్టలు కుట్టే వీళ్ల వొంటి మీది పవిట పట్టుకుని లాగాలనుకునే మేనేజర్ నాజర్. కింది ఉద్యోగులు ఏం చేయగలరు? ఏమైనా చేయాలనుకుంటే ఉద్యోగం తీసేయడూ? అదీ అతడి ధైర్యం. నాజర్‌ది గొప్ప పురుష హృదయం. అతడికి పీఏ, కంప్యూటర్ డిజైనర్, స్వీపర్ అనే తేడా లేదు. అందరూ కావాలి. తను పిలిస్తే అందరూ వస్తారని అభిప్రాయం. ఊర్వశి– అతడి పీఏ. ఆమెను పిలిచి తన కుర్చీ పక్కన నిలబడేలా చేసి వెనుక నుంచి తడిమేసే ప్రయత్నం చేస్తుంటాడు. రోహిణి– ఆ ఆఫీసు స్వీపర్. లోపలికి పిలిచి ‘నువ్వు బాగా చిమ్మాలి’... ‘నువ్వు బాగా పని చేయాలి’... ‘నువ్వు...’ ఈ ‘నువ్వు’ అనేటప్పుడంతా అతడు తన చూపుడు వేలిని ఆమె ఎద మీద గుచ్చుతుంటాడు. ఆమె చీపురు అడ్డం పెట్టుకుంటూ ఉంటుంది. రేవతి– కంప్యూటర్ డిజైనర్. ఈ అమ్మాయి చదువుకున్న అమ్మాయి కాబట్టి లంచ్‌కు పిలుస్తుంటాడు. ‘ఏదో జోక్‌లో చదివాను. ఇలాగే ఒక మేనేజర్, అతడి అసిస్టెంట్ అమ్మాయి కలిసి భోం చేస్తుంటే ‘నంచుకోవడానికి ఏమైనా ఉందా’ అని మేనేజర్ అడుగుతాడు. ‘నంచుకోవడానికి ఏమీ లేదు కాని ఉంచుకోవడానికి నేనున్నాను’ అని ఆ అమ్మాయి అంటుంది’ అని పెద్దగా నవ్వుతాడు. మరి నీ సంగతి ఏమిటి అన్నట్టు చూస్తాడు. దారిన పోయే వెధవ ఒక మాట అనేసి పోతాడు. బస్సులో రాసుకుని వెళ్లే వెధవ బస్సు ఆగగానే దిగి వెళ్లిపోతాడు. ఇది అలా కాదు. ఈ బాస్ రోజూ ఉంటాడు. రోజూ వేధిస్తుంటాడు. తందామంటే తన్నలేరు. మాట విందామంటే వినలేరు. నరకం. ∙∙ ఆఫీసులో ఏదో పొరపాటు జరుగుతుంది. ముగ్గురి మీద పోలీసు కంప్లయింట్ పెడతాను అని బెదిరిస్తాడు నాజర్. అలా వద్దనుకుంటే నాతో మూడు రోజులు గెస్ట్‌హౌస్‌లో గడపాలి అని కోరతాడు. ముందు నుయ్యి. వెనుక గొయ్యి. సరే అని ఒప్పుకుని గెస్ట్‌హౌస్‌కు వెళతారు ముగ్గురు. కాని ఏమయితే అదవుతుందని అతణ్ణి చావబాది కట్టేస్తారు. ఆ తర్వాత పెద్ద ఇంజనీరింగ్ చేసి అతణ్ణి దూలానికి వేళ్లాడ గట్టి బాత్రూమ్కు వెళ్లగలిగేలా భోజనం చేసేలా ఏర్పాట్లు చేసి బంధిస్తారు. మమ్మల్ని హింసించినందుకు ఇది నీకు శిక్ష అని చెబుతారు. అంతే కాదు అతడి చేత సంతకం పెట్టించి ఆఫీసు ఇన్‌చార్జ్‌షిప్ తీసుకుంటారు. అప్పటి దాకా మగవాడి దృష్టికోణం నుంచి ఆఫీసు నడుస్తుంది. ఇప్పుడు స్త్రీల దృష్టి కోణంలో. ఆఫీసును మంచి ఈస్తటిక్ సెన్స్‌తో డెకరెట్ చేస్తారు. ఆడవాళ్లకు ఇబ్బంది కలిగించే విషయాలను తొలగిస్తారు. తల్లులైన ఉద్యోగుల కోసం ఆఫీసులోనే క్రష్ పెడతారు. ఆఫీసు ఎంతో బాగుపడుతుంది. కాని నాజర్ బుద్ధి మాత్రం మారదు. అతడు స్త్రీలను వేధించడానికే ప్రయత్నిస్తుంటాడు. చివరకు హెడ్డాఫీసు వారికి అతడి వ్యవహారం తెలుస్తుంది. అండమాన్ బ్రాంచ్‌కు ట్రాన్స్ఫర్ చేయడంతో కథ సుఖాంతం అవుతుంది. సినిమా ముగుస్తుంది. ∙∙ పని చేసే ఆడవాళ్లు పని చేయడానికి మాత్రమే వస్తారు. వ్యక్తిగత జీవితంలో వారికి ఉండే వొత్తిళ్లు వారికి ఉంటాయి. వారి సంపాదన కుటుంబానికి ముఖ్యం కావచ్చు. అలాగే చేసే పనిలో కూడా వొత్తిళ్లు, సవాళ్లు ఉంటాయి. ఇన్ని ఉండగా వాళ్లు స్త్రీలైన పాపానికి హరాస్మెంట్కు దిగితే ఎంత అవస్థగా ఉంటుంది. కక్కలేక మింగలేక వాళ్లు పడే అవస్థ అవసరమా? ‘నవమాసాలు మోసి కనేది తల్లి. కాని ఇంటి పేరు మాత్రం తండ్రిది’ అనే డైలాగ్ ఉంటుంది ఈ సినిమాలో. ‘పేరుకు లేడీస్ స్పెషల్ బస్సు. కాని నడిపేది మాత్రం మగవాడు. అందుకే ఆడవాళ్లను చూసినా ఆపడు’ అనే డైలాగ్ కూడా ఉంది. వేధింపులకు మూలమైన బేస్ వేల ఏళ్ల నుంచి మగాడు సిద్ధం చేసి ఉన్నాడు. కాని ఆడవాళ్లు తమకు తాముగా నిర్ణయాత్మక స్థానాల్లోకి వచ్చినప్పుడు ఈ పరిస్థితులను మార్చుకుంటారు అని ఈ సినిమా చెబుతుంది. మనసులో దురుద్దేశం పెట్టుకుని ‘సునందా... ఒకసారి కేబిన్‌లోకి రా’ అని పిలిచే బాసులారా.. జాగ్రత్త. మిమ్మల్ని తలకిందులు చేసే శక్తి వారికి ఉంది. బీ గుడ్. డూ గుడ్. మగళిర్ మట్టుమ్ సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో కమలహాసన్ నిర్మాతగా 1994లో విడుదలైన సినిమా ‘మగళిర్ మట్టుమ్’. తెలుగులో మురళీమోహన్ డబ్ చేయగా ‘ఆడవాళ్లకు మాత్రమే’గా విడుదలైంది. వర్కింగ్ విమెన్ ఎదుర్కొనే సెక్సువల్ హరాస్మెంట్ మీద పూర్తి కమర్షియల్ ఫార్మెట్లో వచ్చిన తొలి సినిమా ఇదే కావచ్చు. దీనికి మూలం హాలీవుడ్లో సూపర్ హిట్టయిన ‘9 టు 5’ (1980). 10 మిలియన్లతో తీసిన ఆ సినిమా ఆ రోజుల్లోనే వంద మిలియన్లు సంపాదించింది. బహుశా అమెరికాలో ఆ సమయంలో పని చేసే ఆడవాళ్లు ఎక్కువ కావడం వర్క్‌ప్లేస్ హరాస్మెంట్ ఎక్కువ ఉండటం కారణం కావచ్చు. తమిళంలో మంచి విజయమే సాధించిన ఆడవాళ్లకు మాత్రమే తెలుగులో పూర్తిగా సఫలం కాలేదు. దానికి కారణం అప్పటికి నాజర్ ఇంకా పూర్తిగా తెలుగువారికి తెలియకపోవడమే. అయినా ఈ సినిమా సున్నితమైన హాస్యంతో ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా రేవతి, రోహిణి, ఊర్వశి గొప్ప నటనతో ఆకట్టుకుంటారు. డీగ్లామరస్‌గా కనిపించే రోహిణి అచ్చు ఒక పనిమనిషిలానే ఉంటుంది. ఇందులో ‘శవం’ పాత్ర నగేశ్ పోషించాడు. క్లయిమాక్స్‌లో కమలహాసన్ కాసేపు కనపడతాడు. హిందీలో ఈ సినిమాను రణధీర్ కపూర్‌తో తీశారు. కాని ఏ కారణం చేతనో సినిమా విడుదల కాలేదు. అయితే ‘మగళిర్ మట్టుమ్’ కంటే ఏడాది ముందు ‘9 టు 5’ స్ఫూర్తితోనే జంధ్యాల ‘లేడీస్ స్పెషల్’ తీశారు. కాని ఫ్లాప్ అయ్యింది. సింగీతం శ్రీనివాసరావు – కె -
‘వాళ్ల సినిమాలు చెత్తగా ఉన్నా ఆడతాయి’
సాక్షి, చెన్నై: చిత్ర పరిశ్రమలో మగవారిదే పైచేయి అని నటి జ్యోతిక వ్యాఖ్యానించారు. హీరో సూర్యను ప్రేమించి పెళ్లి చేసుకుని నటనకు విరామం ఇచ్చిన జ్యోతిక, వయదినిలే చిత్రంతో రీఎంట్రీ ఇచ్చారు. తాజాగా మరో చిత్రం మగళీర్ మట్టుంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇందులో ఆమెతో పాటు నటి ఊర్వశి, శరణ్యపొన్‌వన్నన్, భానుప్రియ నటించారు. 2డీ ఎంటర్టెయిన్మెంట్ పతాకంపై సూర్య నిర్మించిన ఈ చిత్రం ఈనెల 15న విడుదల కానుంది. ఈ సందర్భంగా జ్యోతిక మాట్లాడుతూ.. మగళీర్ మట్రుం రోడ్‌ట్రిప్ నేపథ్యంలో సాగే కథా చిత్రమని, ఇంతకు ముందెప్పుడూ తెరపైకి రానటువంటి కథతో వస్తున్న చిత్రం అని చెప్పారు. ఊర్వశి, శరణ్య పొనువన్నన్, భానుప్రియలతో కలిసి నటించడం సంతోషంగా ఉందన్నారు. అంతేకాక చిత్ర పరిశ్రమపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ఒక్క విషయం మాత్రం చెప్పాలి. పురుషాధిక్యత గల పరిశ్రమ ఇది. హీరోలు నటించిన ఎంత చెత్త సినిమా అయినా నాలుగైదు రోజులు ఆడతుంది. అదే హీరోయిన్ సెంట్రిక్ కథా చిత్రం అయితే ఎంత మంచి కాన్సెప్ట్‌తో రూపొందినా వారం తరువాతే వసూళ్లను రాబట్టు కోగలుగుతుంది. అదే విధంగా మహిళా రచయితలకు ప్రాముఖ్యత తక్కువే. ఈ పరిస్థితి మారాలి. సుధ కొంగర లాంటి మహిళా దర్శకురాలికి నటుడు మాధవన్ అవకాశం కల్పించకపోతే ఇరుదుచుట్రు లాంటి విజయవంతమైన చిత్రం వచ్చేది కాదు. పరిశ్రమలో మహిళలకు తగిన స్థానం కల్పించాలి' అని జ్యోతిక కోరారు. -
ఢీ అంటే ఢీ అంటున్న స్టార్ హీరోయిన్లు..
నటి జ్యోతిక నయనతారతో ఢీకొనడానికి సిద్ధం అవుతున్నారా? అవుననే అంటున్నారు చిత్ర వర్గాలు. ఒకప్పుడు అగ్రనాయకిగా వెలుగొంది వివాహానంతరం సినిమాలకు దూరమై కొంతకాలం తర్వాత రీఎంట్రీ ఇచ్చిన నటి జ్యోతిక. ప్రస్తుతం అగ్రనాయకిగా రాణిస్తున్న నటి నయనతార. వీరిద్దరి మధ్య పోటీ నెలకొనబోతోంది. నటి జ్యోతిక 36 వయదినిలే చిత్రంతో సక్సెస్ అందుకుని తన జోరు పునరావృతం చేసుకున్నారు. ప్రస్తుతం మగళీర్ మట్టుం చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. జ్యో మరో చిత్రంలోనూ నటించేస్తున్నారు. ఆ చిత్ర దర్శకుడు బాలా. దీనికి నాచనార్ అనే పేరు నిర్ణయించారు. ఇందులో జీవీ.ప్రకాశ్‌కుమార్ హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రం ఇప్పటికి 80 శాతం షూటింగ్ పూర్తి చేసుకుందట. చిత్రాన్ని సెప్టెంబర్ 28న విడుదల చేయడానికి యూనిట్ వర్గాలు సన్నాహాలు చేస్తున్నాయట. ఇదే తేదీన నయనతార నటిస్తున్న వేలైక్కారన్ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు ఆ చిత్ర నిర్మాత ఆర్డీ.రాజా ఇప్పటికే వెల్లడించిన విషయం తెలిసిందే. ఇందులో శివకార్తీకేయన్ కథానాయకుడు. ఈయన నయనతారతో కలిసి నటిస్తున్న తొలి చిత్రం ఇదే. మోహన్‌రాజా దర్శకుడు. ఈ చిత్రంపై భారీ అంచనాలే నెలకొన్నాయి. మొత్తం మీద నయనతార, జ్యోతికల చిత్రాలు ఒకే రోజున తెరపై పోటీ పడనున్నాయన్నమాట. -
విజయ్‌తో జ్యోతిక నటించడం లేదా?
ఇళయదళపతి విజయ్‌కు జంటగా జ్యోతిక నటించడం లేదా? ఈ ప్రశ్నకు కోలీవుడ్ వర్గాల నుంచి లేదనే సమాధానం వినిపిస్తోంది. విజయ్, దర్శకుడు అట్లీల కాంబినేషన్ లో తాజాగా చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇది విజయ్ 61వ చిత్రం. ఆయనకు జంటగా సమంత, కాజల్, జ్యోతిక నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇతర పాత్రల్లో సత్యరాజ్, ఎస్జే.సూర్య, వడివేలు, సత్యన్, కోవైసరళ నటిస్తున్నారు.ఈ చిత్ర షూటింగ్ ఇటీవల ప్రారంభమైంది. కాగా సూర్యను ప్రేమించి వివాహమాడిన తరువాత నటి జ్యోతిక నటన కు దూరంగా ఉన్నారు. ఈ మధ్యనే 36 వయదినిలే చిత్రం ద్వారా రీఎంట్రీ అయి న జ్యోతిక కథానాయకి ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటిస్తున్నారు. అదీ సొంత సంస్థ 2డీ ఫిలింస్ నిర్మించే చిత్రాల్లోనే నటిస్తున్నారు. ప్రస్తుతం మగళీర్ మట్టుం చిత్రంలో నటిస్తున్నారు. కాగా విజయ్ 61వ చిత్రంలో జ్యోతిక ఒక నాయకిగా నటిస్తే బాగుంటు ందని దర్శకుడు అట్లీ భావించారట. అదే విషయాన్ని జ్యోతికను కలిసి విన్నవించగా ఆమె పాత్ర నచ్చితే నటిస్తానని మాటిచ్చారట. అయితే అట్లీ కథ వినిపించగా జ్యోతిక తన పాత్రకు సంబంధించి కొన్ని మార్పులు, చేర్పులు చేయాలని సూచించారట. అందుకు అంగీకరించిన దర్శకుడు అట్లీ ఆ తరువాత మళ్లీ జ్యోతికను కలవలేదని సమాచారం. కారణం జ్యోతిక పాత్ర కాస్త నెగిటీవ్ షేడ్స్ కలిగి ఉంటుందని, ఆ పాత్రను జ్యోతిక చెప్పినట్లు మార్చితే ఆ పాత్ర స్వభావం మారిపోతుందని అట్లీ భావించడంతో ఇప్పుడా పాత్ర కు వేరే నటిని ఎంపిక చేయాలనుకుంటున్నారని కోలీవుడ్ వర్గాల సమాచారం. -
ప్రయాణం మొదలైంది!
‘జ్యోతిక ఈజ్ బ్యాక్’ అని అందరూ మెచ్చుకునే రేంజ్లో ఆమె ‘36 వయదినిలే’ చిత్రంలో అద్భుతంగా నటించారు. హీరో సూర్యను పెళ్లి చేసుకుని, ఇద్దరు బిడ్డలకు తల్లయిన జ్యోతిక మళ్లీ సినిమాల్లో కొనసాగాలనుకుని, ‘36 వయదినిలే’ ద్వారా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. ఆ చిత్రం మంచి విజయం సాధించింది. ఇప్పుడు ‘మగళిర్ మట్టుమ్’ అనే మరో లేడీ ఓరియంటెడ్ మూవీలో నటిస్తున్నారు. ఈ చిత్రం సెకండ్ లుక్ సంక్రాంతి సందర్భంగా విడుదలైంది. జ్యోతిక బైక్ మీద వెళుతున్న ఫొటోని చూస్తుంటే, ఇందులో ఆమెది పవర్ఫుల్ రోల్ అని అర్థమవుతోంది. ‘‘ప్రభ (ఈ సినిమాలో జ్యోతిక పాత్ర పేరు) ప్రయాణం మొదలైంది’’ అంటూ సెకండ్ లుక్‌ను సూర్య విడుదల చేశారు. ఈ చిత్రానికి ఆయనే నిర్మాత. బ్రహ్మ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. అన్నట్లు.. ఆ మధ్య తన భార్యకు సూర్య బైక్ ఎలా నడపాలో నేర్పించారు. చెన్నై రోడ్స్ మీద జ్యోతిక ద్విచక్ర వాహనం నేర్చుకోవడం చాలామంది కంట పడింది. ఇప్పుడామె ఎందుకు బైక్ నేర్చుకుంటున్నారా? అనుకున్నవాళ్లకు ఈ సెకండ్ లుక్ సమాధానం చెప్పేసింది. ఈ సినిమా కోసమే జ్యోతిక బైక్ నేర్చుకున్నారని ప్రత్యేకంగా చెప్పాలా! -
జ్యోతిక చిత్రం విడుదల ఎప్పుడో?
గతంలో టాప్ కథానాయకిగా వెలుగొందిన నటి జ్యోతిక. నటుడు సూర్యను ప్రేమించి పెళ్లాడిన తరువాత నటనకు దూరం అయిన విషయం తెలిసిందే. ఈ బహుభాషా నటి దశాబ్ధం తరువాత మళ్లీ నటిగా రీఎంట్రీ అయ్యి 36 వయదినిలే చిత్రంతో వెండితెరపైకి వచ్చి విజయం సాధించారు. ఆ తరువాత పలు అవకాశాలు వచ్చినా చిత్రాల ఎంపికలో ఆచి తూచి అడుగేస్తున్న జ్యోతిక కుట్రం కడిదల్ చిత్రం ఫేమ్ దర్శకుడు బ్రహ్మ చెప్పిన కథకు ఇంప్రెస్ అయ్యి ఆ కథలో నటించడానికి సిద్ధమయ్యారు. మగళీర్ మట్టుం పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాజర్, లివింగ్స్టన్, భానుప్రియ, ఊర్వశి, శరణ్య తదితరులు ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు. జిబ్రాన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రానికి మణికంఠన్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. స్త్రీ ప్రాధాన్యతతో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సూర్య 2డీ ఎంటర్టెయిన్ మెంట్ సంస్థ నిర్మిస్తోంది. కాగా చిత్ర షూటింగ్ పూర్తి చేసుకున్న మగళీర్ మట్టుం చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను శరవేగంగా జరుపుకుంటోంది. చిత్రాన్ని పిబ్రవరి నెలలో విడుదల చేయాలని భావిస్తున్నట్టు చిత్ర వర్గాలు తెలిపాయి. కాగా సూర్య నటించిన భారీ చిత్రం ఎస్–3 ఈ నెల 26న తెరపైకి రావడానికి ముస్తాబవుతుండడం గమనార్హం. -
మహిళలు మాత్రమే!
టైటిల్ చూసి కంగారు వద్దండీ.. మహిళలే కాదు.. మగవాళ్లూ సినిమా చూడొచ్చు. కానీ, టైటిల్ మాత్రం ‘మగళిర్ మట్టుమ్’ అని పెట్టారు. అంటే... ‘మహిళలు మాత్రమే’ అని అర్థం. జ్యోతిక నటిస్తున్న తాజా చిత్రమిది. ఇందులో ఆమె డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్‌గా నటిస్తున్నారు. జ్యోతిక భర్త, ప్రముఖ తమిళ హీరో సూర్య ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ‘36 వయదినిలే’లో మధ్య తరగతి మహిళగా సినిమా అంతా చీరల్లోనే కనిపించిన జ్యోతిక తాజా సినిమా కోసం మోడ్రన్ స్టైల్లోకి వచ్చేశారు. ఇందులో భానుప్రియ, ఊర్వశి, శరణ్య.. కీలక పాత్రలు చేస్తున్నారు. కాగా, గతంలో ఇదే టైటిల్‌తో కమల్ ఓ సినిమా నిర్మించి, అతిథి పాత్ర చేశారు. తాజా చిత్రంలో సూర్య అతిథి పాత్రలో కనిపిస్తారని టాక్. ఆ సంగతలా ఉంచితే.. జ్యోతిక సినిమాకి ఈ టైటిల్ పెట్టడానికి పర్మిషన్ కోరుతూ కమల్ని సూర్య కలిశారట. కమల్ కాదంటారా! -
జర్నలిస్ట్ పాత్రలో జ్యోతిక
లాంగ్ గ్యాప్ తరువాత రీ ఎంట్రీ ఇచ్చిన సౌత్ స్టార్ హీరోయిన్ జ్యోతిక మరో విభిన్న పాత్రలో ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది. హీరో సూర్యతో వివాహం తరువాత నటనకు గుడ్ బై చెప్పేసిన ఈ బ్యూటి 2015లో రిలీజ్ అయిన 36 వయదినిలే సినిమాతో తిరిగి వెండితెర మీద సందడి చేసింది. సూర్య నిర్మాతగా తెరకెక్కిన ఈ సినిమా జ్యోతికకు మరోసారి మంచి గుర్తింపు తీసుకువచ్చింది. అదే జోరులో ఇప్పుడు మరో ఇంట్రస్టింగ్ క్యారెక్టర్లో ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది జ్యోతిక. మగలిర్ మట్టుమ్ అనే పేరుతో తెరకెక్కుతున్న సినిమాలో జ్యోతిక జర్నలిస్ట్‌గా కనిపించనుంది. మరోసారి సూర్య నిర్మాతగా తెరకెక్కుతున్న ఈసినిమాకు బ్రహ్మ దర్శకుడు. దసరా సందర్భంగా సూర్య.., ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశాడు. జ్యోతికతో పాటు సీనియర్ నటీమణులు శరణ్య, భానుప్రియ, ఊర్వశిలు ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా తమిళ్‌తో పాటు తెలుగులోనూ ఒకేసారి రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు.