సినిమాల నుంచి తప్పుకోవాల్సి వస్తే..
చెన్నై : చిత్రపరిశ్రమ నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి వస్తే.. అంటున్న సమంత తన మనోభావాల్ని మీడియాతో పంచుకున్నారు. సంమంత క్రేజీ హీరోయిన్ అన్న విషయాన్ని చెప్పనక్కర్లేదు. తమిళ, తెలుగు భాషల్లో ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో అరడజను చిత్రాలున్నాయి. అవన్నీ ప్రముఖ హీరోల సరసన నటిస్తున్న చిత్రాలే కావడం గమనార్హం.
ఈ చెన్నై చిన్నది ఇంత బిజీగా ఉన్నా ఇంకో పక్క సమాజ సేవ చేయడం తన సేవాతత్వానికి నిదర్శనంగా చెప్పవచ్చు. దీనిపై ఆమె మాట్లాడుతూ.. ‘నేను నటిగా మంచి పేరు సంపాదించుకున్నాను. సినిమాల్లో నటిస్తూనే సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నాను. అందువల్ల నాకు విశ్రాంతి లేకుండా పోయింది. ఈ రెండింటినీ ఏక కాలంలో ఎలా చేయగలుగుతున్నారు? శ్రమ అనిపించడం లేదా? అని పలువురు అడుగుతున్నారు. నిజం చెప్పాలంటే పని లేకుంటేనే నాకు ఏమీ తోయదు.
లోకంలో నాకంటే అందగత్తెలు చాలా మంది ఉన్నారు. నా కంటే ప్రతిభావంతురాళ్లు ఎందరో ఉన్నారు. వాళ్లందరి మధ్యలో భగవంతుడు నాకు హీరోయిన్ స్టేటస్ ఇచ్చాడు. కాబట్టి నటనను నేను ప్రాణంగా భావిస్తున్నాను. సినిమాపై నా ప్రేమకు ఎల్లలే లేవు. ఎప్పుడూ షూటింగ్ స్పాట్‌లోనే ఉండాలనిపిస్తోంది. ఇంటికి వెళ్లడానికి కూడా ఇష్టం ఉండటం లేదు.
షూటింగ్‌ల తోనే సంతోషం కలుగుతోంది. సినిమానే నా జీవితంగా మారిపోయింది. ప్రతిభ, పేరు, డబ్బు, హోదా అన్నీ భగవంతుడు నాకు స్థాయికి మించి ఇచ్చాడు. ఆ కృతజ్ఞతతోనే పేదలకు సాయం చేస్తున్నాను. నాకు సినీ అవకాశాలు తగ్గితే, చిత్రపరిశ్రమ నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడితే నా పూర్తి జీవితాన్ని సమాజసేవకు అంకితం చేస్తాను.’ అని చెప్పారు.